'ది ఫ్రీలాన్సర్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

The Freelancer

The Freelancer Review

  • మోహిత్ రైనా ప్రధాన పాత్రగా 'ది ఫ్రీలాన్సర్'
  • ఆయన యాక్టింగ్ హైలైట్ 
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • నిర్మాణ విలువల పరంగా తగ్గని వెబ్ సిరీస్
  • రానున్న ఎపిసోడ్స్ పై పెరిగిన ఆసక్తి 

'ది ఫ్రీలాన్సర్' .. ఇప్పుడు 'హాట్ స్టార్' లో అందుబాటులో ఉన్న భారీ వెబ్ సిరీస్. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన 4 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికీ .. ఒక తీవ్రవాద సంస్థకి సంబంధించిన కథ ఇది. నీరజ్ పాండే క్రియేటర్ గా వ్యవహరించిన ఈ కాన్సెప్ట్ కి భావ్ ధూలియా దర్శకత్వం వహించాడు. ఫ్రైడే స్టోరీ టెల్లర్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ ఎక్కువగా ముంబై .. సిరియా .. మొరాకో ప్రాంతాల్లో నడుస్తుంది. ఇనాయత్ ఖాన్ (సుశాంత్ సింగ్) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు .. ఆయన భార్య సబీనా. వారి ఒక్కగానొక్క సంతానమే 'అలియా' (కశ్మీర పరదేశి). సింగపూర్ లో చదువుతూ ఉండగా అలియాకి 'మోసేన్' అనే యువకుడితో పరిచయం ఏర్పడుతుంది .. అది కాస్తా ప్రేమగా మారుతుంది. మోసేన్ కుటుంబం గురించి వాకబు చేసిన ఇనాయత్ ఖాన్, వారికి మలేసియాలో వ్యాపారాలున్నాయని తెలుసుకున్న తరువాతనే తన కూతురునిచ్చి పెళ్లి జరిపిస్తాడు.

మోసేన్ ఫ్యామిలీతో కలిసి విమానం ఎక్కిన అలియా నుంచి ఎలాంటి కాల్ రాదు. ఆమె అత్తగారి తరఫువారి ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ఛాఫ్ అని వస్తుంటాయి. దాంతో కంగారుపడిపోయిన ఇనాయత్ ఖాన్, అందుకు సంబంధించిన డిపార్టుమెంటువారిని కలుస్తాడు. తన కూతురు ఆచూకీ తెలుసుకోవలసిందిగా కోరతాడు. ఎవరి నుంచి కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో సూసైడ్ చేసుకుంటాడు. ఈ వార్త తెలిసి అవినాశ్ (మోహిత్ రైనా) షాక్ అవుతాడు. గతంలో అతనికి ఇనాయత్ ఖాన్ ఫ్యామిలీతో మంచి పరిచయం ఉంటుంది. 

గతంలో ఇనాయత్ ఖాన్ .. అవినాశ్ డిపార్టుమెంటులో కలిసి పనిచేస్తారు. కొన్ని కారణాల వలన బిడ్డను కోల్పోయిన అవినాశ్ .. తన ఉద్యోగంలో నుంచి కూడా సస్పెండ్ చేయబడతాడు. బిడ్డను కోల్పోయి మానసిక స్థితి దెబ్బతిన్న భార్యను మామూలు మనిషిని చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవినీతి అధికారుల ఆదేశాలను పాటిస్తూ ఆత్మవంచన చేసుకోవడం నచ్చని అవినాశ్, తన స్నేహితులతో కలిసి తాను ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుంటాడు. పెద్ద పెద్ద ఆపరేషన్లు నిర్వహించే 'ఫ్రీలాన్సర్'గా మారతాడు. 

అలియాకి మాయమాటలు చెబుతూ మోసేన్ ఫ్యామిలీ ఆమెను సిరియా వరకూ తీసుకుని వెళతారు. ఆమె నుంచి ఫోన్ లాక్కుంటారు. తాను మోసపోయాననీ .. తాను ఒక తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించే ఫ్యామిలీ ఉచ్చులో చిక్కుకున్నానని అలియాకి అర్థమవుతుంది. తన దగ్గరున్న మరో ఫోన్ ద్వారా .. తన తండ్రి సెల్ కి మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ ను అవినాశ్ కి ఫార్వార్డ్ చేస్తుంది సబీనా. ఆమె అవినాశ్ చేతుల్లో పెరిగిన పిల్ల. అందువలన ఆమెను తీవ్రవాదుల చెరలో నుంచి విడిపించడానికి అవినాశ్ రంగంలోకి దిగుతాడు. 

అలియాను కాపాడటం కోసం అవినాశ్ ఏం చేస్తాడు? ఆయన ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? ఇక తీవ్రవాదుల చెరలో చిక్కుకున్న అలియా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ. 

రితేశ్ షా .. బెనజీర్ అలీ ఫిదా అందించిన కథ ఇది. ఈ కథను ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించడంలో దర్శకుడు భావ్ ధూలియా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగానే ముందుకు సాగుతుంది. కథను నేరుగా చెప్పకుండా మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతూ ఉండటం .. అలాగే అవినాశ్ ఫ్యామిలీ బాండింగ్ ఎపిసోడ్స్ .. ఆయన ఆపరేషన్స్ నిర్వహించే తీరు .. ఆకట్టుకుంటాయి.  'ఫ్రీలాన్సర్' గా అవినాశ్ నిర్వహించే ఆపరేషన్ తో కథను మొదలుపెట్టడంతో అంచనాలు పెరుగుతాయి. 

పోలీస్ ఫ్యామిలీలో పుట్టిపెరిగిన ఒక యువతి .. పెళ్లి పేరుతో తీవ్రవాద సంస్థకి చేర్చబడినప్పుడు ఆ యువతి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె పేరెంట్స్ ఎంతలా బాధపడతారు? అనేది దర్శకుడు గొప్పగా ఆవిష్కరించాడు. అలాగే ఆమెను తీవ్రవాదుల చెరకు చేర్చేవరకూ జరిగే ప్రక్రియను కూడా దర్శకుడు చాలా నేచురల్ గా చూపించాడు. ఇక హీరోగా మోహిత్ రైనా .. వన్ మెన్ ఆర్మీలా కథను ముందుకు నడిపించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ను .. ఆయన కాంబినేషన్లో ఫైట్స్ డిజైన్ చేసిన తీరుకి మంచి మార్కులు పడతాయి. 

నిర్మాణ విలువల పరంగా ఈ వెబ్ సిరీస్ ఎంతమాత్రం తగ్గలేదు. యుద్ధ టాంకర్ల దగ్గర నుంచి హెలికాఫ్టర్ల వరకూ ఒక రేంజ్ లో వాడేశారు. అలాగే వందలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు తెరపై కనిపిస్తూ ఉంటారు. తుపాకుల మోతలు .. శత్రు దళాలు కుప్పకూలడం చాలా సహజంగా కనిపిస్తాయి. కథకి తగిన లొకేషన్స్ కట్టిపడేస్తాయి. ఎడారి ప్రాంతాలు .. కొండ ప్రాంతాలు .. సముద్ర ప్రాంతాలు ఆకట్టుకుంటాయి. 

సంజయ్ చౌదరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సుధీర్ పల్సానే కెమెరా పనితనం ఈ వెబ్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. ఎడిటింగ్ కాస్త క్లిష్టమైనదే అయినా .. కొత్తగానే అనిపిస్తుంది. ఆర్టిస్టులంతా కూడా తమ పాత్రలకు జీవం పోశారు. తీవ్రవాద కార్యకలాపాలు మనకళ్ల ముందు ప్రత్యేక్షంగా జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో  ఒకటిగా ఇది కనిపిస్తుంది.

Movie Name: The Freelancer

Release Date: 2023-09-01
Cast: Mohit Raina, Anupam Kher, Kashmira Pardeshi, Ayesha Raza Mishra, Manjari Fadnis, Sarah-Jane Dias, Sushant Singh
Director: Bhav Dhulia
Music: Sanjoy Chowdhury
Banner: Friday Storytellers

The Freelancer Rating: 3.50 out of 5

Trailer

More Reviews