'కొళిపన్నై చెల్లదురై' తమిళంలో రూపొందిన ఒక చిన్న సినిమా. ఏగన్ .. బ్రిగిడ .. యోగిబాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకులను పలకరించింది. 'అమెజాన్ ప్రైమ్'లో సైలెంట్ గా వచ్చేసిన ఈ సినిమా, తెలుగులోను అందుబాటులో ఉంది. శ్రీను రామస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: చెల్లదురై (ఏగన్) అతని చెల్లెలు సుధ (సత్య) చిన్నతనంలోనే తల్లిదండ్రుల నిరాదరణకు గురవుతారు. తన సుఖం తాను చూసుకున్న తల్లికీ .. తన స్వార్థం తాను చూసుకున్న తండ్రికి దూరమవుతారు. ఆశ్రయమిచ్చిన అమ్మమ్మ కూడా చనిపోవడంతో ఆ ఇద్దరూ అనాథలుగా మిగులుతారు. ఆ సమయంలో వారికి 'పెరియస్వామి' అండగా నిలబడతాడు. ఆయన సహాయ సహకారాలతోనే వాళ్లు నిలదొక్కుకుంటారు.
కాలక్రమంలో 12 ఏళ్లు గడిచిపోతాయి. చెల్లదురై తాను కష్టపడి సంపాదిస్తూ, తన చెల్లెలిని కాలేజ్ లో చదివిస్తూ ఉంటాడు. అతణ్ణి సెల్వి ( బ్రిగిడ) ప్రేమిస్తూ ఉంటుంది. అయితే అతను తన బాధ్యతల కారణంగా అదేమీ పట్టించుకోడు. అతని చెల్లెలిని మోహన్ అనే యువకుడు ప్రేమిస్తూ ఉంటాడు. తన అన్నయ్యతో మాట్లాడమని ఆమె చెబుతుంది. మొదట్లో చెల్లదురై ఆవేశపడినా, ఆ తరువాత వారి ప్రేమను అర్థం చేసుకుంటాడు.
మోహన్ - సుధ పెళ్లిని ఘనంగా చేయాలని భావిస్తాడు. అందుకోసం తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేస్తాడు. పెళ్లి పనులు జరుగుతూ ఉండగా, రెండు అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఒక దేవాలయం మెట్ల దగ్గర భిక్షాటన చేస్తున్న తల్లిని గుర్తుపట్టి అతను కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అక్కడివాళ్లు చెప్పడంతో మరింత ఆవేదన చెందుతాడు.
అలాంటి పరిస్థితుల్లోనే రెండో భార్య .. ఆమెకి కలిగిన సంతానంతో చెల్లదురై తండ్రి ఆ ఊరు చేరుకుంటాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తనని కిడ్నీ ఇవ్వమని అడగడం కోసం వచ్చాడని తెలుసుకుంటాడు. తన తండ్రిని బ్రతికించమని అతని సవతి తల్లి కూతురు ఏడుస్తూ ఉంటుంది. అతను కిడ్నీ ఇవ్వకపోతే, తన తండ్రి బ్రతకడని ఏడుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది కథ.
విశ్లేషణ: ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే ఒక చిన్నకథ. చాలా తక్కువ పాత్రలతో దర్శకుడు ఈ కథను రెడీ చేసుకున్నాడు. అయితే పాత్రల సంఖ్య తక్కువే అయినా, ప్రతి పాత్ర బలంగా కనిపిస్తుంది. కథ పరిధి తక్కువే అయినా, బలమైన సన్నివేశాలతో అది కదులుతూ ఉంటుంది. ఒక వైపున చెల్లి పెళ్లి .. మరో వైపున అనారోగ్యాలతో తిరిగొచ్చిన తల్లిదండ్రులు. దేనికి పాధాన్యతను ఇవ్వాలని నలిగిపోయే కథానాయకుడి పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.
తల్లిదండ్రులు తమ స్వార్థం తాము చూసుకుంటే వాళ్ల పిల్లల పరిస్థితి ఏమిటి? ఎన్నో కష్టాలుపడుతూ ఎదిగిన ఆ పిల్లల ముందు ఆ తల్లిదండ్రులు దోషులుగా నిలబడవలసి వస్తే ఎలా ఉంటుంది? అనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. చివరికి హీరో తీసుకున్న నిర్ణయం కూడా ఆడియన్స్ కి ఆమోదయోగ్యంగానే అనిపిస్తుంది.
అశోక్ రాజ్ కెమెరా పనితనం .. రఘునందన్ నేపథ్య సంగీతం .. శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ కథను కాపాడుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. సాధారణమైన జీవితాలలో నుంచి ఏరుకోబడిన ప్రతి పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా వెళుతూ ఆకట్టుకుంటుంది. ఈ కథలో దర్శకుడు గ్రామీణ వాతావరణాన్ని భాగం చేసిన తీరు మెప్పిస్తుంది.
ఈ కథను మనం థియేటర్లో కూర్చుని చూస్తున్నట్టుగా కాకుండా, పల్లెటూళ్లో టీ కొట్టు బెంచ్ పై కూర్చుని, చుట్టుపక్కల జరుగుతున్నది చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.వినోదపరమైన అంశాలు తక్కువే అయినా, సున్నితమైన ఎమోషన్స్ మనసులను పట్టుకుంటాయి. తల్లిదండ్రులు మోయవలసిన బరువు బాధ్యతలను, వారి విషయంలో పిల్లలు మోయవలసి వస్తే ఎలా ఉంటుందనే ఈ కథ ఆలోచింపజేస్తుంది. కథ చివరిలో ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యంగాను అనిపిస్తుంది.
'కొళిపన్నై చెల్లదురై' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
| Reviews
Kozhipannai Chelladurai Review
- తమిళంలో రూపొందిన 'కొళిపన్నై చెల్లదురై'
- సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు
- ఎమోషన్స్ తో ఆకట్టుకునే కథాకథనాలు
- తక్కువ పాత్రలు .. బలమైన సన్నివేశాలు
- అలరించే గ్రామీణ వాతావరణం
Movie Name: Kozhipannai Chelladurai
Release Date: 2024-11-02
Cast: Aegan, Yogi Babu, Brigida Saga, Aishwarya Dutta
Director: Seenu Ramasamy
Music: Raghunanthan
Banner: Vision Cinema House
Review By: Peddinti
Kozhipannai Chelladurai Rating: 2.75 out of 5
Trailer