బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటుడిగా మలయాళ ఇండస్ట్రీలోను అడుగుపెట్టాడు. బ్లాక్ కామెడీ జోనర్లో రూపొందిన ఆ సినిమా పేరే 'రైఫిల్ క్లబ్'. ఆషిక్ అబూ దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. 30 కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను అందుబాటులో ఉంది. ఈ సినిమా కంటెంట్ ఏమిటనేది చూద్దాం.
కథ: 1990 లలో జరిగే కథ ఇది. మంగుళూరులో దయానంద్ (అనురాగ్ కశ్యప్) ఉంటాడు. అతను నిర్వహించే అక్రమ కార్యకలాపాలకు అతని ఇద్దరు కొడుకులు సపోర్టుగా ఉంటారు. దయానంద్ నిర్వహించిన ఒక పార్టీలో ఒక యువకుడు - యువతి డాన్స్ చేస్తారు. వాళ్లిద్దరూ ప్రేమికులు. అయితే ఆ యువతిపై దయానంద్ పెద్దకొడుకు మనసు పారేసుకుంటాడు. ఆమెను దక్కించుకునే ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో అతను మేడ పైనుంచి పడి చనిపోతాడు.
ఆ యువకుడు - యువతి అక్కడి నుంచి పారిపోతారు. ఆ యువకుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో శ్యామల్ కి కజిన్. శ్యామల్ కొత్తగా ఒక సినిమా షూటింగులో పాల్గొనవలసి ఉంటుంది. అది అడవి నేపథ్యంలో సాగే కథ. అందువలన అతను ఆ పాత్రకి సంబంధించిన కసరత్తు నిమిత్తం, కేరళలోని వయనాడ్ ఫారెస్టుకి బయల్దేరతాడు. అక్కడి 'రైఫిల్ క్లబ్' కి చేరుకుంటాడు. అక్కడ లోనప్పన్ (విజయ రాఘవన్) తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తూ ఉంటాడు. వాళ్లు గన్ పేల్చడంలో శ్యామల్ కి తర్ఫీదును ఇస్తుంటారు.
లోనప్పన్ దగ్గర పూర్వీకులకు సంబంధించిన వివిధ రకాల గన్స్ ఉంటాయి. అలాగే తన ముందు తరం వారు దాచిన మందుగుండు సామాగ్రిని కూడా అతను సంరక్షిస్తూ ఉంటాడు. దయానంద్ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న ప్రేమజంట, శ్యామల్ ను వెతుక్కుంటూ రైఫిల్ క్లబ్ కి చేరుకుంటారు. లోనప్పన్ కుటుంబ సభ్యులు వాళ్లకి ఆశ్రయం ఇస్తారు. ఆ జంటను వెంటాడుతూ, దయానంద్ గ్యాంగ్ అక్కడికి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అనేది కథ.
విశ్లేషణ: ఒక గ్యాంగ్ స్టర్ కొడుకు చనిపోవడానికి ఒక ప్రేమజంట కారణం కావడం .. తప్పించుకున్న ఆ ప్రేమజంట, ఫారెస్టు ఏరియాలోని రైఫిల్ క్లబ్ కి చేరుకోవడమనేది ఫస్టాఫ్ గా వస్తుంది. ఆ ప్రేమజంటను వెతుకుతూ అక్కడికి ఆ గ్యాంగ్ స్టర్ రావడం .. ఫలితంగా అక్కడ చోటుచేసుకునే సన్నివేశాలతో సెకండాఫ్ నడుస్తుంది. ఈ మొత్తం కథకి బ్లాక్ కామెడీ టచ్ ఉంటుంది.
'రైఫిల్ క్లబ్' కి ప్రాచీన కాలానికి చెందిన ఒక చరిత్ర ఉంటుంది. దానిని నిర్వహించడాన్ని ఆ కుటుంబ సభ్యులు గర్వకారణంగా భావిస్తూ ఉంటారు. 'గొప్ప తుపాకులకు యజమానులు ఉండరు .. వారసులు మాత్రమే ఉంటారు' అనేది వారి అభిప్రాయం. సాహసం చేయడం .. సాయపడటం తమ పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్పుకునే ఆ కుటుంబ సభ్యుల పాత్రలను దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్నాడు.
ఒక వైపున ఆధునిక ఆయుధాలు కలిగిన గ్యాంగ్ స్టర్ అనుచరులు. మరో వైపున తమ నైపుణ్యం పట్ల గల నమ్మకంతో పాతకాలం నాటి గన్స్ తోనే రంగంలోకి దిగే రైఫిల్ క్లబ్ టీమ్ మధ్య జరిగే పోరాటాన్ని ఒక రేంజ్ లో ఆవిష్కరించారు. ఆయుధాన్ని ఉపయోగించేవారిని బట్టి విజయం వరిస్తుందనే కాన్సెప్ట్ ను ఇక్కడ వర్కౌట్ చేశారు.
పనితీరు: చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేని కాన్సెప్ట్ ఇది. తన కొడుకు మరణానికి కారకులైన ప్రేమజంటను ఒక గ్యాంగ్ స్టర్ వెంటాడితే, ఆ లవర్స్ కి ఆశ్రయం కల్పించి, రక్షించడం కోసం రంగంలోకి దిగిన 'రైఫిల్ క్లబ్' టీమ్ కథ ఇది. బ్లాక్ కామెడీ జోనర్లో ఈ కథను పిండినప్పటికీ, పెద్దగా ప్రయోజనం లేదనిపిస్తుంది. చివరి 30 నిమిషాలను దర్శకుడు పూర్తిగా కాల్పులపైనే ఫోకస్ చేశాడు.
రైఫిల్ క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. ఈ కారణంగా పాత్రలు రిజిస్టర్ కాక ఒక రకమైన గందరగోళం ఉంటుంది. ప్రధానమైన పాత్రల ప్రభావం కూడా తక్కువగా కనిపిస్తుంది. విజయ్ రాఘవన్ .. వాణీ విశ్వనాథ్ వంటివారి పాత్రలు నామమాత్రంగా అనిపిస్తాయి. ఎవరి పాత్రల పరిధిలో వారు బాగానే చేశారు.
అడవి నేపథ్యంలోని దృశ్యాల వైవు నుంచి ఆషిక్ అబూ ఫొటోగ్రఫీ మంచి మార్కులు కొట్టేస్తుంది. రెక్స్ విజయం నేపథ్య సంగీతం.. సాజన్ ఎడిటింగ్ ఓకే. సింపుల్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన కంటెంట్ ఇది. సినిమా మొత్తంగా చూసుకుంటే, కామెడీ తక్కువగా కనిపిస్తుంది .. కాల్పుల శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది .. అంతే.
'రైఫిల్ క్లబ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews

Rifle Club Review
- బ్లాక్ కామెడీ జోనర్లో సాగే 'రైఫిల్ క్లబ్'
- డిసెంబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా
- మలయాళంలో రాబట్టిన భారీ వసూళ్లు
- నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్
- అంతగా ఆకట్టుకోని కంటెంట్
Movie Name: Rifle Club
Release Date: 2025-01-16
Cast: Vijay Raghavan, Dileesh Pothan, Aurag Kashyap, Vani Vishvanath, Surabhi Lakshmi
Director: Aashiq Abu
Music: Rex Saajan
Banner: OPM Cinemas
Review By: Peddinti
Rifle Club Rating: 2.00 out of 5
Trailer