ధనుశ్ కెరియర్ ను ఒకసారి పరిశీలిస్తే, సందేశాత్మక చిత్రాలలో చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపిస్తూ వెళ్లడం కనిపిస్తుంది. అలా ఆయన చేసిన మరో సందేశాత్మక చిత్రమే 'సార్'. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.
ఈ కథ 2022లో 'అనకాపల్లి'లో మొదలవుతుంది. ఆ తరువాత ఓ ముప్పై ఏళ్ల వెనక్కి వెళుతుంది. అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. బాలు ( ధనుశ్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి (ఆడుకాలం నరేన్) కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. బాలూకి మొదటి నుంచి కూడా చదువు అంటే ఇష్టం. ఆయన ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తుంటాడు. ఆ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కి త్రిపాఠి ( సముద్రఖని) చైర్మన్ గా ఉంటాడు.
ప్రభుత్వ కళాశాలలను బలహీనపరిచి .. తనకి సంబంధించిన కళాశాలలను బలపరచడానికి ఆయన అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తుంటాడు. దాంతో జనం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రభుత్వ కళాశాలలను తాము దత్తత చేసుకుని, అక్కడికి మంచి లెక్చరర్స్ ను పంపిస్తామని త్రిపాఠి ప్రకటిస్తాడు. కానీ థర్డ్ గ్రేడ్ లెక్చరర్స్ ను పంపిస్తాడు. అలా 'సిరిపురం'లోని ప్రభుత్వ కళాశాలకి జూనియర్ లెక్చరర్ గా బాలూ వెళతాడు. ఆ కాలేజ్ లో మరో లెక్చరర్ అయిన మీనాక్షి (సంయుక్త మీనన్)తో అతనికి పరిచయమవుతుంది.
ఆ ఊరికి ప్రెసిడెంట్ గా పత్తి పాపారావు ( సాయికుమార్) ఉంటాడు. అతను త్రిపాఠికి దూరపు బంధువు. అతనితో పాటు ఆ ఊళ్లోని వాళ్లను బాలూ ఒప్పించి పిల్లలంతా కాలేజీ కి వచ్చేలా చేస్తాడు. మంచి రిజల్ట్ వస్తే .. తనకి సీనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ వస్తుందని భావించిన బాలూ చాలా కష్టాలు పడతాడు. ఆ ఏడాది ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆ కాలేజ్ 100 పెర్సెంట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది. దాంతో చుట్టుపక్కల టౌన్స్ లోని పిల్లలంతా ఆ కాలేజ్ లో చేరడానికి మొగ్గుచూపుతారు.
టౌన్స్ లోని పిల్లలంతా సిరిపురం గవర్నమెంట్ కాలేజ్ లో చేరడానికి ఆసక్తిని చూపటానికి కారణం బాలూ అని తెలుసుకున్న త్రిపాఠి, ఆగ్రహావేశాలతో సిరిపురం ప్రభుత్వ కళాశాలకు చేరుకుంటాడు. అక్కడ ఏం జరుగుతుంది ? ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ ముందుకు వెళుతుంది.
డబ్బున్నవాడే చదువుకోవడానికి అర్హుడు .. డబ్బులేనివాడికి మంచి చదువులు చదువుకునే హక్కులేదు అని భావించే ఒక అవినీతి పరుడిపై, ఒక లెక్చరర్ చేసే తిరుగుబాటు ఈ కథ. డబ్బున్నవాడిని ప్రశ్నించడమంటే అతణ్ణి సపోర్ట్ చేసే ఒక వ్యవస్థను నిలదీయడమే. ఈ పోరాటం ఏ దారిలో జరిగింది? ఏ తీరుగా జరిగింది? అనేదే కథనం.
దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న లైన్ బాగుంది. అయితే హీరో .. హీరోయిన్స్ ఇద్దరూ లెక్చరర్స్ కావడం వలన వారిద్దరి మధ్య రొమాన్స్ .. డ్యూయెట్లు పెట్టే అవకాశం లేదు. అందువలన ఈ వైపు నుంచి ఎంటర్టయిన్ మెంట్ ని లాక్ చేసినట్టుగా అయింది. ఇక ఫస్టాఫ్ లో ఒక స్కిట్ మాదిరిగా హైపర్ ఆదితో కాసేపు కామెడీ చేయించి పంపించారు. కామెడీ ట్రాక్ కి అక్కడితో స్వస్తి పలికారు. ఇక ఇప్పుడు మిగిలింది యాక్షన్ .. ఎమోషన్ .. ఈ రెండింటితోనే ఈ సినిమాను నడిపించారు.
ప్రధాన ప్రతినాయకుడైన సముద్రఖని .. ప్రెసిడెంట్ గా సాయికుమార్ .. కామెడీ వైపు నుంచి హైపర్ ఆది పాత్రలను ఇంకా బాగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే స్టూడెంట్స్ లో చైతన్యం వచ్చే సీన్స్ ను కూడా ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు. ధనుశ్ కి వార్నింగ్ ఇవ్వడానికి సముద్రఖని వచ్చినప్పటి సీన్ లో, ఆయన మాట తీరు మారిపోతూ ఆయన క్యారెక్టరైజేషన్ పడిపోతుంది. సాయికుమార్ పాత్రను ఇటు సీరియస్ .. ఆటు కామెడీ కాకుండా మధ్యలో వ్రేల్లాడదీశారు.
ఉన్నంతలో ధనుశ్ .. సముద్రఖని నటనలో పోటీ పడ్డారు. సంయుక్త మీనన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. స్టూడెంట్స్ గా చేసిన పిల్లలంతా బాగా చేశారు. ఒక రైతు పాత్రలో భారతీరాజా మెరవడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ పాటల్లో 'మాస్టారూ' .. 'మారాజయ్యా' పాటలకి మంచి మార్కులు ఇవ్వొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ .. యువరాజ్ ఫొటోగ్రఫీ కథకు అదనపు బలాన్ని తీసుకొచ్చాయి. హీరోకు .. విలన్ కి మధ్య విద్యకు సంబంధించి జరిగే మెయిన్ ట్రాక్ కి దర్శకుడు న్యాయం చేశాడు. అలాగే లెక్చరర్ కీ .. స్టూడెంట్స్ కి మధ్య ఉండే ఎమోషన్స్ ను వర్కౌట్ చేశాడు. కానీ చివర్లో ధనుశ్ పాత్ర తీసుకునే నిర్ణయం ప్రేక్షకులలో కొంతమందికి అంత సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు.
మూవీ రివ్యూ: 'సార్'
| Reviews
SIR Review
- ధనుశ్ హీరోగా వచ్చిన 'సార్'
- ప్రైవేట్ విద్యా వ్యవస్థ నేపథ్యంలో నడిచే కథ
- ధనుశ్ .. సముద్రఖని పాత్రలే ప్రధానం
- ఇతర పాత్రలు బలహీనం
- యాక్షన్ .. ఎమోషన్ కి పెద్దపీట
- ఎంటర్టయిన్ మెంట్ పాళ్లు తక్కువ
Movie Name: SIR
Release Date: 2023-02-17
Cast: Dhanush, Samyuktha Menon, Samudrakhani, Sai Kumar, Adukalam Naren, Hyper Adi
Director: Venky Atluri
Music: GV Prakash Kumar
Banner: Sitara Enetertainments
Review By: Peddinti
SIR Rating: 3.00 out of 5
Trailer