'హవా - (సోనీ లివ్) మూవీ రివ్యూ

Hawa

Hawa Review

  • జాలరుల జీవనశైలిని ఆవిష్కరించే 'హవా'
  •  సముద్రం నేపథ్యంలో సాగే కథ  
  • బెంగాలీ భాషలో ప్రశంసలను అందుకున్న సినిమా
  • ఈ నెల 7 నుంచి ఓటీటీలో అందుబాటులోకి

బెంగాలీ సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. పాత్రలన్నీ కూడా సాధారణ జీవన శైలిని టచ్ చేస్తూ వెళుతుంటాయి. అయితే బెంగాలీ సినిమాలు తెలుగు అనువాదాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి బెంగాలీ భాషలో రూపొందిన 'హవా' అనే సినిమా, 2022 జులై 29వ తేదీన అక్కడి థియేటర్స్ కి వచ్చింది. మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా, ప్రశంసలను అందుకుంది. ఆ సినిమా 'సోనీ లివ్' లో ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బెంగాలితో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమాను అందుబాటులో ఉంచారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటనేది చూద్దాం. 

ఈ కథ జాలరుల జీవితాలకి సంబంధించిన నేపథ్యంలో కొనసాగుతుంది. సముద్రంలో చేపల వేటకి  ఛాన్ (చంచల్)  నాయకత్వంలో పెద్ద బోట్ బయల్దేరుతుంది. అతనితో పాటు ఇబా .. నాగు .. ఎజా .. ఉర్కేశ్ .. మోర .. పర్కేశ్ .. ఫోనీ ఆ బోటులో ముందుకు సాగుతారు. వాళ్లలో 'ఇబా' (సరిఫుల్ రజ్) అనేవాడు బోట్ ఇంజన్ కి సంబంధించిన ఏ సమస్య తలెత్తినా సరిచేయగల సమర్థుడు. ఛాన్ బోట్ డ్రైవ్ చేస్తూ ఉంటే, మిగతా వాళ్లంతా వలలు వదిలి .. లాగడం వంటి పని చేస్తూ ఉంటారు.

చేపలను వేటాడుతూ వాళ్లంతా కూడా సముద్రంలో చాలా లోపలికి వెళతారు. వాళ్లు వదిలిన వలలో ఒక అందమైన యువతి (నజీఫా తుషి) పడుతుంది. ఆమె చనిపోయిందనే వాళ్లంతా అనుకుంటారు. కానీ ఆమె నెమ్మదిగా సృహలోకి వస్తుంది. సముద్రం మధ్యలో వదిలిన వలలో ఆమె పడటం .. ప్రాణాలతో ఉండటం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే విషయాన్ని ఆమెను అడిగితే, ఆమె మౌనంగా ఉండిపోతుంది. దాంతో ఆమె 'మూగ' అనే విషయం వాళ్లకి అర్థమవుతుంది. 

మిగతా బోట్లపై ఉన్నవారికి ఈ యువతి కనిపించకుండా జాగ్రత్తపడుతూ 'ఛాన్' బోట్ ముందుకు వెళుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక యువతి బోట్ లోకి వచ్చిందో అప్పటి నుంచి, అందులోని వాళ్లందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఛాన్ .. నాగు ఆమెను వశపరచుకోవడానికి ప్రయత్నించి భంగపడతారు. తమని ఆ అమ్మాయి కాదనడంతో కోపం పెంచుకుంటారు. వీలైతే కోరిక ... లేదంటే పగ తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. 

ఈ క్రమంలోనే 'ఇబా' కూడా ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతనితో సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. ఆమెకి మాటలు వచ్చనే సంగతి తెలిసి 'ఇబా' ఆశ్చర్యపోతాడు. తనపేరు 'గుల్టీ'  అంటూ ఆమె తనకి గల ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. తమ బోట్ లోకి ఆమె రావడానికి గల కారణం ఏమిటని 'ఇబా' అడుగుతాడు. అందుకు ఆమె చెప్పిన మాటకి అతను బిత్తరపోతాడు. ఆ యువతి తమను కాదని 'ఇబా'తో చనువుగా ఉండటాన్ని 'ఛాన్' .. 'నాగు' తట్టుకోలేకపోతారు. 

ఆ యువతిని ఆ బోట్ లో నుంచి సముద్రంలోకి తోసేయాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయంలో తమని అడ్డుకున్న 'ఇబా'ను చంపేస్తారు. అప్పుడు గుల్టీ ఏం చేస్తుంది? 'ఇబా' మరణం తరువాత ఆ బోట్ లో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి? వాళ్లంతా తిరిగి క్షేమంగా తీరానికి చేరుకున్నారా? లేదా? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ మిస్టరీ డ్రామా నడుస్తుంది.

దర్శకుడు రహ్మాన్ సుమోన్ అల్లుకున్న ఈ కథ .. నడిపించిన కథనం ఆసక్తికరంగా ఉన్నాయి. ఎటు చూసినా సముద్రం .. మధ్యలో ఒక బోటు .. అందులో తొమ్మిది మంది వ్యక్తులు. ఈ బోట్ లోనే కథ మొత్తం నడవాలి .. ఎక్కడా బోర్ కొట్టకూడదు. అలాంటి ఈ పాయింటును దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించాడు. అప్పటివరకూ చేపలను పట్టడంలోనే దృష్టి పెడుతూ వచ్చిన వాళ్లంతా, ఒక యువతి ఎంట్రీతో ఎలా శత్రువులయ్యారనేది దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. 

అలాగే జాలరుల జీవితాలు .. సముద్రంపై వాళ్లకి గల అవగాహన .. బోట్ లో వాళ్లు చేసుకునే ఏర్పాట్లు ..  సముద్రంపైకి వెళ్లిన తరువాత వాళ్ల జీవనశైలి ఎలా ఉంటుంది? అనేది గొప్పగా ఆవిష్కరించాడు. బోట్ లో ప్రేక్షకుడు కూడా ఒక పాత్రగా నిలబడతాడు. వాళ్లతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంతటి సహజంగా ఈ సినిమా ముందుకు నడుస్తూ ఉంటుంది. అయితే ఆ యువతి చెప్పే ఫ్లాష్ బ్యాక్ లో క్లారిటీ లోపించింది. అది అనువాదంలో జరిగిన పొరపాటా? లేదంటే ఒరిజినల్ లోనే అలా ఉందా? అనేది చెప్పలేం. 

ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలలో కనిపించే తొమ్మిది మంది ఆర్టిస్టులు కూడా చాలా సహజంగా నటించారు. ఈ పాత్రలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అందువలన నటీనటులు కాకుండా జాలరులు మాత్రమే మన కళ్లకు కనిపిస్తూ ఉంటారు. 'ఛాన్' పాత్ర .. బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కెమెరా పనితనం .. ఎడిటింగ్ బాగున్నాయి. సముద్రం నేపథ్యంలో నడిచే కథలను ఇష్టపడేవారు ఈ సినిమా చూడొచ్చు. 

Movie Name: Hawa

Release Date: 2023-07-07
Cast: Chanchal Chowdhury, Nazifa Tushi, Sariful Razz, Nasir Uddin Khan, Sumon Anowar as
Director: Mejbaur Rahman Sumon[
Music: Emon Chowdhury
Banner: Sun Music & Motion Pictures

Hawa Rating: 3.00 out of 5

Trailer

More Reviews