'రజాకార్' (ఆహా) మూవీ రివ్యూ!

| Reviews
Razakar

Razakar Review

  • నిజం పాలనాకాలం నేపథ్యంలో 'రజాకార్'
  • 2024 మార్చి 15వ తేదీన విడుదలైన సినిమా
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • యథార్థ సంఘటనలను ఆసక్తికరంగా అందించిన దర్శకుడు 
  • ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్  
     

నిజాం పాలనా కాలంలో జరిగిన రజాకారుల దురాగతాలను తెరకెక్కించిన చిత్రమే 'రజాకార్'. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రేమ .. ఇంద్రజ .. అనసూయ .. మకరంద్ దేశ్ పాండే .. బాబీ సింహా .. రాజ్ అర్జున్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. క్రితం ఏడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యథార్థ సంఘటనల సమాహారం ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

కథ: ఎంతోమంది అమరుల త్యాగఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం లభిస్తుంది. అయితే హైదరాబాదును ఇండియాలో విలీనం చేయడానికి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాత్రం ఒప్పుకోడు. తమపై మరొకరు పెత్తనం చేయడానికి తాము ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని నిజాం నవాబు తేల్చి చెబుతాడు. హైదరాబాద్ పాలకులుగా ఎప్పటికీ నిజాం నవాబులే ఉంటారని స్పష్టం చేస్తాడు. ఆయన నిర్ణయాన్ని ఖాసీమ్ రజ్వీ బలపరుస్తాడు. 

నిజాం నవాబు ఒక వైపున రాజకీయంగా పావులు కదుపుతూనే, ప్రజలకి తమ పట్ల గల భయం తగ్గకుండా ఉండేలా చూడమని ఖాసీమ్ రజ్వీని ఆదేశిస్తాడు. అందరినీ ముస్లిమ్స్ గా మార్చమనీ, ఎదురు తిరిగినవారిని చంపేయమని అంటాడు. నిజాం నవాబ్ తనకి అధికారాలు అప్పగించడంతో, ఖాసీమ్ రజ్వీ దుర్మార్గాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. 'రజాకార్' పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకుని, గ్రామాలపై విరుచుకు పడతాడు.

తెలంగాణలో పల్లె పల్లెలో రజాకారుల రాక్షసత్వం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి గ్రామంలో సజీవ దహనాలు సహజమైపోతాయి. ఎంతోమంది తెలంగాణ వీరులు .. రజాకారుల తుపాకీ తూటాలకు నేలకొరుగుతారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకునే నిర్ణయం .. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

విశ్లేషణ: హైదరాబాదును భారతదేశంలో విలీనం చేయమంటూ ప్రభుత్వం, అలా చేయడానికి నిజం నవాబ్ నిరాకరించడం .. తన బలాన్ని పెంచుకోవడానికిగాను హిందువులను ముస్లిమ్స్ గా మార్చడానికి ప్రయత్నించడం .. వ్యతిరేకించిన వారిని హతమార్చడం .. ఈ పరిణామాల నేపథ్యంలో నెహ్రూ - వల్లభాయ్ పటేల్ వంటివారు రాజకీయ సమాలోచనలు చేయడమనే ప్రధానమైన అంశాలు ఈ చారిత్రక కథలో కనిపిస్తాయి.

దర్శకుడు రజాకార్ ఉద్యమంపై గట్టిగానే పరిశోధన చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఏయే సమయాల్లో రజాకారుల దాడి ఏయే ప్రాంతాలపై సాగిందనేది దర్శకుడు స్పష్టం చేసిన తీరు బాగుంది. రజాకారులు హింసకి తెగబడిన గ్రామాలలో ఒక్కో నాయకుడిని .. నాయకురాలిని నిలుపుతూ, వారి పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ఒక్కో పోరాటాన్ని ఒక్కో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా అందించటం మెప్పిస్తుంది. 

కథ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ, ఎక్కడా బలహీన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పటి తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు .. వారి జీవన విధానం .. అవసరమైతే ఆయుధాలు పట్టడానికి వెనుకాడని వారి ధైర్య సాహసాలను ఆవిష్కరించిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇక అప్పటి కాలానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ .. వాహనాలు .. వస్తువులు .. నివాసాలను ప్రతిబింబించిన విషయంలోను మంచి మార్కులు పడతాయి.           
    
పనితీరు: మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాత్రలో మకరంద్ దేశ్ పాండే .. ఖాసీమ్ రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ .. సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో తేజ్ సప్రూ .. రాజి రెడ్డి పాత్రలో బాబీ సింహా ఒదిగిపోయారు. ప్రేమ .. ఇంద్రజ .. అనసూయ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యమైన పాత్రలను ఒకదాని తరువాత ఒకటిగా తెరపైకి తీసుకొస్తూ, దర్శకుడు వేసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవచ్చు. 

కుశేన్దర్ రమేశ్ రెడ్డి ఫొటోగ్రఫీ బాగుంది. దాడి దృశ్యాలు .. పోరాట దృశ్యాలను చిత్రీకరించిన తీరు మెప్పిస్తుంది. భీమ్స్ బాణీలు .. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. 'బతుకమ్మ' పాట కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. ఎక్కడ అనవసరమైన సన్నివేశాలు లేకపోవడం,  తమ్మిరాజు ఎడిటింగ్ పనితీరుగా చెప్పుకోవచ్చు. 

దర్శకుడు సాధ్యమైనంత వరకూ సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ వెళ్లాడు. హింస - రక్తపాతం ఎక్కువనే అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు జరిగిందే అరాచకత్వం గనుక, ఆ వైపు నుంచి సరిపెట్టుకుని చూడాలి. అప్పుడు ఇది ఒక మంచి ప్రయత్నంగానే అనిపిస్తుంది .. ఒక సాహసోపేతమైన ప్రయోగంగానే కనిపిస్తుంది.

Movie Name: Razakar

Release Date: 2025-01-24
Cast: Makarand Deshpande, Raj Arjun, Tej Sarpu, Indraja, Prema, Anasuya, Vedika
Director: Yata Sathyanarayana
Music: Bheems Ceciroleo
Banner: Samarveer Creations

Razakar Rating: 3.00 out of 5

Trailer

More Reviews