'కేరళ క్రైమ్ ఫైల్స్' (డిస్నీప్లస్ హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

Kerala Crime Files

Kerala Crime Files Review

  • ఆసక్తికరంగా సాగే  'కేరళ క్రైమ్ ఫైల్స్'
  • బలమైన కథాకథనాలు 
  • సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరణ 
  • మంచి అవుట్ ఫుట్ ను రాబట్టిన డైరెక్టర్ 
  • ఈ జోనర్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

నేరస్థులు ఎప్పుడూ తప్పించుకోలేరు .. వాళ్లు ఎక్కడ ఉన్నా ఆ నేరం తాలూకు ఫలితం వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది. ఇక ఒక నేరస్థుడిని పట్టుకోవడానికి పోలీసులు ఎంతో కష్టపడవలసి వస్తుంది. పై అధికారుల ఒత్తిడిని .. జనం నుంచి వ్యతిరేకతని ... ఫ్యామిలీ నుంచి అసహనాన్ని .. అసంతృప్తిని ఎదుర్కుంటూ వాళ్లు పనిచేయవలసి ఉంటుంది. ఇలా ఒక నేరం తాలూకు నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ లు గతంలో చాలానే వచ్చాయి. అదే జోనర్లో 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో అందుబాటులోకి వచ్చిన 'కేరళ క్రైమ్ ఫైల్స్'లో కొత్తదనమేమిటనేది చూద్దాం.

కేరళ ప్రాంతంలోని ఒక లాడ్జ్ లో ఒక యువతి హత్య జరుగుతుంది. ఆ లాడ్జ్ వ్యవహారాలు చూసే శరత్ ద్వారా విషయం తెలుసుకుని సీఐ కురియన్ ( లాల్) ..  ఎస్.ఐ.మనోజ్ (అజూ వర్గీస్) కానిస్టేబుల్స్ ప్రదీప్ .. విను .. సునీల్ అక్కడికి చేరుకుంటారు. నల్లచొక్కా .. తెల్ల లుంగీ .. మెల్లకన్నుతో ఉన్న ఒక వ్యక్తి ఆ యువతిని లాడ్జ్ కి తీసుకుని వచ్చినట్టుగా శరత్ (హరిశంకర్) చెబుతాడు. లాడ్జ్ లో ఆ వ్యక్తి ఇచ్చిన అడ్రెస్ సరైందని కాదని పోలీసులు తెలుసుకుంటారు.

లాడ్జ్ లో హత్యకి గురైన యువతి పేరు స్వప్న అనీ .. ఆమె ఒక వేశ్య అని ఎస్. ఐ. మనోజ్ తెలుసుకుంటాడు. స్వప్నను హత్య చేసింది సిజూ ( శ్రీజిత్ మహాదేవ్) అనే వ్యక్తి అని, ఆమెతో కలిసి అదే వృత్తి చేసే లతిక (దేవకి) ద్వారా తెలుస్తుంది. దాంతో సిజూ తీగ లాగుతూ పోలీసులు ముందుకు వెళతారు. అయితే పేరు ఒకటే అయినా అతనికి మెల్లకన్ను లేదని కొంతమంది .. మెల్లకన్ను ఉందని కొంతమంది చెబుతుంటారు. దాంతో పోలీసులు ఒక రకమైన అయోమయంతోనే తమ అన్వేషణ కొనసాగిస్తుంటారు. 

కూతురు ఆలనా పాలన తానే చూసుకునే సీఐ .. కొత్తగా పెళ్లైన ఎస్.ఐ. .. గర్భవతిగా ఉన్న భార్య గురించి టెన్షన్ పడుతూ కానిస్టేబుల్ సునీల్ .. ఇలా ఎవరి ఫ్యామిలీ టెన్షన్ వాళ్లకి ఉంటుంది. అందువలన సాధ్యమైనంత త్వరగా నేరస్థుడిని పట్టుకుంటే కాస్త రిలాక్స్ కావాలని వాళ్లంతా పట్టుదలతో ముందుకు వెళుతుంటారు. సిజూ కోసం గాలిస్తున్న సమయంలో .. ఇది తాము అనుకున్నంత తేలికైన కేసు కాదనే విషయం వాళ్లకి అర్థమవుతుంది. 

 సిజూ ఎక్కడివాడు? అతని ఫ్యామిలీ ఎక్కడ ఉంది? కొంతమంది చెబుతున్నట్టుగా అతనికి మెల్లకన్ను ఉందా లేదా? ఇలా వరుస ముడులు విప్పుతూ తమ అన్వేషణ సాగాలని పోలీసులు నిర్ణయించుకుంటారు. అసలు సిజూ ఎవరు? ఎందుకు అతను స్వప్నను చంపవలసి వస్తుంది? అతణ్ణి పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ. 

ఒక హత్య .. దాని చుట్టూ అల్లుకున్న కథను ఆసక్తికరంగా .. ఉత్కంఠభరితంగా రూపొందించడం అంత తేలికైన విషయమేం కాదు. నేరస్థుడి లింకులు పట్టుకుంటూ .. అతని జాడ తెలుసుకోవడానికి పోలీసులు జరిపే గాలింపు ఇంట్రస్టింగ్ గా ఉండాలి. ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? పోలీసులు వెళుతున్న చోట అతను ఉంటాడా?  అక్కడ దొరుకుతాడా? ఇలా అనేక సందేహాలకు సమాధానాలు ఇస్తూ కథ నడవాలి. అది సహజత్వానికి దగ్గరగా అనిపించాలి .. కనిపించాలి. 

ఈ విషయంలో ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ కి మంచి మార్కులు ఇవ్వొచ్చు. కథలో పాత్రలే తప్ప ఎక్కడా కూడా ఆర్టిస్టులు కనిపించరు. ఎవరూ కూడా పాత్ర పరిధి దాటేసి వెళ్లడం జరగలేదు. చిన్న డైలాగ్ నే కదా అని చెప్పేసి, ఎలా చెప్పినా ఓకే అనడం ఈ వెబ్ సిరీస్ లో ఎక్కడా కనిపించదు. కథను తయారు చేసుకున్న విధానం .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. సన్నివేశాలను ఆవిష్కరించిన పద్ధతి వలన మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకూ కంటిన్యూగా చూడాలనిపిస్తుంది.  


పోలీస్ వారి ఫ్యామిలీస్ వైపు నుంచి సున్నితమైన ఎమోషన్స్ ను కవర్ చేయడం బాగుంది. ఇది వెబ్ సిరీస్ గనుక సాగదీయాలనే నియమం పెట్టుకోలేదు .. ఒకటి రెండు డైలాగ్స్ మాత్రమే కాస్త ఇబ్బంది పెడతాయి. అసభ్యకరమైన సన్నివేశాలు కనిపించవు. లాల్ సీనియర్ ఆర్టిస్ట్ అయినా, ఎస్. ఐ. మనోజ్ పాత్రలో అజూ వర్గీస్ నటన ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా చెప్పుకోవాలి. నిర్మాణ పరమైన విలువల విషయంలో .. లొకేషన్స్ విషయంలో రాజీపడలేదనే విషయం అర్థమవుతూనే ఉంటుంది. 

కథాకథనాలు ఒక ఎత్తయితే .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక ఎత్తని చెప్పుకోవాలి. హేషమ్ అబ్దుల్ వాహెబ్ అందించిన బీజీఎమ్ ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. సినిమా చూస్తున్నామా? వెబ్ సిరీస్ చూస్తున్నామా? అన్నట్టుగానే సాగింది. ఇక జితిన్ ఫొటోగ్రఫీ కూడా ఈ వెబ్ సిరీస్ కి అదనపు బలంగా నిలిచిందని చెప్పొచ్చు. మహేశ్ భువనేంద్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఎక్కడా అనవసరమైన సీన్స్ కనిపించవు.

ప్లస్ పాయింట్స్: కథా .. కథనం .. చిత్రీకరణ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. అజూ వర్గీస్ నటన. 

* ప్రతి ఎపిసోడ్ ముగింపుతో, ఆ తరువాత ఎపిసోడ్ పై ఆసక్తిని రేకెత్తిస్తూ సాగే ఈ వెబ్ సిరీస్, ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. 

Movie Name: Kerala Crime Files

Release Date: 2023-06-23
Cast: Aju Varghese, Lal, Sreejith, Navas, Sanju, Zhins, Rooth, Devaki
Director: Ahammed Kabeer
Music: Hesham Abdul Waheb
Banner: First Print Studios Production

Kerala Crime Files Rating: 3.25 out of 5

Trailer

More Reviews