బెల్లంకొండ గణేశ్ ఇప్పుడు తన తోటి హీరోలతో పోటీ పడటానికి రెడీ అవుతున్నాడు. అందువల్లనే మొదటి సినిమా అయిన 'స్వాతిముత్యం ' సినిమాకి పూర్తిభిన్నమైన కథను ఎంచుకున్నాడు. అలా ఆయన హీరోగా 'నేను స్టూడెంట్ సర్' సినిమా రూపొందింది. 'నాంది' సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. 'అవంతిక' కథానాయికగా పరిచయమైన ఈ సినిమా, ఆడియన్స్ నుంచి ఎన్ని మార్కులు కొట్టేసిందనేది చూద్దాం.
2020లో ఈ కథ మొదలవుతుంది. సుబ్బారావు (బెల్లంకొండ గణేశ్) ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. ఖరీదైన .. లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఫోన్ కొనాలనేది ఆతనికి చాలా కాలంగా ఉన్న బలమైన కోరిక. ఆ ఫోన్ కొనుక్కోవడం కోసమే అతను అనేక పనులు చేస్తాడు. మొత్తానికి తాను దాచుకున్న డబ్బులతోనే ఆ ఫోన్ కొనుక్కుంటాడు. ఆ ఫోన్ తీసుకుని కాలేజ్ క్యాంపస్ లోకి అడుగుపెడతాడు.
అయితే హఠాత్తుగా విద్యార్ధి నాయకుల మధ్య ఘర్షణ జరగడం .. కొంతమంది రౌడీ స్టూడెంట్స్ తో పాటు సుబ్బారావును కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లడం .. పోలీస్ వారు అందరినీ మందలించి పంపించివేయడం జరిగిపోతుంది. ఆ సమయంలోనే సుబ్బారావు కొత్త ఫోన్ కనిపించకుండా పోతుంది. దాంతో పోలీసులే తన ఫోన్ కాజేశారని కమిషనర్ అర్జున్ వాసుదేవన్ (సముద్రఖని)కి ఫిర్యాదు చేస్తాడు. తన ఫోన్ కమిషనర్ దగ్గరే ఉందనే ఆలోచనలో సుబ్బారావు ఉంటాడు.
సుబ్బారావు తన ఫోన్ ను కమిషనర్ నుంచి రాబట్టుకోవడం కోసం, ఆయన కూతురు శ్రుతి (అవంతిక)ని ముగ్గులోకి లాగుతాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఒకరోజున అర్జున్ వాసుదేవన్ కి కాల్ చేసిన సుబ్బు, అతని రివాల్వర్ తన దగ్గర ఉందని చెబుతాడు. తన ఫోన్ తనకిచ్చి రివాల్వర్ తీసుకుని వెళ్లమని తేల్చి చెబుతాడు. అయితే కమిషనర్ రివాల్వర్ లోని బుల్లెట్ కారణంగా ఒక విద్యార్ధి నాయకుడు చనిపోయినట్టుగా వార్త వస్తుంది. అప్పుడు సుబ్బారావు ఏం చేస్తాడు? అసలు హంతకుడు ఎవరు? ఆ నేరం నుంచి సుబ్బారావు ఎలా బయటపడ్డాడు? అనేదే కథ.
దర్శకుడు రాఖీ ఉప్పలపాటి తయారు చేసుకున్న ఈ కథలో కాలేజ్ నేపథ్యం .. అక్కడి స్టూడెంట్స్ మధ్య గొడవలు .. హీరో ఎంతో ఇష్టపడి హీరో కొనుక్కున్న ఫోన్ .. ఆ ఫోన్ కోసం హీరోయిన్ తో నడిపే ప్రేమాయణం ప్రధానంగా కనిపిస్తాయి. హీరో ఫోన్ కనిపించకుండా పోవడం .. దాని కోసం ఆయన పడుతున్న అవస్థలు చూస్తే, మొత్తానికి దీని వెనుక ఏదో జరుగుతోంది .. అదేమిటో హీరో ఛేదిస్తాడు అని ఆడియన్స్ అంతా ఎదురుచూస్తుంటారు .. గమ్మత్తు ఏమిటంటే అలాంటిదేమీ జరగదు.
అయితే హీరో సాహసం చేసి ఎలాంటి మిస్టరీని ఛేదించడా? అనుకుంటే పొరపాటే. బ్యాంకులను అడ్డాగా చేసుకుని అక్రమంగా ఒక ముఠా సాగిస్తున్న సీక్రెట్ వ్యవహారాల గుట్టును రట్టు చేస్తాడు. ఈ మాఫియా విషయంలోనే హీరో చాలా హైరానా పడిపోతాడు .. హడావిడి చేసేస్తాడు. కాకపోతే అదేమిటనేది సాధారణ ప్రేక్షకులకు అంత ఈజీగా అర్థం కాదు. ఈ మాఫియాకి .. కనిపించకుండా పోయిన ఆయన ఫోన్ కి లింక్ ఉందనుకుంటే అక్కడ కూడా తప్పులో కాలేసినట్టే.
ఇక కనిపించకుండా పోయిన ఆ ఫోన్ గురించి సాధారణ కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకూ హీరో టార్చర్ పెడుతుంటాడు. తన ఫోన్ .. దాని ఖరీదు .. మోడల్ నెంబర్ .. జీబీ కెపాసిటీ ప్రతిసారి చెబుతుంటాడు. ఆడియన్స్ భరించకతప్పదు. ఇక మరో ట్విస్ట్ కూడా ఉంది. హీరోకి ఫోన్ అంటే ఎంత పిచ్చో .. హీరోయిన్ కి అంత ఎలర్జీ. అసలు మొబైల్స్ వాడే వాళ్లంటేనే ఆమెకి చిరాకు. పోనీ ఈ వైపు నుంచి ఏమైనా ఎంటర్టైన్మెంట్ కాసిందా అంటే అదీ లేదు.
హీరో ఓ మధ్య తరగతి ఫ్యామిలీకి చెందినవాడు . అటు వైపు నుంచి ఎమోషన్స్ లేవు. కమిషనర్ కూతురుతో లవ్వు .. అటు వైపు నుంచి రొమాన్స్ లేదు. కాలేజ్ నేపథ్యం .. అక్కడ గుంపు గొడవలే తప్ప కామెడీ లేదు. ఈ సినిమాకి విలన్ .. కమిషనర్ పాత్రలో ఉన్న సముద్రఖని అనే అనుకోవాలి. ఆయన పాత్ర కొంతవరకూ ఈ సినిమాను కాపాడే ప్రయత్నం చేసింది. గణేశ్ కూడా హీరో కంటెంట్ ఉన్నవాడే. కాకపోతే ఇన్నోసెంట్ పాత్రల వైపు నుంచి బయటపడాలి. హీరోయిన్ అవంతిక అంత గ్లామరస్ గా అయితే అనిపించదు.
సంగీతం విషయానికి వస్తే .. మహతి స్వరసాగర్ స్వరపరచిన 'మాయే .. మాయే' సాంగ్ ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. అమిత్ మదాడి ఫొటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. కాకపోతే ఫొటోగ్రఫీ సత్తాను చాటే స్థాయిలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే సన్నివేశాలు పెద్దగా కనిపించవు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, సాగతీత సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. కాకపోతే అప్పటికే నిడివి తక్కువగా ఉంది. అటు హీరోను .. ఇటు విలన్ షేడ్స్ ఉన్న పోలీస్ కమిషనర్ ను పక్కన పెట్టేసి. చిన్న పాత్రలతో పెద్ద ఆపరేషన్ ను నిర్వహించడమే ఈ సినిమాకి మైనస్.
ప్లస్ పాయింట్స్ : నిర్మాణ విలువలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సముద్రఖని నటన.
మైనస్ పాయింట్స్: కథ .. కథనం .. ఏ ట్రాక్ ను తీసుకున్నా అందులో విషయం లేకపోవడం. ఎంచుకున్న అంశం నుంచి అసలు విషయం పక్కకి వెళ్లిపోవడం. హీరో - విలన్ పాత్రలపై మాత్రమే శ్రద్ధ పెట్టడం.
'నేను స్టూడెంట్ సర్' - మూవీ రివ్యూ
| Reviews
Nenu Student Sir Review
- బెల్లంకొండ గణేశ్ నుంచి వచ్చిన 'నేను స్టూడెంట్ సర్'
- బలహీనమైన కథాకథనాలు
- ఎటో వెళుతుందనుకున్న కథ మరెటో వెళ్లడం
- సంతృప్తికరంగా సాగని ట్రాకులు
- సముద్రఖని నటన మాత్రమే ప్రత్యేకమైన ఆకర్షణ
Movie Name: Nenu Student Sir
Release Date: 2023-06-02
Cast: Bellamkonda Ganesh, Avanthika, Samudrakhani,Surya, Sunil, Ram Prasad,
Director: Rakhi Uppalapati
Music: Mahathi Swarasagar
Banner: SV2 Entertainment
Review By: Peddinti
Nenu Student Sir Rating: 2.50 out of 5
Trailer