ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల పై క్రైమ్ థ్రిల్లర్ జోనర్లోని వెబ్ సిరీస్ లకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అందువలన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు ఈ తరహా జోనర్లోని కంటెంట్ ను అందించడానికి పోటీపడుతూ ఉంటాయి. అలా రూపొందిన వెబ్ సిరీస్ గా 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' సిరీస్ రూపొందింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఈ కథ 2002 సంవత్సరంలో 'కలకత్తా'లో జరుగుతూ ఉంటుంది. వరుణ్ రాయ్ (ప్రొసేన్ జిత్ ఛటర్జీ) అధికార పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ముఖ్యమంత్రిని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్న ఆయన, కలకత్తా రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడి లోకల్ డాన్ గా బాఘా (శాశ్వత ఛటర్జీ) వ్యవహరిస్తూ ఉంటాడు. అతని దగ్గర నమ్మకస్తులైన అనుచరులుగా సాగోర్ (రిత్విక్ భౌమిక్) రంజిత్ (ఆదిల్ జాఫర్) ఉంటారు.
బాఘా అప్పగించిన ఏ పని అయినా సాగోర్ .. రంజిత్ ఇద్దరూ కలిసే చేస్తుంటారు. ఒక సందర్భంలో బాఘాను ఇబ్బంది పెట్టడం కోసం ఇద్దరూ కలిసి పోలీ ఆఫీసర్ 'సప్తరుషి'ని లేపేస్తారు. దాంతో బాఘా తన కొడుకుతో కలిసి అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోతాడు. అలాగే సాగోర్ - రంజిత్ కూడా రహస్య ప్రదేశంలో తలదాచుకుంటారు. ఈ కేసు పరిష్కరించడం కోసం పోలీస్ ఆఫీసర్ అర్జున్ (జీత్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసు తాలూకు మూలాలను ఆయన అన్ని వైపుల నుంచి పరిశీలిస్తాడు. తమ డిపార్టుమెంటు నుంచి కొన్ని లీకులు బయటకి వెళుతున్నాయనే నిర్ణయానికి వస్తాడు.
ఈ నేపథ్యంలో ఇటు పార్టీలోని పరిస్థితులను .. అటు కలకత్తా మాఫియాలో జరుగుతున్న మార్పులను తనకి అనుకూలంగా మార్చుకోవాలని వరుణ్ రాయ్ నిర్ణయించుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ సప్తరుషి హత్య అనంతరం సిటీ నుంచి పారిపోయిన జర్నలిస్ట్ కోయల్, ఓ రోజున అర్జున్ కి కాల్ చేస్తుంది. తాను పరిశోధన ద్వారా తెలుసుకున్న రహస్యాలను ఆయనకి చెబుతుంది. ఆ రహస్యాలేమిటి? అప్పుడు అర్జున్ ఏం చేస్తాడు? సాగోర్ - రంజిత్ ల మధ్య స్నేహం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? పోలీస్ సీక్రెట్ లను బయటకి చెప్పే ఆ ఇంటిదొంగ ఎవరు? అనేవి ఈ కథలోని ఆసక్తికరమైన అంశాలు.
విశ్లేషణ: కొన్ని ప్రాంతాలలో అవినీతి రాజకీయ నాయకుల హవా నడుస్తూ ఉంటుంది. వాళ్లు తమకంటే పై స్థాయిలో ఉన్న నాయకులను .. పోలీస్ డిపార్టుమెంటులో అవినీతి అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. నిజాయితీ కలిగిన అధికారులను ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాగే లోకల్ గా కొంతమంది రౌడీలను పెంచిపోషిస్తూ, వాళ్లను పావులుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక వ్యవస్థ చుట్టూ అల్లుకున్న కథ ఇది.
ఒక స్వార్థపరుడైన రాజకీయ నాయకుడు .. రౌడీయిజాన్ని నమ్ముకుని రోజులు నెట్టుకొస్తున్న ఇద్దరు స్నేహితులు .. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా నేరస్థుల ఆటకట్టించాలని కంకణం కట్టుకున్న ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. రాజకీయం - రౌడీయిజం మధ్య నలిగిపోయే ఓ నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్, తన ముందున్న సవాళ్లను ఎలా దాటుకుని వెళ్లాడనేది ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది.
ఈ సిరీస్ లో చాలానే పాత్రలు ఉన్నాయి. అయినా ప్రధానమైన పాత్రలను రిజిస్టర్ చేసిన విధానం వలన, ఎలాంటి అయోమయం లేకుండా ఆడియన్స్ ఆ పాత్రలను ఫాలో అవుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కనెక్ట్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. అలాగే క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 3వ ఎపిసోడ్ తరువాత అక్కడక్కడా సన్నివేశాలు నిదానంగా కదులుతున్నట్టుగా అనిపిస్తాయి. అయితే కథలో పట్టుమాత్రం తగ్గకుండా చూసుకున్నారు.
పనితీరు: కథగా చూస్తే అంతగా కొత్తదనం ఉన్నదేం కాదు .. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను మలచినతీరు .. కథలోని మలుపులు ఎక్కడా ఎలాంటి అయోమయం లేకుండా సాగుతాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
నిర్మాణ విలువల పరంగా ఈ సిరీస్ మంచి మార్కులనే కొట్టేస్తుంది. తుషార్ కాంతి రే .. అరవింద్ సింగ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీత్ గంగూలీ నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగుతూ, సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళుతుంది. ప్రవీణ్ ఎడిటింగ్ ఓకే.
ముగింపు: క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్ ను 7 ఎపిసోడ్స్ గా అందించారు. కథాకథనాలు కాస్త నిదానంగా నడిచినట్టుగా అనిపించినా, కంటెంట్ తన పట్టును కోల్పోదు. దర్శకుడు ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాల జోలికి గానీ .. ఆ తరహా సంభాషణల దిశగా గాని వెళ్లలేదు. అక్కడక్కడా హద్దులు దాటిన రక్తపాతమైతే ఉంది. ఈ జోనర్ ను ఇష్టపడే ఆడియన్స్ ను నిరాశపరచని సిరీస్ అనే చెప్పాలి.
'ఖాకీ : ది బెంగాల్ చాప్టర్'(నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!
| Reviews

Khakee The Bengal Chapter Review
- క్రైమ్ థ్రిల్లర్ గా 'ఖాకీ : ది బెంగాల్ చాప్టర్'
- 7 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
- ఆకట్టుకునే యాక్షన్ - ఎమోషన్
- ఎక్కడా కనిపించని .. వినిపించని అశ్లీలత
- రక్తపాతం శాతం మాత్రం ఎక్కువే
Movie Name: Khakee The Bengal Chapter
Release Date: 2025-03-20
Cast: Jeeth Madani, Rithvik Bhoumik, Chithrangada Singh, Akanksha Singh, Prosenjith Chatarjee
Director: Neeraj Pandey
Music: Jeet Ganguli
Banner: Friday Storytellers
Review By: Peddinti
Khakee The Bengal Chapter Rating: 3.00 out of 5
Trailer