మలయాళంలో జోజు జార్జ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరోగా రూపొందిన సినిమానే 'పని'. ఈ సినిమాకి కథను అందించినది .. దర్శకత్వం వహించింది జోజు జార్జ్ కావడం విశేషం. ఆయన దర్శకత్వం వహించిన ఫస్టు మూవీ ఇది. అక్టోబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: త్రిసూర్ లో గిరి (జోజు జార్జ్) అతని భార్య గౌరీ (అభినయ) నివసిస్తూ ఉంటారు. గిరి అక్కడ గ్యాంగ్ స్టర్. అతనికి సపోర్టుగా డేవిడ్ .. కురువిల్లా .. సాజీ ఉంటారు. వాళ్లంతా కాలేజ్ రోజుల నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటూ ఉంటారు. అందువలన వాళ్లను టచ్ చేయడానికి ఆ ప్రాంతంలో అందరూ భయపడుతూ ఉంటారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రంజిత్ వేలాయుధన్ వాళ్లను గురించి ఆరాతీస్తూ ఉంటాడు.
సెబాస్టియన్ (సాగర్ సూర్య) సిజూ (జునైద్) ఒక మెకానిక్ షెడ్ లో పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కూడా ఆకతాయిలు .. ఈజీ 'మనీ' కోసం ఏం చేయడానికైనా వెనుకాడనివారు. డబ్బు కోసం సురేశ్ అనే వ్యక్తిని మర్డర్ చేసిన ఈ ఇద్దరూ, తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. గిరి గురించి అతని బ్యాక్ గ్రౌండ్ గురించి సెబాస్టియన్ కీ గానీ .. సిజూకి గాని తెలియదు. అందువలన ఒక సూపర్ మార్కెట్ లో గౌరిపట్ల అసభ్యంగా ప్రవర్తించి గిరి చేతిలో తన్నులు తింటారు.
వాళ్లిద్దరూ ఆకతాయిలు .. అంతకుమించి భయపెట్టవలసిన పనిలేదని గిరి వదిలేస్తాడు. కానీ ఆ కుర్రాళ్లిద్దరూ ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. తమని అవమానపరిచిన గిరిని భయంతో పరుగులు పెట్టించాలని సెబాస్టియన్ - సిజూ నిర్ణయించుకుంటారు. ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల కారణంగా గిరి ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? అప్పుడు గిరి ఏం చేస్తాడు? అనేది కథ.
విశ్లేషణ: జోజు జార్జ్ ఈ కథను తయారు చేసుకున్నాడు. సాధారణంగా గ్యాంగ్ స్టర్ కథల్లో .. హీరో - విలన్ సమఉజ్జీలుగా ఉంటారు. నువ్వా నేనా? అన్నట్టుగా తలపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నలుగురు స్నేహతులు కలిసి .. 400 మంది అనుచరులతో ఏర్పాటు చేసుకున్న ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగును కొత్తగా రౌడీయిజం మొదలెట్టిన ఇద్దరు ఆకతాయిలు ఎదిరించి పోరాడటమనేది కొత్తగా అనిపిస్తుంది.
ఒక వైపున యాక్షన్ .. మరో వైపున ఎమోషన్ ను సమపాళ్లలో కలుపుకుని ఈ కథ పరుగెడుతూ ఉంటుంది. బలమైన ఈ కథకు .. సరైన స్క్రీన్ ప్లే తోడు కావడం వలన మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగనుందా అనే ఒక ఉత్కంఠ పెరుగుతూ పోతుంది. ఒక్కోసారి చిన్నచిన్న గొడవలు ఏ స్థాయివరకూ వెళతాయి .. చిన్న పామునే కదా అని వదిలేస్తే, అది ఎంతటి ప్రమాదానికి కారణమవుతుంది .. అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
ఒక అడ్రెస్ అనేది లేనివారికి, ఏ నేరం చేసినా తాము పట్టుబడమనే ఒక ధైర్యం ఉంటుంది. 'మనకు ఒక అడ్రెస్ అనేది లేనప్పుడు మనలను వెతుక్కుంటూ ఎవరొస్తారు?' అని నేరస్థులు మాట్లాడుకుంటారు .. అదే పద్ధతిలో ముందుకు వెళతారు. శత్రువును తక్కువగా అంచనా వేసినవాడు, తప్పకుండా దెబ్బతింటాడు అనే విషయాన్ని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చివరివరకూ సాగుతుంది.
పనితీరు: జోజు జార్జ్ నటన .. దర్శక ప్రతిభ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. కథను ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. ప్రధానమైన పాత్రలను మలచిన విధానం బాగుంది. ఏ పాత్ర గానీ .. ఏ సన్నివేశంగాని అనవసరంగా అనిపించవు. అభినయ .. సాగర్ సూర్యతో పాటు, మిగతా ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు.
వేణు - జింటో జార్జ్ ఫొటోగ్రఫీ బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ .. ఛేజింగ్ దృశ్యాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. సామ్ సీఎస్ .. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం హైలైట్ అనే చెప్పాలి. మను ఆంటోని ఎడిటింగ్ కూడా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది.
ముగింపు: కథ - స్క్రేన్ ప్లే .. పాత్రలను .. సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు, ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం ఈ సినిమాను ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ చేస్తాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
'పని' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
| Reviews

Pani Review
- జోజు జార్జ్ హీరోగా రూపొందిన 'పని'
- ఆయన డైరెక్ట్ చేసిన ఫస్టుమూవీ ఇది
- అక్టోబర్ 24న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్
- ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఆకట్టుకునే కంటెంట్
Movie Name: Pani
Release Date: 2025-01-16
Cast: Joju George, Sagar Surya, Abhinaya, Junaiz, Abhaya Hiranmayi
Director: Joju George
Music: Sam CS - Santosh Narayan
Banner: Appu Pathu Pappu
Review By: Peddinti
Pani Rating: 3.00 out of 5
Trailer