మలయాళంలో చాలా తక్కువ బడ్జెట్ లో ఆసక్తికరమైన కథలను తెరకెక్కిస్తూ ఉంటారు. తక్కువ పాత్రలతోనే బలమైన కథలను ఆవిష్కరిస్తూ ఉంటారు. కథ చాలా సాదాసీదాగా సాగుతున్నట్టుగా అనిపించినప్పటికీ, చివర్లో ఒక అనూహ్యమైన ట్విస్ట్ పలకరిస్తుంది. ఆ తరహాలో రూపొందిన సినిమాగా '1001 నూనకల్' కనిపిస్తుంది. '1001 నూనకల్' అంటే మలయాళంలో 'వెయ్యినొక్క అబద్ధాలు' అని అర్థం. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. థమర్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
రాజేశ్ - సౌమ్య .. ముజీబ్ - సల్మా .. వీరు నివాసముండే 13 అంతస్తుల అపార్టుమెంట్ అగ్నిప్రమాదానికి గురవుతుంది. దాంతో వాళ్లు తమ పిల్లలను తీసుకుని అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారు. ఆ పక్కనే వినయ్ - దివ్య దంపతులు నివాసం ఉండటంతో ఆ ఇంటికి చేరుకుంటారు. రాజేశ్ - ముజీబ్ తో ఉన్న స్నేహం కారణంగా వినయ్ ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. భయపడవలసిన పనిలేదనీ, వేరే షెల్టర్ చూసుకునేవరకూ తమ ఇంట్లో ఉండొచ్చని చెబుతాడు.
ఆ తరువాత అక్కడికి జోఫీ - ఎరీనా, .. హెల్లీ - బెన్సీ దంపతులు కూడా చేరుకుంటారు. ఆ మరుసటి రోజు తమ 10వ పెళ్లిరోజు కావడంతో, అంతా తమ ఆతిథ్యం తీసుకోవలసిందేనని వినయ్ దంపతులు పట్టుపడతారు. దాంతో అందరూ అందుకు అంగీకరిస్తారు. ఆ ఇంట్లో వంట మనిషిగా చాలా కాలంగా పనిచేస్తున్న ఇందు, అందరికీ కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఆ వేడుకలో దివ్యకి ఒక ఖరీదైన వాచ్ ను వినయ్ కానుకగా ఇస్తాడు. ఆ వాచ్ ను చూసి అంతా కూడా గొప్పగా ఉందంటూ ఆ జంటను అభినందిస్తారు.
ఇందు భర్త అనిల్ అత్యవసరంగా కంపెనీ వారికి కొంత డబ్బు చెల్లించవలసి వస్తుంది. వినయ్ వాళ్లను అప్పు అడగమని ఆమెను అతను ఒత్తిడి చేస్తుంటాడు. ఇక తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే తన స్నేహితుడు ఇంత ఖరీదైన వాచ్ భార్యకి కానుకగా ఇవ్వడం రాజేశ్ కి అసంతృప్తిని కలిగిస్తుంది. వినయ్ - దివ్యల పెళ్లి ఫంక్షన్ లో మొదలైన ముచ్చట్లు, భార్య భర్తల నమ్మకాల వైపు వెళతాయి. అదే సమయంలో .. ఇంతవరకూ ఒకరి దగ్గర ఒకరు దాచిన నిజాలను బయటికి చెప్పాలనే ఒక గేమ్ ఆ జంటల మధ్య మొదలవుతుంది.
ఈ గేమ్ వలన లేనిపోని గొడవలు తలెత్తుతాయని ఒకరిద్దరు చెబుతున్నా వినిపించుకోకుండా, మిగతా వాళ్లు మొదలుపెట్టేస్తారు. పెళ్లికి ముందు జరిగిన ప్రేమాయణాలు .. ఆ తరువాత జరిగిన పరిణామాలు .. ఒకరి దగ్గర ఒకరు దాచిన రహస్యాలను ఒక్కొక్కరుగా చెప్పడం మొదలుపెడతారు. అదే సమయంలో, దివ్యకి కానుకగా వినయ్ ఇచ్చిన ఖరీదైన వాచ్ కనిపించకుండా పోతుంది. నిజాలు బయటపెట్టడం వలన ఆ జంటల మధ్య ఏం జరుగుతుంది? ఖరీదైన ఆ వాచ్ ను కాజేసిందెవరు? ఆపదలో ఆశ్రయం ఇచ్చిన ఆ దంపతులకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనే అంశాలు ఆసక్తికరం.
సాధారణంగా తక్కువ బడ్జెట్ లో సినిమాలో తీయాలనుకునే మేకర్స్ ఎక్కువగా హారర్ థ్రిల్లర్ జోనర్లో కథలను సెట్ చేసుకుంటారు .. ఒక బంగ్లాల్లోనే కథను లాగించేస్తారు. అయితే అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఒక ప్రమాదం పేరుతో కొంతమంది స్నేహితులను .. వారి భార్యలను ఒక ఇంటికి తీసుకొచ్చిన దర్శకుడు, ఆ కప్పు కిందనే కథ మొత్తాన్ని నడిపించాడు. ఒక వైపున ఆనందంతో ఉన్న జంట .. మరో వైపున ఆపదలో ఉన్న కొన్ని జంటలు .. ఈ మధ్యలో ఆర్థికపరమైన అవసరంలో ఉన్న దంపతులు. కథ అంతా కూడా గేటు దాటకుండా ఒక ఇంట్లోనే నడుస్తుంది.
చాలామంది భార్యాభర్తలు అబద్ధాలతోనే అందమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు .. నిజం నీడలో నిలబడవలసి వస్తే తట్టుకునే వారి సంఖ్య తక్కువనే అనే విషయాన్ని చాటిచెప్పే కథ ఇది. అలాగే భర్త విషయంలో భార్య స్వభావం ఎలా ఉంటుందనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు చాలా సహజంగా అనిపిస్తుంది. ఇక అప్పటివరకూ సరదాగా మాట్లాడుతూ ఉన్న స్నేహితులు, తమ మధ్య ఉన్న ఒక ఖరీదైన వస్తువు కనిపించకుండా పోయేసరికి ఎలా మారిపోతారనేది కూడా దర్శకుడు చాలా నేచురల్ గా చూపించాడు.
ప్రధానమైన పాత్రధారులతో కలిసి ప్రేక్షకుడు కూడా హాల్లో కూర్చుని వాళ్ల కబుర్లను వింటున్నట్టుగా ఉంటుంది. అంత సహజంగా హషీమ్ సులైమాన్ ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. కథా పరంగా చివర్లో రెండు ట్విస్టులు ఉంటాయి. ఈ రెండు కూడా గమ్మత్తుగానే అనిపిస్తాయి. క్లైమాక్స్ విషయానికి వస్తే, ఇంతకుమించిన ముగింపు మరొకటి ఉండదని కూడా అనిపిస్తుంది. ఈ చిన్న కథలో విష్ణు అగస్త్య .. రమ్య సురేశ్ .. షమ్లా హంజా .. జింజ్ షాన్ .. సుదీప్ కోషి .. రష్మీ నాయర్ ప్రధానమైన పాత్రలను పోషించారు.
ఈ సినిమాకి, జితిన్ ఫోటోగ్రఫీని అందించగా .. నేహా నాయర్ సంగీతాన్ని సమకూర్చారు. ఎడిటర్ గా నిషాద్ యూసఫ్ వ్యవహరించాడు. కథకి తగినట్టుగానే అన్నీ కూడా కలిసికట్టుగా సాగాయి. 'కాళ్లు గడప దాటవుగానీ కబుర్లు భలేగా చెబుతాడు' అనే ఒక సామెతలా, గడప దాటకుండా చెప్పిన కథ ఇది. ఇంత సింపుల్ లైన్ తో కూడా సినిమా తీయవచ్చునా అనిపించేలా ఈ సినిమా నడుస్తుంది. అయితే ఇలా ఒక పుస్తకం చదువుతున్నట్టుగా అనిపించే ఈ తరహా కథలు, మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తప్ప తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించవనే చెప్పాలి.