తెలుగు తెరకి చాలామంది నటవారసులు పరిచయమయ్యారు. వాళ్లలో కొంతమంది స్టార్స్ గా తమ స్థానాలను పదిలం చేసుకుంటే, మరికొంతమంది ఆ స్థాయికి చేరుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీహరి వారసుడిగా మేఘాంశ్ 'రాజ్ దూత్' సినిమాతో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి ప్రయత్నంలో ఆయన ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించాడో .. ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం.
కథలోకి వెళితే .. సంజయ్ (మేఘాంశ్) ప్రియా (నక్షత్ర) ప్రేమలో పడతాడు. ప్రియను తనకిచ్చి పెళ్లి చేయమని నేరుగా ఆమె తండ్రిని అడిగేస్తాడు. అయితే అందుకు ఆయన ఒక షరతు పెడతాడు. 20 సంవత్సరాలుగా 'కోమా'లో వున్న తన స్నేహితుడి తండ్రి (కోట శ్రీనివాసరావు) అందులో నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతాడు. ఆయన 'కోమా'లోకి వెళ్లేముందు వరకూ తన 'రాజ్ దూత్' బైక్ ను ప్రాణంగా చూసుకునేవాడనీ, ప్రస్తుతం ఆ బైక్ ఎక్కడుందో తెలియదని అంటాడు. ఆ బైక్ జాడ తెలుసుకుని దానిని తీసుకొస్తే, 'కోమా'లో నుంచి బయటపడిన తరువాత ఆ వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువని చెబుతాడు. ఆ బైక్ ను తీసుకొస్తే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. దాంతో 20 ఏళ్ల క్రితం నాటి ఆ బైక్ ఎక్కడుందో కనుక్కుని తీసుకురావడం కోసం సంజయ్ రంగంలోకి దిగుతాడు. ఆ ప్రయత్నంలో ఆయనకి ఎదురయ్యే అనూహ్యమైన పరిణామాలతో కథ అనేక మలుపులు తీసుకుంటుంది.
దర్శకులుగా అర్జున్ - కార్తీక్ లకు ఇది తొలి సినిమా. అనుభవలేమి అనేది కథా కథనాలను ఆవిష్కరించే తీరులో తెలిసిపోతూనే ఉంటుంది. శ్రీహరి తనయుడు మేఘాంశ్ కి ఇది తొలి సినిమా. అయినా ఇంట్రడక్షన్ సీన్ విషయంలోను శ్రద్ధ పెట్టకుండా, చాలా సాదాసీదాగా ఎంట్రీ ఇప్పించేయడం నిరాశను కలిగిస్తుంది. కథలో బలం లేకపోవడంతో, సహజంగానే కథనం బలహీనపడిపోయింది. సన్నివేశాలు డీలాపడిపోయాయి. అనవసరమైన సన్నివేశాలు .. పాత్రలు తెరపైకి వచ్చేసి వెళుతుంటాయి. గొడుగులోళ్ల సన్నివేశాలు .. సుందర్ లాల్ సేఠ్ సన్నివేశాలు .. కమెడియన్ నల్ల వేణు .. 'చిత్రం' శీను సన్నివేశాలు అలాంటివే. ఇక 'అతి'గా అనిపించే సంభాషణలు కూడా విసుగు పుట్టిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ అవసరం లేని కథ ఇది. అయినా ఫ్లాష్ బ్యాక్ జోడించడం కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేదిగానే కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దర్శకులు కథను విడిచి సాము చేశారు.
నటీనటుల విషయానికొస్తే .. మేఘాంశ్ మంచి ఒడ్డు పొడుగు వున్నాడు .. హీరో కంటెంట్ ఉన్నవాడే. లుక్స్ పరంగా పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. నటన పరంగా పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన హెయిర్ స్టైల్ విషయంలో శ్రద్ధ తీసుకుని వుంటే మరింత హ్యాండ్సమ్ గా కనిపించేవాడనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్ పరంగా.. డైలాగ్ డెలివరీ పరంగా లోపాలను సరిచేసుకోవలసి వుంది. హావభావాలను పలికించే విషయంపై దృష్టిపెట్టవలసి వుంది. కొత్త కావడం వలన కొన్ని సన్నివేశాల్లో మొహమాట పడుతున్నట్టుగానే కనిపిస్తాడు. చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే, తెలుగు తెరకి మరో మాస్ హీరో దొరికేసినట్టే.
కథానాయిక 'నక్షత్ర' విషయానికొస్తే, హీరోకి ఆమె కాల్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ సినిమాలో హీరోయిన్ ఉందనే విషయం ప్రేక్షకులకు గుర్తొస్తుంది. అందువలన ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 'రాజన్న' పాత్రలో ఆదిత్య మీనన్ ఓకే అనిపించాడు. ఆయన మంచి నటుడే అయినప్పటికీ, కథాకథనాల్లో పట్టులేని కారణంగా ఆయన పాత్ర బలంగా నిలబడలేకపోతుంది. ఇక 'కోమా'లో వుండే పాత్రకి కోట శ్రీనివాసరావు వంటి గొప్ప నటుడు ఎందుకనేది అర్థంగాని ప్రశ్న. సంగీతం .. రీ రికార్డింగ్ ఓ మాదిరిగా వున్నాయి. ఎడిటింగ్ వైపు నుంచి ఎక్కువ మైనస్ లు కనిపిస్తాయి. ఫొటోగ్రఫీ ఫరవాలేదనిపించేలా వుంది. డ్రోన్ కెమెరాతో తీసిన షాట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.
హీరోయిన్ ను వదిలేసి మొదటి నుంచి చివరివరకూ హీరోను బైక్ చుట్టూ తిప్పడం దర్శకులు చేసిన పొరపాటుగా అనిపిస్తుంది. కథను ఈ విధంగా రాసుకోవడం వలన, రొమాంటిక్ సీన్స్ ను .. సాంగ్స్ ను ఆశించి థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు నిరాశ కలుగుతుంది. నవ్వించడం కోసం రాసుకున్న సీన్స్ పేలలేదు. యాక్షన్ .. ఎమోషన్ పండటానికి అవసరమైన బలమైన సందర్భాలు, సన్నివేశాలు లేవు. ఏ విధంగానూ ఆకట్టుకొని ఈ సినిమా చూసిన తరువాత, కథల ఎంపిక విషయంలో మేఘాంశ్ మరింత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉందనిపిస్తుంది.
'రాజ్ దూత్' మూవీ రివ్యూ
| Reviews
Rajdoot Review
'రాజ్ దూత్' బైక్ చుట్టూ .. దాని కోసం అన్వేషించే హీరో చుట్టూ తిరిగే కథ ఇది. బలహీనమైన కథాకథనాలతో .. పేలవమైన సన్నివేశాలతో ఈ సినిమా నీరసంగా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
Movie Name: Rajdoot
Release Date: 2019-07-12
Cast: Meghamsh, Nakshatra, Adithya Menon, Kota, Edida Sriram, Sudarshan
Director: Arjun - Carthyk
Music: Varun Sunil
Banner: Lakshya Productions
Review By: Peddinti