మలయాళ ప్రేక్షకులను ఒక సైకలాజికల్ థ్రిల్లర్ పలకరించింది. కుంచకో బోబన్ .. ఫహద్ ఫాజిల్ .. జ్యోతిర్మయి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అమల్ నీరద్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా, నిన్నటి నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోను 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథలేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: రాయ్స్ (కుంచకో బోబన్) ఒక డాక్టర్. అతని భార్య రీతూ (జ్యోతిర్మయి). వారికి ఇద్దరు సంతానం. ఒకసారి జరిగిన కారు ప్రమాదంలో రీతూ జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి నిలకడగా ఉండదు. అందువలన ఎప్పటికప్పుడు ఆమెను మానసిక వైద్య నిపుణులకు చూపిస్తూ ఉంటాడు. ఆమె తనకి ఇష్టమైన పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆమె కాగితపు పూలను చిత్రీకరిస్తూ ఉండటం ఇతరులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
రీతూ తన ఇద్దరు పిల్లలను గురించి తరచూ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఏదో తెలియని భయం ఆమెకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. అందువలన ఆమె రాత్రివేళలో నిద్రపోయే సమయం కూడా తక్కువే. రాయ్స్ ఇంట్లో లేని సమయంలో ఆమె బాగోగులను పనిమనిషి 'రమ' చూసుకుంటూ ఉంటుంది. ఊరికి దూరంగా .. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విశాలమైన ఆ ఇంటికి ఒక రోజున ఏసీపీ డేవిడ్ (ఫహద్ ఫాజిల్) వస్తాడు. అతణ్ణి చూడగానే 'రమ' కంగారుపడిపోతుంది.
కేరళలో ఛాయా కార్తికేయన్ అనే యువతి కనిపించకుండా పోతుంది. ఆ యువతి గొప్పింటికి చెందినది. కనిపించకుండా పోవడానికి ముందు ఆమెను కలుసుకున్నది రీతూ మాత్రమే. అందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ డేవిడ్ దగ్గర ఉంటుంది. ఛాయా కార్తికేయన్ గురించి రీతూను డేవిడ్ అడుగుతాడు. తనకేమీ గుర్తులేదని ఆమె చెబుతుంది. ఆమె ఆరోగ్య సమస్యను డేవిడ్ అర్థం చేసుకుంటాడు. అయితే మరికొంతమంది యువతులు కూడా అలాగే మిస్సయ్యారనే విషయం తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? యువతుల మిస్సింగ్ కి కారకులు ఎవరు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను మలయాళ దర్శకులు హ్యాండిల్ చేసే తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వాళ్లు ఎంచుకునే లొకేషన్స్ కథకు మరింత బలంగా నిలుస్తుంటాయి. అందువలన ఈ తరహా సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలా వచ్చినదే ఈ కాగితపు పూల నేపథ్యంలో సాగే కథ. మూడు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
కేరళ ప్రాంతంలో యువతులు మిస్సవుతారు. ఈ కేసు విషయంలో అనుమానితురాలు రీతూ అంటూ ఆమె ఇంటికి పోలీసులు రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేని పేషంట్. యువతులు అదృశ్యం కావడం వెనుక ఆమె హస్తం ఎలా ఉంటుంది? అనే ఒక కుతూహలంతో ప్రేక్షకులు కథను ఫాలో కావడం మొదలుపెడతారు. తన దగ్గరున్న ఆధారాలకు .. రీతూ పరిస్థితికి పొంతన కుదరకపోవడంతో, పోలీస్ ఆఫీసర్ అయోమయంలో పడటం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.
ఈ కథ చాలా నిదానంగా మొదలవుతుంది. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక భార్యను భర్త అపురూపంగా చూసుకునే సన్నివేశాలతోనే కథ చాలావరకూ గడిచిపోతుంది. చివరి 40 నిమిషాలలో అసలు కథ తొంగిచూస్తుంది. ఇక అప్పటి నుంచి తెరపై వాతావరణం మారుతూపోతుంది. ఒక్కో అంశాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన విధానం .. క్లైమాక్స్ .. ఆడియన్స్ కి సంతృప్తికరంగానే అనిపిస్తాయి. అయితే చివరి 40 నిమిషాల వరకూ ఓపిక పట్టడమే తెలుగు ఆడియన్స్ ముందు నిలిచిన సవాలుగా అనిపిస్తుంది.
పనితీరు: కంటెంట్ వరకూ చేసిన ఖర్చు మాత్రమే చూసుకుంటే, ఇది చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా. అయితే ప్రధానమైన పాత్రలను పోషించిన ముగ్గురూ స్టార్స్ కావడం .. ఈ సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు ఎంచుకున్న లైన్ కొత్తది కాకపోయినా, తనదైన స్టైల్లో ఆయన ఆవిష్కరించిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే నిదానంగా సాగే కథనం తెలుగు ప్రేక్షకులకు కాస్త బోరింగ్ గా అనిపించవచ్చు.
కుంచకో బోబన్ .. ఫహద్ ఫాజిల్ .. జ్యోతిర్మయి .. ముగ్గురూ సీనియర్ ఆర్టిస్టులు. వాళ్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అనెంద్ చంద్రన్ ఫొటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్స్ ను ఆయన ఈ కథకు జోడించాడు. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం ఈ కథకు ప్రధానమైన బలంగా నిలిచింది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ వర్క్ కూడా ఆకట్టుకుంటుంది.
నిదానంగా .. నీట్ గా సాగే కంటెంట్ ఇది. చివరి 40 నిమిషాల వరకూ ఎక్కడా ఎలాంటి అనూహ్యమైన మలుపులు ఉండవు. అలాగే కథలో తెలుగు ప్రేక్షకులు కోరుకునే హడావిడి కనిపించదు. అందువలన మలయాళ సినిమాలను ఇష్టపడేవారికి ఇది నచ్చే అవకాశం ఎక్కువని చెప్పాలి.
'బౌగెన్ విలియా' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
| Reviews
Bouganvillea Review
- మలయాళంలో రూపొందిన 'బౌగెన్ విలియా'
- సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా
- మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ
- చివరి 40 నిమిషాల వరకూ నిదానంగా సాగే కథనం
- ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చే ట్రీట్మెంట్
Movie Name: Bouganvillea
Release Date: 2024-12-13
Cast: Kunchako Boban, Fahadh Fasil, Jyothirmayi, Veena Nandakumar, Srinda
Director: Amal Neerad
Music: Sushin Shyam
Banner: Amal Neerad Productions
Review By: Peddinti
Bouganvillea Rating: 2.50 out of 5
Trailer