కొంతకాలం క్రితం వరకూ కోర్టు రూమ్ డ్రామాతో కూడిన కంటెంట్ ను చూడటానికి ప్రేక్షకులు బోర్ ఫీలయ్యేవారు. కానీ ఈ తరహా కంటెంట్ ను ఇంట్రెస్టింగ్ గా అందిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే విషయాన్ని ఈ మధ్య వచ్చిన 'కోర్ట్' సినిమా నిరూపించింది. అలాంటి ఒక కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన మరో సినిమానే 'ఉద్వేగం'. క్రితం ఏడాది నవంబర్లో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: నగరం శివార్లలో ఒక యువతిపై నలుగురు యువకులు అత్యాచారం జరుపుతారు. తీవ్రమైన గాయాలతో ఉన్న ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. అత్యాచారానికి పాల్పడిన నరేశ్ .. పవన్ .. తేజసాయి అనే ముగ్గురు యువకులు పోలీసులకు పట్టుబడతారు. సంపత్ అనే యువకుడు మాత్రం తప్పించుకుంటాడు. ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తూ ఉంటారు. ఎక్కడ చూసిన ఈ విషయాన్ని గురించే అంతా మాట్లాడుకుంటూ ఉంటారు.
మహేంద్ర (త్రిగుణ్) క్రిమినల్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజున అతను ఆఫీసులో ఉండగా ఒక యువకుడు అక్కడికి పరుగెత్తుకు వస్తాడు. గ్యాంగ్ రేప్ కేసులో నాల్గొవ నిందితుడు అతనే అని మహేంద్రకి అప్పుడే తెలుస్తుంది. అంతలో పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుంటారు. సంపత్ గ్రాండ్ మదర్ వచ్చి, అతనికి ఏ పాపమూ తెలియదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ఆవేదనలో మహేంద్రకి నిజాయితీ కనిపిస్తుంది.
అప్పుడు మహేంద్ర ఆ యువకుడి తరఫున వాదించాలని నిర్ణయించుకుంటాడు. అయితే బయట నుంచి అతనికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. చివరికి మహేంద్ర ఎంగేజ్ మెంట్ కూడా రద్దవుతుంది. అయినా సంపత్ ను నమ్మి అతను ఈ కేసులో ముందుకు వెళతాడు. ఫలితంగా అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? సంపత్ ను ఆయన రక్షించగలుగుతాడా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: సాధారణంగా కోర్టు రూమ్ డ్రామాలు నాలుగు గోడల మధ్యనే జరుగుతూ ఉంటాయి. సంభాషణలతోనే కాలం గడిచిపోతూ ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో ఒక సినిమాను చేయాలనీ అనుకునేవారు ఎంచుకునే జోనర్లలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. కేసు .. వాద ప్రతివాదాలు ఆసక్తికరంగా ఉన్నప్పుడే, ఇలాంటి కంటెంట్ వర్కౌట్ అవుతుంది. ఏ మాత్రం కంటెంట్ వీక్ గా ఉన్నా ఆడియన్స్ అసహనానికి లోనవుతూ ఉంటారు.
మరి 'ఉద్వేగం' కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉందా? అంటే, లేదనే చెప్పవలసి ఉంటుంది. ఒక గ్యాంగ్ రేప్ జరగడానికి దారితీసిన పరిస్థితులు .. ఆ తరువాత చోటుచేసుకున్న సంఘటనలు .. ఇన్వెస్టిగేషన్ .. కోర్టులో నేరస్థులకు ఎదురయ్యే ప్రశ్నలు .. ఇలా కుతూహలాన్ని పెంచే ఒక ట్రాక్ నాన్ స్టాప్ గా నడవాల్సి ఉంటుంది. కానీ ఈ తతంగమంతా తూతూ మంత్రంగా మాత్రమే కానిచ్చేశారు.
ఇక అసలు విషయానికి ముందు క్రిమినల్ లాయర్ తెలివితేటలు చూపించడానికి ప్లాన్ చేసిన ఎపిసోడ్ మరీ చప్పగా అనిపిస్తుంది. కథలో కీలకమైన అంశాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా తేలిపోతూ ఉంటాయి. ఇక ఈ కథలో ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టుల సంగతి అలా ఉంచితే, మిగతా ఆర్టిస్టుల నుంచి తీసుకున్న అవుట్ పుట్ అంతంత మాత్రంగా అనిపిస్తుంది. టైటిల్ కి తగినట్టుగా కాస్తంత 'ఉద్వేగం' చివర్లో కనిపిస్తుందంతే.
పనితీరు: కథాకథనాలలో కొత్తదనమేదీ కనిపించదు. సన్నివేశాలను కూడా అంత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయలేదు. కొన్ని సన్నివేశాలు సినిమా స్థాయిలో లేవనే అనిపిస్తుంది. అజయ్ కుమార్ ఫొటోగ్రఫీ .. కార్తీక్ కొడగండ్ల నేపథ్య సంగీతం .. జశ్విన్ ప్రభు ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే.
ముగింపు: కోర్టు చుట్టూ తిరిగే కథల్లో కోర్టుకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా నిలవాలి. కానీ ఈ సినిమాలో కోర్టుకు సంబంధించిన చాలా సన్నివేశాలు పేలవంగా సాగిపోతాయి. చివర్లో ఒకటి రెండు సీన్స్ ఎమోషన్స్ కి గురిచేసినా, వాటి కోసం అప్పటివరకూ వెయిట్ చేయడం కష్టమే.
'ఉద్వేగం' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
| Reviews

Udvegam Review
- త్రిగుణ్ ప్రధాన పాత్రగా 'ఉద్వేగం'
- కోర్టు రూమ్ డ్రామాగా నడిచే కథ
- పేలవంగా సాగే సన్నివేశాలు
- ఆకట్టుకోని కంటెంట్
Movie Name: Udvegam
Release Date: 2025-04-03
Cast: Trigun, Deepsika, Srikanth Ayyangar, Suresh, Shiva krishna
Director: Mahipal Reddy
Music: karthik Kodagandla
Banner: Kalasrusti Internaional
Review By: Peddinti