మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో 'బరోజ్' సినిమా రూపొందింది. తొలిసారిగా ఆయన దర్శకుడిగా వ్యవహరించడం విశేషం. ఆంటోని పెరుంబవూర్ నిర్మించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఫాంటసీ అడ్వెంచర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ రోజు నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.
కథ: 'గోవా'ను ఒకప్పుడు డి గామా వంశానికి చెందిన పోర్చుగీసు రాజు పాలిస్తాడు. ఆ రాజు .. ఆయన పరివారం అంతా కూడా ఆ నగరాన్ని ఖాళీ చేసి పారిపోవలసి వస్తుంది. సముద్రతీరంలో ఆ రాజభవనాలను రాచరికపు వస్తువులతో కూడిన మ్యూజియంగా మారుస్తారు. అయితే అక్కడికి సమీపంలోనే ఆ కాలానికి చెందిన ఒక పాత బంగాళ ఉంటుంది. ఆ రాజుకి సంబంధించిన నిధి అక్కడ నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఆ బంగ్లాను కూల్చి 'క్యాసినో' నిర్మిచాలనే ఆలోచనలో వారసులు ఉంటారు.
400 ఏళ్లుగా ఆ నిధిని 'బరోజ్' (మోహన్ లాల్) అనే భూతం రక్షిస్తూ ఉంటుంది. ఆ నిధిని కొల్లగొట్టడానికి ప్రయత్నించినవారిని ఆ భూతం తరిమికొడుతూ ఉంటుంది. రాజవంశీకులకు ఆ నిధిని అప్పగించే రోజు కోసం ఆ భూతం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ రాజవంశీకులకు తప్ప ఇతరులకు ఆ భూతం కనిపించదు. అందువలన ఆ భూతంతో తలపడే సాహసం ఎవరూ చేయలేకపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి ఇసబెల్లా (మాయా రావ్) వస్తుంది.
రాజవంశానికి చెందిన 13వ వారసురాలు ఆమె. 13 ఏళ్ల వయసున్న ఇసబెల్లాకి నిధి అప్పగించాలని 'బరోజ్' అనుకుంటాడు. ఆమె ద్వారా ఆ భూతాన్ని బంధించాలని, ఆ ప్రాంతానికి చెందిన 'మరియా' అనే మాంత్రికురాలు ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజవంశంపై బరోజ్ కి గల విశ్వాసం గెలుస్తుందా? మరియా ప్రయత్నాలు ఫలిస్తాయా? గతంలో ఇక్కడ ఏం జరిగింది తెలియని ఇసాబెల్లా ఎలా స్పందిస్తుంది? ఆమె చేతికి ఆ నిధి దక్కుతుందా? అనేది కథ.
విశ్లేషణ: పోర్చుగల్ లో ప్రాచుర్యంలో ఉన్న ఒక జానపద కథ ఇది. 'బరోజ్' ఎంట్రీతోనే ఈ కథ మొదలవుతుంది. 400 ఏళ్ల నాటి ఫ్లాష్ బ్యాక్ ను అక్కడక్కడా టచ్ చేస్తూ, ప్రస్తుత కాలానికి సంబంధించిన కథ నడుస్తూ ఉంటుంది. 1633 కాలానికి సంబంధించిన వాతావరణాన్ని ఒక పరిధిలోనే ప్లాన్ చేశారు. ప్రస్తుత కాలానికి సంబంధించిన కథను కలర్ ఫుల్ గా చూపించారు. ప్రధానమైనవి ఓ నాలుగు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.
రాజుల కాలం .. నిధికి భూతం కాపలాగా ఉండటం .. భూతాన్ని తరిమేయడానికి ఓ మాంత్రికురాలు ప్రయత్నించడం .. అనే అంశాలతో అంచలంచెలుగా కథ ముందుకు వెళుతూ ఉంటుంది. ఒక రాజు దగ్గర విశ్వాస పాత్రుడిగా ఉన్న రక్షకుడు భూతంగా ఎలా మారాడు? అనే అంశాన్ని రివీల్ చేసినప్పుడు, దర్శకుడు ఆశించిన ఎమోషన్స్ ఎంత మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కావు. మోహన్ లాల్ గెటప్ డిఫరెంట్ గా కనిపిస్తుందే తప్ప, భూతంగా మాత్రం అనిపించదు.
ఇక మాత్రికురాలికి .. భూతానికి మధ్య పోరాటం ఒక రేంజ్ లో ఉంటుందని అనుకోవడం సహజం. కానీ అందుకు సంబంధించిన సన్నివేశాలు కూడా పెద్దగా మెప్పించవు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన కొన్ని షాట్స్ వారికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇది పిల్లలకు బామ్మలు చెప్పే జానపద కథనే. కాకపోతే ఆ జానపద కథలో ఆసక్తి లోపించడమే ఇక్కడ నిరాశకి గురిచేసే విషయం.
పనితీరు: మోహన్ లాల్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే, ప్రేక్షకులలో కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ ఆయన ఒక సంస్థానానికీ .. ఒక బంగ్లాకి పరిమితమైన కథను ఎంచుకుని పొరపాటు చేశారేమో అనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ కథ సరైన దారిలో వెళ్లడం లేదనే అనిపిస్తూ ఉంటుంది. అందుకు తగినట్టుగానే ఎమోషన్స్ ఎక్కడా పట్టుకోవు.
మోహన్ లాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కానీ లుక్ మొదలు ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. ఇక రాజుగారు .. ఆయన కూతురు .. మాంత్రికురాలు పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా పేలవంగానే సాగుతుంది.
సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ బాగుంది .. మార్క్ నేపథ్య సంగీతం ఫరవాలేదు .. అజిత్ కుమార్ ఎడిటింగ్ ఓకే. గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ బాగానే ఉంది .. కానీ కథలో విషయం లేకపోవడం వలన ఆడియన్స్ కి థ్రిల్ అనిపించదు. బలహీనమైన కథ కోసం చేసిన భారీ ఖర్చుగా ఈ సినిమా కనిపిస్తుంది అంతే.
'బరోజ్' (హాట్ స్టార్)మూవీ రివ్యూ!
| Reviews

Barroz Review
- మోహన్ లాల్ హీరోగా రూపొందిన 'బరోజ్'
- డిసెంబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- ఆసక్తికరంగా లేని కథాకథనాలు
Movie Name: Barroz
Release Date: 2025-01-22
Cast: Mohanlal, Maya Rao, Nerea Camacho, Guru Somasundaram
Director: Mohanlal
Music: Mark Killian
Banner: Aashirvad Cinemas
Review By: Peddinti
Barroz Rating: 2.00 out of 5
Trailer