కొత్త కథను క్రియేట్ చేసి, ఆ కథతో జనాలను మెప్పించడం ఈ రోజుల్లో కష్టతరమే. అందుకే కాబోలు మన దర్శకులు తాము తీసిన చిత్రాలకే సీక్వెల్ కథలను అల్లుతూ, రెడీమేడ్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముందు చిత్రాలకు జనాదరణ రావడంతో ఆ కథలనే కొనసాగిస్తూ సీక్వెల్ కథలను రెడీ చేస్తున్నారు. ఇక ఈ ప్రయత్నంలో కొన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలవగా, మరికొన్ని ఫెయిల్యూర్స్‌గా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నాయి.
ఇక ఇప్పుడున్న సీక్వెల్స్ వరుసలో వచ్చిన మరో సినిమా 'ఓదెల-2'. ఇంతకు ముందు ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందిన 'ఓదెల' చిత్రానికి సీక్వెల్ ఇది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించింది. ఇక ఈ రోజు (ఏప్రిల్ 17)న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ చిత్రం ఎలా ఉంది? సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఆకట్టుకుందా? లేదా తెలుసుకుందాం.
కథ: తొలిభాగంకు కొనసాగింపుగా ఓదెల గ్రామంలో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలను రేప్ చేసి చంపుతున్న సైకో తిరుపతి (వశిష్ట సింహా)ని అతని భార్య రాధ (హెబ్బా పటేల్) చంపేసి జైలుకు వెళుతుంది. ఇక ఎన్నాళ్ల నుంచో ఊరుకు పట్టిన తిరుపతి పీడ విరగడైందని ఆ ఊరి ప్రజలు సంతోషపడతారు. అయితే తిరుపతి ఆత్మ, ప్రేతాత్మగా మారి మళ్లీ ఊరిలో అత్యాచారాలు, హత్యలు చేస్తుంటుంది. ఈ అత్యాచారాలు, హత్యలు తిరుపతి ప్రేతాత్మగా మారి చేస్తున్నాడని ఊరి జనాలు తెలుసుకుంటారు. ఇంకా ఊరి జనాలను కాపాడటానికి నాగ సాధువు బైరవి (తమన్నా) ఆ ఊరికి వస్తుంది. అసలు భైరవికి ఊరికి ఉన్న సంబంధం ఏమిటి? తిరుపతి, ప్రేతాత్మకు, భైరవికి మధ్య జరిగిందేమిటి? అనేది కథ
విశ్లేషణ: ఓదెల తొలిభాగం కథ ముగిసిన చోటే ఈ కథ మొదలవుతుంది. అయితే తొలిభాగం క్రైమ్ థ్రిల్లర్‌గా కొనసాగితే, 'ఓదెల-2' మాత్రం సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో కథను రెడీ చేశారు. అయితే ఇక్కడ బలమైన కథ, కథనాలు లేకుండా ఓ సీక్వెల్ కథను రాసుకోవడంతో చిత్రాన్ని ఆసక్తికరంగా నడిపించలేకపోయారు. 'అరుంధతి' తరహాలో ఓ కథను తయారుచేసుకుని, దానికి ఆధ్యాత్మిక కథాంశాన్ని జోడించి చేసిన విఫల ప్రయత్నంలా ఇది అనిపించింది. దర్శకుడు సంపత్ నంది ఇంతకు ముందు తెరకెక్కిన నాలుగైదు కథలను కలుపుకుని ఈ కథను రెడీ చేసినట్లుగా సినిమా చూసిన వారు ఫీలవుతారు.
ఓ ప్రేత్మాతకు, దైవశక్తికి మధ్య జరిగే యుద్దంలా ఈ సినిమాను మలచడానికి చేసిన ప్రయత్నంలో స్క్రీన్‌ప్లేలో అడుగడునా లోపాలే కనిపిస్తాయి. నాగసాధువుగా తమన్నా పాత్ర చాలా బలహీనంగా డిజైన్ చేశారు. సినిమా ప్రారంభంలో తొలి అరగంట ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ తరువాత ఆ ఉత్కంఠను కొనసాగించ లేకపోయాడు దర్శకుడు. ప్రతి సన్నివేశంగా ఎంతో రొటిన్‌గా పేలవంగా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకుల ఊహలకు తగ్గట్టుగానే కొనసాగడం సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. తిరుపతి ఆత్మ ప్రతిసారి సమాధిలో నుంచి ఒకే తరహాలో బయటికి రావడం, ఊరిలో జనాలను చంపేయడం ఒకే సీన్‌ను మళ్లీ మళ్లీ చూస్తున్నామనే భావనను కలిగిస్తుంది.
సెకండాఫ్‌లో భైరవి, ప్రేతాత్మకు జరిగే పోరు ఏ మాత్రం జనరంజకంగా తీర్చిదిద్దలేదు. సినిమా కథ కంటే ఎక్కువగా దర్శకుడు గ్రాఫిక్స్‌ను, ఇతర సాంకేతిక పరిజ్క్షానాన్ని నమ్ముకున్నట్లుగా అనిపిస్తుంది. తిరుపతి ప్రేతాత్మగా మారడానికి బలైమన కారణం ఏమీ కనిపించదు. ప్రేతాత్మ ముందు నాగసాధువు శక్తులు నిలవలేకపోయినట్లుగా చూపించడం ఏ మాత్రం సమంజసంగా లేదు. అంతటి తపస్సు చేసి మహిమలు పొందిన నాగ సాధువు, ప్రేతాత్మ ముందు బలహీనంగా చూపించడం లాజిక్‌గా అనిపించదు. అయితే ఇలాంటి ఓ బలహీనమైన కథకు మరోసారి సీక్వెల్ ఉందని పార్ట్-3 ఉంటుందని హింట్ ఇవ్వడం కొసమెరుపు
నటీనటుల పనితీరు: నాగసాధువుగా భైరవి పాత్రలో తమన్నా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే పూర్తిస్థాయిలో ఆ పాత్రకు తమన్నా సూట్ అవ్వలేదనిపించింది. ఆ పాత్రలో ఉండాల్సిన గాంభీర్యం, ఆహార్యం ఆమెలో కనిపించలేదు. ప్రతి నాయకుడిగా, అత్యంత క్రూరుడిగా వశిష్ట ఆ పాత్రకు న్యాయం చేశాడు. ఇక టెక్నికల్‌గా సౌందర్ రాజన్ ఫోట్రోగ్రఫీ, అజనీష్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సంపత్ నంది రాసుకున్న కథలో బలమైన ఎలిమెంట్స్, ఎమోషన్ లేకపోవడం, సినిమాలో కొత్తదనం, ప్రేక్షకులను అలరించే సీన్స్ లేకపోవడంతో ఈచిత్రం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది.
'ఓదెలా 2' - మూవీ రివ్యూ!
| Reviews

Odela 2 Review
- ఆడియన్స్‌కు థ్రిల్ ను పంచడంలో విఫలం
- కొత్తదనం లేని కథా కథనాలు
- నత్తనడకన సాగే సన్నివేశాలు
- ఆడియన్స్‌కు థ్రిల్ ను పంచడంలో విఫలం
Movie Name: Odela 2
Release Date: 2025-04-17
Cast: Tamannah, Hebah Patel, Vasishta N Simha, Yuva, Naga Mahesh, Vamsi
Director: Ashok Teja
Music: Ajaneesh Loknath
Banner: Madhu Creations
Review By: Madhu
Odela 2 Rating: 2.25 out of 5
Trailer