'కోబలి' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

| Reviews
Kobali

Kobali Review

  • రివేంజ్ డ్రామా నేపథ్యంలో 'కోబలి'
  • ఆసక్తికరంగా సాగే కథాకథనాలు
  • 7 భాషల్లో 8 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి 
  • యాక్షన్ కీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిచ్చిన డైరెక్టర్ 
  • సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు
  • హింస - రక్తపాతం - బూతులు ఎక్కువే

రవిప్రకాశ్ చాలా కాలంగా సినిమాలలో కనిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాంటి ఆయన ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ 'కోబలి'. రేవంత్ లెవక దర్శకత్వంలో 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ రూపొందింది. ఈ రోజు నుంచే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. మరాఠీ .. బెంగాలీ భాషలలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ రివెంజ్ డ్రామా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులోని 'ముళ్లకట్ట' గ్రామం అది. అక్కడ చాలా కాలంగా సాంబయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సాంబయ్యకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు గోపి .. రెండో కొడుకు శీను (రవిప్రకాశ్) .. మూడో కొడుకు రాము. సాంబయ్య నాటుసారా కాస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. గోపీకి శాంతతో వివాహం అవుతుంది. ఆయన కొడుకు రాజు టీనేజ్ లో ఉంటాడు. శీను వివాహం మీరా (శ్యామల)తో జరుగుతుంది. వారికి ఒక పాప ఉంటుంది. ఆయన మెకానిక్ షెడ్ చూసుకుంటూ ఉంటాడు. 

 ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు శీను చూసుకుంటూ ఉంటాడు. గోపీ గానీ .. రాముగాని పట్టించుకోరు. గోపీ ఎవరికి తెలియకుండా సుజాతను రెండో వివాహం చేసుకుంటాడు. వెంకటాపురంలో ఆమెతో కాపురం పెడతాడు. ఆమెకి రమణ - పీరి అనే అన్నదమ్ములు ఉంటారు. రమణపై అనేక క్రిమినల్ కేసులు ఉంటాయి. గోపీ ఆస్తులు రాయించుకుని అతనిని తరిమేయాలనే ఆలోచనలో సుజాత .. ఆమె అన్నదమ్ములు ఉంటారు. సరైన సమయం కోసం వాళ్లు వెయిట్ చేస్తూ ఉంటారు.

ఆ గ్రామంలోని పాత మిల్లును అడ్డం పెట్టుకుని కాశీ, గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియని రాము, అతని దగ్గర పనికి చేరతాడు. సుజాత కుటుంబ సభ్యులతో గోపీ గొడవపడతాడు. ఆ గొడవలోనే సుజాత చనిపోతుంది. దాంతో రమణ గ్యాంగ్ అతనిని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో, శీను గాయపడటానికి గోపీ కారకుడు అవుతాడు. గాయాలతో శీను హాస్పిటల్ పాలవుతాడు. గంజాయి కేసు విషయంలో రాము జైలుకు వెళతాడు.

ఇలా ఇంటి దగ్గర ముగ్గురు మగాళ్లు లేని సమయంలో, మిగతా కుటుంబ సభ్యులందరినీ చంపేయమని రమణ తన మనుషులను పంపిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? రమణ మనుషుల నుంచి గోపీ తప్పించుకుంటాడా? జైలు నుంచి రాము బయటపడతాడా? తనవారిని కాపాడుకోవడానికి శీను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ సాగుతుంది. 

విశ్లేషణ: గ్రామీణ నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. గ్రామాలలో సహజంగానే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల తగాదాలు ఉంటాయి. పగలు .. ప్రతీకారాలు .. అవి తీర్చుకోవడానికి పన్నే పన్నాగాలకి సంబంధించిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక అక్రమ సంబంధాలు .. వాటి మూలంగా జరిగే అల్లర్లు కామన్ గా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి యథార్థ సంఘటనలకు దగ్గరగా ఆవిష్కరించిన కథ ఇది.

ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు బయటికి వెళ్లి ఏం చేస్తున్నారనేది తెలుసుకునే అవకాశం తక్కువ. ఆ పనులు ప్రమాదకరంగా మారిపోయి, గుమ్మం వరకూ వచ్చినప్పుడే మిగతా వారూ ఇబ్బందుల్లో పడతారు. అలాంటి ఓ ప్రమాదం ఎదురైనప్పుడు, ఓ ముగ్గురు అన్నదమ్ములు ఏం చేశారనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. యాక్షన్ ను .. ఎమోషన్స్ ను సమపాళ్లలో ఆవిష్కరించాడు. 

నిజాయితీ పరులైన పోలీస్ అధికారులు, అవినీతి పరులైన అధికారుల వలన ఎలా ప్రమాదంలో పడతారు? తెలిసిన శత్రువు కంటే కనిపించని శత్రువు ఎంతటి ప్రమాదకారి? అనే అంశాలను దర్శకుడు చూపంచిన విధానం బాగుంది. హింస .. రక్తపాతం .. సిరీస్ మొత్తం కనిపిస్తూనే ఉంటాయి .. బూతులు సర్వసాధారణం అన్నట్టుగా వినిపిస్తూనే ఉంటాయి. టైటిల్ ను బట్టి .. దానిని డిజైన్ చేసిన తీరును బట్టి ఈ సిరీస్ ఇలా ఉంటుందనే ఒక ఐడియా వచ్చేస్తుంది. అందుకు సిద్ధపడినవాళ్లు ఈ సిరీస్ చూడొచ్చు. 

పనితీరు: ఈ సిరీస్ కి కథ - స్క్రీన్ ప్లే కూడా దర్శకుడే సమకూర్చుకున్నాడు. అయితే కథ మొదలుపెట్టగానే కొన్ని పాత్రలను క్లారిటీతో పరిచయం చేయలేదు. అందువలన ఎవరు .. ఏంటి అనే విషయంలో ప్రేక్షకులకు క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది. అలా మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త కన్ఫ్యూజన్ గా అనిపించినా, మూడో ఎపిసోడ్ నుంచి సర్దుకుంటుంది.

రోహిత్ బాచు ఫొటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. గౌరహరి నేపథ్యం సందర్భానికి తగినట్టుగా సాగుతూ మెప్పిస్తుంది. మద్దాలి కిశోర్ ఎడిటింగ్ కూడా నీట్ గానే సాగింది. ఫైట్స్ .. ఛేజింగ్స్ మంచి మార్కులు కొట్టేస్తాయి. ఇంకాస్త మంచి డైలాగ్స్ పడితే బాగుండునని అనిపిస్తుంది. రాజు లవర్ కీర్తి .. ఆమె తండ్రి సంపత్ గురించి దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనే విషయంలోనే కాస్త క్లారిటీ లోపించింది. మిగతా కథ అంతా ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. 

Movie Name: Kobali

Release Date: 2025-02-04
Cast: Ravi Prakash, Shyamala, Bharath, Rocky Singh, Tarun Rohith
Director: Revanth Levaka
Music: Hari Goura
Banner: Nimbus Films - UI Creations

Kobali Rating: 2.75 out of 5

Trailer

More Reviews