'హరికథ' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

Harikatha

Harikatha Review

  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే 'హరికథ'
  • కొత్తదనం కోసం ట్రై చేసిన టీమ్ 
  • కొంతవరకే దక్కిన సక్సెస్ 
  • రాజేంద్రప్రసాద్ నటన హైలైట్ 
  • ప్రత్యేక ఆకర్షణగా లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్

రాజేంద్రప్రసాద్ .. శ్రీరామ్ ప్రధానమైన పాత్రలను పోషించిన వెబ్ సిరీస్ పేరే 'హరికథ'. 'సంభవామి యుగే యుగే' అనేది ట్యాగ్ లైన్. కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ తో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చిన ఈ సిరీస్, హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ . బెంగాలీ .. మరాఠీ భాషల్లో   6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను వదిలారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.  

కథ: ఈ కథ 1982లో మొదలవుతుంది .. 'అరకు' పరిసర ప్రాంతాల్లో నడుస్తుంది. అక్కడ రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) బృందం నాటకాలు ఆడుతూ ఉంటారు. ఆయన దశావతార ఘట్టాలకు సంబంధించి ఒక్కోరోజు ఒక్కో నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన ఏ అవతారం గురించి అయితే నాటకాన్ని ప్రదర్శించాడో, ఆ అవతారం చేతిలో ఆ ఊరికి చెందిన ఒక్కో వ్యక్తి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఆ ఊరికి చెందిన వ్యక్తులు అలా దారుణంగా చంపబడుతూ ఉండటం అందరిలో భయాన్ని కలిగిస్తుంది.

నృసింహ అవతారంలో హత్య జరుగుతూ ఉండటం ఒక వ్యక్తి చూడటం వలన, భగవంతుడే దుష్టులను శిక్షిస్తున్నాడనే విషయం జనంలోకి వెళుతుంది. ఎవరికి వారు భయం గుప్పెట్లో బ్రతుకుతుంటారు. అక్కడ భరత్ (అర్జున్ అంబటి) పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. అతనికి స్వాతితో పెళ్లి కుదురుతుంది. ఆ సమయంలోనే విశాఖ నుంచి అతని స్నేహితుడు (శ్రీరామ్) అక్కడికి వస్తాడు. తన భార్యను కోల్పోయిన అతను, కూతురు స్వీటీని వెంటబెట్టుకుని భరత్ ను వెతుక్కుంటూ వస్తాడు.   

 ఒక రోజున భరత్ హత్యకు గురికావడంతో అతని స్నేహితుడు షాక్ అవుతాడు. ఆ హత్యతో పాటు అంతకుముందు జరిగిన హత్యలను గురించి ఆరాతీస్తాడు. రంగాచారి వేస్తున్న నాటకాలకు .. జరుగుతున్న హత్యలకు మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం అతనికి కలుగుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? రంగాచారి నేపథ్యం ఏమిటి? హత్యకి గురవుతున్న వాళ్లంతా అంతకుముందు ఏం చేశారు? అనే మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. 

విశ్లేషణ: దుష్ట శిక్షణ చేయడం కోసం శ్రీమహావిష్ణువు పది అవతారాలను ధరించాడు. కానీ మళ్లీ మళ్లీ ఆయన ఆ అవతారాలను ధరించకపోతే, దుర్మార్గులను కట్టడి చేయడం కష్టమవుతుంది. ఆపద ఎదురైనప్పుడు .. అత్యవసరమైనప్పుడు ఆ దేవుడు రాకపోతే ఏం చేయాలి? అనే ఒక పాయింటును టచ్ చేస్తూ రూపొందిన సిరీస్ ఇది. నాలుగు ప్రధానమైన పాత్రలను కలుపుకుంటూ ఈ కథ పరిగెడుతుంది.

ప్రధానమైన పాత్రలను పరిశీలిస్తే, దర్శకుడు ఒక్క రాజేంద్రప్రసాద్ పాత్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. శ్రీరామ్ - అర్జున్ అంబటి పాత్రలను ఆశించిన స్థాయిలో డిజైన్ చేయలేకపోయారు. ఇక 'దాసు' పాత్రను డిజైన్ చేయడంలో దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకుని ఉండవలసింది. ఎందుకంటే తనకి అన్యాయం జరిగిందనే ఒక ఆక్రోశంతో కాకుండా, ఒక 'సైకో'లా ఆ పాత్ర ప్రవర్తిస్తుంది. ఇక అతని తల్లికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా కాస్త ఓవర్ డోస్ అయినట్టుగా అనిపిస్తుంది. 

'హరికథ' అనే టైటిల్ ను ఈ జోనర్ కి వాడటం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దశావతారాల నేపథ్యంలో దుష్ట శిక్షణ జరిగేలా సెట్ చేసుకున్న విధానం బాగుంది. కానీ దానిని ఆశించిన స్థాయిలో తెరపైకి తీసుకుని రాలేకపోయారు. అటు చేసి .. ఇటు చేసి .. చివరికి రివేంజ్ డ్రామానే అప్పగించారు. హింస - రక్తపాతం ఎక్కువైపోయాయి. తలలు తెగిపడటం .. మొండాలు కుప్పకూలడం .. రక్తం జివ్వున ఎగజిమ్మడం వంటి సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పెడతాయి. 


పనితీరు: ఈ కథకి కేంద్ర బిందువు రాజేంద్ర ప్రసాద్ పాత్ర. ఈ పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. ఎమోషన్స్ తో కూడిన పాత్రల్లో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఇక శ్రీరామ్ .. అర్జున్ అంబటి .. దివి వంటివారి నటన ఓకే. కానీ ఆ పాత్రలను పూర్తిస్థాయిలో .. సంతృప్తికరంగా మలచలేకపోయారు. అలాగే నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు కూడా మెప్పించలేకపోయాయి. 

విజయ్ ఉలగనాథ్ ఫొటోగ్రఫీ బాగుంది. ఫారెస్టు నేపథ్యంలోని దృశ్యాలను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. సురేశ్ బొబ్బులి నేపథ్య సంగీతం కూడా ఫరవాలేదు. జునైద్ సిద్ధికీ ఎడిటింగ్ కూడా ఓకే.

'హరికథ' .. ఒక ఫీల్ తో కూడిన టైటిల్. ఈ టైటిల్ క్రింద వరుస హత్యలు అనగానే అందరిలో ఆసక్తి కలగడం సహజం. కానీ ఆ స్థాయిలో ఈ కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయారు.  హింస - రక్తపాతం సంగతి అలా ఉంచితే, హత్యలు ఎందుకు జరుగుతున్నాయనేది కుతూహలాన్ని పెంచుతూ వెళుతుంది. తీరా అందుకు కారణాన్ని చూపించిన తరువాత రొటీన్ కాన్సెప్టే కదా అనిపిస్తుంది. ఒక కొత్త పాయింటుకి పాత డ్రామాని జోడించకుండా, కొత్తదనం దిశగా ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేదేమో. 

Movie Name: Harikatha

Release Date: 2024-12-13
Cast: Rajendra Prasad, Sri Ram, Arjun Ambati, Divi
Director: Maggi
Music: Suresh Bobbili
Banner: People Media Factory

Harikatha Rating: 2.50 out of 5

Trailer

More Reviews