ఓటీటీ వైపు నుంచి హారర్ థ్రిల్లర్ కంటెంట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ తరహా సిరీస్ లను భయపడుతూనే చూడటానికి ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలా హిందీలో రూపొందిన 'ఖౌఫ్' సిరీస్, తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో 'అమెజాన్ ప్రైమ్' ద్వారా అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచే ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కంటెంట్ ఆడియన్స్ ను ఎంతగా భయపెట్టిందనేది చూద్దాం.
కథ: అది 'ఢిల్లీ' నగరానికి దూరంగా .. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. హాస్టల్ కి 'గ్రేస్' వార్డెన్ గా ఉంటుంది. నిక్కీ .. స్వెత్లాన .. కోమలి .. రీమా ఒక రూములోనే ఉంటారు. రీమా గర్భవతి అయినప్పటికీ, అత్తింటి వారి టార్చర్ కారణంగా హాస్టల్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది. వారికి ఎదురు రూములో ఉండే 'అనూ' 6 నెలల క్రితం చనిపోతుంది. అప్పటి నుంచి ఆ రూములో ప్రేతాత్మ ఉందని వాళ్లంతా భయపడుతూ ఉంటారు.
గ్వాలియర్ కి చెందిన మాధురి, ఢిల్లీలో ఉండే అరుణ్ ప్రేమించుకుంటారు. ఒకసారి వాళ్లిద్దరూ కలిసి ఉన్నప్పుడే ముగ్గురు ముసుగు వ్యక్తులు దాడి చేస్తారు. అదే సమయంలో మాధురి రేప్ కి గురవుతుంది. ఆ సంఘటనను మరిచిపోవడానికిగాను మాధురిని కూడా ఢిల్లీ రమ్మంటాడు అరుణ్. దాంతో ఆమె ఢిల్లీ వెళ్లి అక్కడ జాబ్ సంపాదిస్తుంది. ఆ విషయంలో ఆమెకి 'బేలా' .. ఆమె బాయ్ ఫ్రెండ్ 'నకుల్' సాయపడతారు. ఆ జాబ్ చేస్తూ ఆమె వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో .. గతంలో 'అనూ' ఉన్న రూములోనే దిగుతుంది.
'అనూ'రూము గురించిన విషయాన్ని వార్డెన్ తో పాటు, మిగతావాళ్లు కూడా తన దగ్గర ఏదో దాస్తున్నారని మాధురి గ్రహిస్తుంది. హాస్టల్లోని నలుగురు యువతులు గేటు దాటి బయటికి ఎందుకు వెళ్లడం లేదనేది ఆమెకి అర్థంకాదు. గతంలో తనని రేప్ చేసినది నకుల్ .. అతని స్నేహితులు కావొచ్చనే ఒక సందేహం ఆమెలో బలపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా, ఢిల్లీలోనే ఒక పాత బజారులో 'హకీమ్' నివసిస్తూ ఉంటాడు. తాను ఎక్కువ కాలం .. అదీ ఆరోగ్యంగా బ్రతకాలనే ఆశతో, ఎవరికీ తెలియకుండా నరబలులు ఇస్తుంటాడు. ప్రేతాత్మలను తన అధీనంలో ఉంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు.
లేడీ కానిస్టేబుల్ 'మిశ్రా' కొడుకు 'జీవ', హకీమ్ కి హెల్పర్ గా ఉంటాడు. నరబలులకు అవసరమైన యువతులను అతని ఇంటికి తీసుకు రావడం .. శవాలను మాయం చేయడం జీవా పని. అలాంటి అతను కనిపించకుండాపోయి 6 నెలలు అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మాధురిని ప్రేతాత్మ ఆవహిస్తుంది. అప్పుడు మాధురి ఏం చేస్తుంది? అది తెలుసుకున్న హకీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? నకుల్ విషయంలో మాధురి అనుమానం నిజమేనా? కనిపించకుండా పోయిన జీవా ఏమైపోయాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: 'ఖౌఫ్' అంటే భయం అనే అర్థం ఉంది. టైటిల్ కి తగినట్టుగా ఈ సిరీస్ భయపెట్టిందా మరి అంటే, పుష్కలంగా భయపెట్టిందనే చెప్పాలి. సాధారణంగా హారర్ సినిమాలలో ప్రేతాత్మ ట్రాక్ .. దాని కారణంగా పీడించబడేవారి ట్రాక్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కథ మాధురి లవ్ ట్రాక్ .. నకుల్ ట్రాక్ .. హాస్టల్ యువతులు .. హకీమ్ .. వార్డెన్ .. పోలీస్ కానిస్టేబుల్ ..ఇలా ఇన్ని వైపుల నుంచి ఈ కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది.
ఈ కథను చాలా సాదాసీదాగా మొదలు పెట్టి .. అనేక మలుపులు తిప్పుతూ .. క్లైమాక్స్ సమయానికి నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే లోని పట్టు కారణంగా మొదటి నుంచి చివరివరకూ ఆపకుండా ఈ సిరీస్ ను చూసే అవకాశాలు ఎక్కువ. ఎక్కడా కూడా కథకి సంబంధం లేని అనవసరమైన సన్నివేశాలు కనిపించవు. 4 ఎపిసోడ్స్ వరకూ అక్కడక్కడా శాంపిల్ కోసం అన్నట్టుగా భయపెట్టిన దర్శకుడు, 5 ఎపిపోడ్ నుంచి మరింత వేగంగా కథనాన్ని పరిగెత్తించాడు. అయితే హకీమ్ పాత్ర లక్ష్యం ఏమిటి? అతనికి ఏం కావాలి? అతను కోరుకుంటున్నది ఎలా అతనికి ఉపయోగపడుతుంది? అనే విషయంలో మరికాస్త క్లారిటీ ఇస్తే బాగుండునని అనిపిస్తుంది.
పనితనం: కథ .. స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. కథలో కీలకమైన పాత్ర స్థానంలో కనిపించే హాస్టల్ బిల్డింగ్ కి సంబంధించిన లొకేషన్ కూడా అదనపు బలంగా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ టేకింగ్ .. 5 - 6- 7- 8 ఎపిసోడ్స్ లో డోస్ పెంచుతూ వెళ్లిన విధానం, నెక్స్ట్ ఏం జరుగుతుందా అని గుండెను గుప్పెట్లో పెట్టుకుని చూసేలా ఉంటుంది.
ఫొటోగ్రఫీ .. లైటింగ్ .. నేపథ్య సంగీతం ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. ఎడిటింగ్ పరంగా కూడా ఎక్కడా వంక బెట్టవలసిన పనిలేదు. మోనిక పన్వర్ .. రజత్ కపూర్ నటన ఈ సిరీస్ కి హైలైట్ అని చెప్పాలి. మిగతా ఆర్టిస్టులు కూడా ఈ కథను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు.
ముగింపు: హారర్ థ్రిల్లర్ జోనర్లో .. పెర్ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన సిరీస్ ఇది. నిదానంగా ప్రేక్షకులను కథలోకి లాగుతూ .. అంచలంచెలుగా భయాన్ని పెంచుతూ వెళుతుంది. అక్కడక్కడా కాస్త అభ్యంతరకరమైన సన్నివేశాలు .. కాసిన్ని బూతులు అయితే ఉన్నాయి. హింస .. రక్తపాతం పాళ్లూ ఎక్కువే. ఆ కాసేపు ఫార్వార్డ్ చేస్తే, ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ హారర్ థ్రిల్లర్ అనే చెప్పాలి.
' ఖౌఫ్' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!
| Reviews

Khauf Review
- హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన 'ఖౌఫ్'
- ఐదు భాషల్లో అందుబాటులోకి
- ఉత్కంఠను పెంచే కథ - స్క్రీన్ ప్లే
- ఫొటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్
- అక్కడక్కడా అభ్యంతరకర సన్నివేశాలు.. బూతులు
Movie Name: Khauf
Release Date: 2025-04-18
Cast: Monika Panwar, Rajat Kapoor, Abhishek Chauhan, Geetanjali Kulakarni
Director: Pankaj Kumar- Surya Balakrishnan
Music: -
Banner: Matchbox Shots
Review By: Peddinti
Khauf Rating: 3.00 out of 5
Trailer