కేసీఆర్ (ఆహా) మూవీ రివ్యూ!

KCR

KCR Review

  • గ్రామీణ నేపథ్యలో సాగే 'కేసీఆర్'
  • ఆకట్టుకోలేకపోయిన కథాకథనాలు 
  • బలహీనమైన కామెడీ
  • కనెక్ట్ కాలేకపోయిన ఎమోషన్స్ 
  • టోటల్ కంటెంట్ లో మిస్సయిన ఫీల్   
                     

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో రాకేశ్ ఒకరు. తాను హీరోగా నటించిన సినిమానే 'కేసీఆర్' (కేశవచంద్ర రమావత్). ఈ సినిమాను ఆయన సొంత బ్యానర్ పై నిర్మించాడు. 'గరుడ వేగ' అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ, తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: వరంగల్ జిల్లా కేశవరావు పల్లి పరిధిలోని 'రంగబాయి తండా'లో ఈ కథ మొదలవుతుంది. ఈ తండాలోని మిడిల్ క్లాస్ యువకుడే 'కేశవచంద్ర రమావత్'. చిన్నప్పటి నుంచి అతను కేసీఆర్ కి వీరాభిమాని. కేసీఆర్ ను ఎవరేమన్నా ఊరుకునే రకం కాదు. అందువలన ఊళ్లో వాళ్లంతా అతనిని 'ఛోటా' కేసీఆర్ అని పిలుచుకుంటూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన మంజు (అనన్య కృష్ణన్) అతణ్ణి ప్రేమిస్తూ ఉంటుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

తమ ప్రాంతమంతా పంటలు బాగా పండుతూ ఉండటం, భూములకు రేట్లు పెరుగుతూ ఉండటం కేశవచంద్రకి ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే 'రింగ్ రోడ్'కి అవసరమైన భూమి కోసం తమ గ్రామాన్ని ఖాళీ చేయించనున్నారని తెలిసి అతను షాక్ అవుతాడు. తమ గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆలోచనలో పడతాడు. ఈ నేపథ్యంలోనే, కేశవచంద్ర - మంజు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని భావించిన ఇరుకుటుంబాల పెద్దలు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు.

అయితే అందుకు కేశవచంద్ర నిరాకరిస్తాడు. తాను పట్నం అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి, మరొక యువతితో సంబంధం కుదుర్చుకుంటాడు. పెద్దమనుషుల పంచాయితీ సమయంలో, తన పెళ్లికి కేసీఆర్ ను తీసుకొస్తానని ఛాలెంజ్ చేస్తాడు. లేదంటే తన లగ్గాన్ని రద్దు చేసుకుంటానని అంటాడు. కేసీఆర్ కోసం హైదరాబాద్ కి బయల్దేరి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అతని పెళ్లి ఎవరితో జరుగుతుంది? తన పెళ్లికి కేసీఆర్ రావాలనే అతని కోరిక నెరవేరుతుందా? అనేది కథ.

విశ్లేషణ
: ఈ కథ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు .. ఏర్పడిన తరువాత జరుగుతుంది. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం .. తెలంగాణను సాధించిన తరువాత అందిస్తున్న పరిపాలనను  ప్రస్తావిస్తూ ఈ కథ నడుస్తుంది. కేసీఆర్ పట్ల హీరో ఎంతో అభిమానం పెంచుకోవడం ఫస్టాఫ్ గా .. ఆయనను తన పెళ్లికి పిలుచుకు వస్తానని పట్నానికి బయల్దేరి వెళ్లడం సెకండాఫ్ గా  కొనసాగుతుంది. 

హీరో - హీరోయిన్ ఇద్దరి పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు చూసుకున్నాడు. అలాగే వారి కుటుంబాలకు సమానమైన ప్రాముఖ్యతను ఇచ్చాడు. కథలో గ్రామాన్ని ఒక భాగంగా చేసిన తీరు కూడా బాగానే ఉంది. అయితే తెలంగాణ పట్ల .. గ్రామీణ జీవితం పట్ల సంతోషంగా ఉండే హీరో, 'నేను సిటీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను .. నేను కూడా సిటీకే పోతాను ..' అనడం వలన ఆ కేరక్టరైజేషన్ దెబ్బతిందేమో అనిపిస్తుంది. 

హీరో .. అతని ఫ్రెండ్స్ మధ్య క్రియేట్ చేసిన కామెడీ కూడా ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఎమోషన్స్ ఉన్నాయి .. అయితే అందుకు సంబంధించిన సన్నివేశాలలో రాకేశ్ అవసరానికి మించి చేసినట్టుగా అనిపిస్తుంది. గ్రామస్తులుగా తెరపైకి వచ్చే చిన్నచిన్న పాత్రల నుంచి సరైన అవుట్ పుట్ ను రాబట్టకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. కంటెంట్ విషయంలో రాకేశ్ ఉద్దేశం మంచిదే అయినా సరైన కసరత్తు చేయకుండానే తొందరపడినట్టుగా అనిపిస్తుంది.

పనితీరు: 'జబర్దస్త్' ద్వారా రాకేశ్ ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమే. హీరోగా చేయడమే కాదు .. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. స్క్రిప్ట్ విషయంలోను ఆయన ప్రమేయం ఉంది. నటుడిగా కామెడీ వైపు నుంచి రాకేశ్ నటన బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమాకి అవసరమైన కామెడీని ఆయన రాసుకోలేకపోయాడు. ఇక ఎమోషన్స్ ను పండించడంలో అతను ఆ ఎడ్జ్ దాటిపోతున్నాడు. దాంతో చూసేవారికి అతిగా అనిపిస్తోంది. 

కాస్త పేరున్న ఆర్టిస్టులు తెరపై మెరిశారు. పాత్ర పరిధిలో మెప్పించారు. 'గరుడావేగ' అంజి ఫొటోగ్రఫీ విషయానికి వస్తే, గ్రామీణ నేపథ్యంలోని సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. చరణ్ అర్జున్ అందించిన బాణీలు .. నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి. మధు ఎడిటింగ్ ఓకే. 

ఒక సాధారణమైన పల్లెటూరి యువకుడు తన ఊరును కాపాడుకోవాలనుకుంటాడు. తాను ఎంతగానో అభిమానించే కేసీఆర్ ను తన పెళ్లికి పిలవాలనుకుంటాడు. రాకేశ్ ఎంచుకున్న ఈ లైన్ బాగానే ఉందనిపిస్తుంది. కానీ దానికి ఫీల్ ను యాడ్ చేయలేకపోయాడు. తన బలమైన కామెడీని సరిగ్గా రాసుకుని ఉంటే, ఎమోషన్స్ ను కనెక్ట్ చేయగలిగి ఉంటే మరో మెట్టుపైన ఈ కంటెంట్ కనిపించేదేమో. 

Movie Name: KCR

Release Date: 2024-12-28
Cast: Rakesh, Aananya Krishnan, Thanikella Bharani, Thagubothu Ramesh, Sujatha
Director: Garudavega Anji
Music: Charan Arjun
Banner: Green Tree Productions

KCR Rating: 2.00 out of 5

Trailer

More Reviews