'రూలర్' మూవీ రివ్యూ

Ruler

Movie Name: Ruler

Release Date: 2019-12-20
Cast: Balakrishna, Vedika, Sonal Chauhan, Jayasudha, Bhumika Chawla,Prakash Raj, Sayaji Shinde, Parag Tyagi, Nagineedu,   
Director:K.S. RaviKumar 
Producer: C. Kalyan 
Music: Chirantan Bhatt 
Banner:  C.K. Entertainments, Happy Movies 
Rating: 2.00 out of 5
ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో స్థిరపడిన తెలుగు రైతులు .. అక్కడ వారికి ఎదురైన కష్టాలు .. ప్రాణాలను పణంగా పెట్టి వాళ్లను ఆదుకున్న కథానాయకుడి కథ ఇది. బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను ధరించిన ఈ సినిమా, నిర్మాణం పరంగా భారీగా కనిపిస్తుందిగానీ, కథాకథనాలపరంగా బలహీనంగా అనిపిస్తుంది. అతకని సన్నివేశాలతో అసంతృప్తిని కలిగిస్తుంది.

గతంలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలను చేశాడు. అలాగే పోలీస్ ఆఫీసర్ గాను కనిపించాడు. ఈ సారి ఆ డిఫరెంట్ షేడ్స్ లో పోలీస్ ఆఫీసర్ పాత్ర వుండేలా చూసుకుంటూ ఆయన చేసిన సినిమానే 'రూలర్'. బాలకృష్ణకి గల మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే .. సరోజినీ ప్రసాద్ (జయసుధ) ఓ పారిశ్రామిక వేత్త. ఆమె భర్త .. కొడుకు ఇద్దరూ కూడా ఒక ప్రమాదంలో మరణిస్తారు. అలాంటి ఆమెను ప్రాణాపాయం నుంచి ఒక వ్యక్తి కాపాడతాడు. అప్పటికే గాయపడిన ఆ వ్యక్తి తన గతాన్ని మరిచిపోతాడు. దాంతో సరోజినీ ప్రసాద్ అతణ్ణి బ్రతికించి .. తన కొడుకు అర్జున్ ప్రసాద్ పేరుతోనే సమాజానికి పరిచయం చేస్తుంది. అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ)కి తన బిజినెస్ బాధ్యతలను అప్పగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన హారిక(సోనాల్ చౌహన్)తో ప్రేమలో పడతాడు.

తన బిజినెస్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని 'ఝాన్సీ'కి వెళ్లాలనుకున్న అర్జున్ ప్రసాద్ ను సరోజినీ ప్రసాద్ అడ్డుకుంటుంది. అందుకు కారణం తెలుసుకున్న అర్జున్ ప్రసాద్, తన ప్రత్యర్థి భవానీనాథ్ ఠాకూర్ అని తెలిసి మరింత పట్టుదలతో అక్కడికి వెళతాడు. అక్కడి జనం తనని 'ధర్మా' అని పిలుస్తూ తనని దైవంగా భావించడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ధర్మా ఎవరు?  అక్కడి జనం గుండెల్లో ఆయన దైవమై ఎందుకు నిలిచాడు? అనేదే మిగతా కథ.

దర్శకుడు కేఎస్ రవికుమార్ బాలకృష్ణకి గల మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్నాడుగానీ, మాస్ ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో మెప్పించే ప్రయత్నం చేయలేకపోయాడు. టైటిల్ కి తగిన స్థాయిలో బాలకృష్ణ పాత్రను మలచలేకపోయాడు. బిజినెస్ మేన్ గా బాలకృష్ణను హ్యాండ్సమ్ గా చూపించిన ఆయన, బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ లుక్ విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోయాడు. బాలకృష్ణకి ఆ 'విగ్' ఎంతమాత్రం సెట్ కాలేదు. ఇక ఆయన సరసన కథానాయికలుగా ఫస్టాఫ్ లో సోనాల్ చౌహాన్ .. సెకండాఫ్ లో వేదిక అసలే సెట్ కాలేదు.

ఉత్తరప్రదేశ్ నేపథ్యాన్ని ఎందుకు తీసుకోవలసి వచ్చిందో అర్థం కాదు. ఒక వైపున ఠాకూర్ ల మధ్య ఆధిపత్య పోరాటం .. మరో వైపున అక్కడి తెలుగు రైతుల అణచివేత ప్రేక్షకులను కొంత గందరగోళంలోకి నెడతాయి. 'కోమా'లో నుంచి బయటికి వస్తూనే జయసుధను బాలకృష్ణ రక్షించడం .. తన ప్రాణాలు కాపాడిన బాలకృష్ణకి జయసుధ ఆస్తిపాస్తులను అప్పగించడం .. తన వెనకే గోతులు తవ్వుతున్నాడని తెలిసి కూడా షాయాజి షిండేను జయసుధ క్షమించేస్తూ ఉండటం .. పెద్ద బిజినెస్ మేన్ కుటుంబంలో పుట్టిపెరిగిన సోనాల్ చౌహాన్, ఓ తొట్టిగ్యాంగ్ ను చూపించి హ్యాకర్లు అనగానే నమ్మేయడం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది.

బిజినెస్ మేన్ గాను .. పోలీస్ ఆఫీసర్ గాను బాలకృష్ణ తన మార్క్ నటనను చూపించాడు. డాన్స్ విషయంలోను తన సత్తా ఎంతమాత్రం తగ్గలేదని చెప్పడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక ఫైట్స్ విషయంలోను ఆయన తనదైన స్టైల్ చూపించాడు. కథానాయికల విషయానికొస్తే, సోనాల్ - వేదిక ఇద్దరూ కూడా బాలకృష్ణ స్థాయి నాయికలు కాదని అర్థమవుతుంది. గ్లామర్ పరంగాగానీ .. నటన పరంగా గాని ఇద్దరూ ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయారు. ప్రతినాయకుడిగా .. ప్రధాన అనుచరుడిగా కనిపించినవారి నటన కూడా ఫరవాలేదు. ప్రకాశ్ రాజ్ .. భూమిక .. జయసుధ పాత్రల్లోను పెద్దగా విషయం లేకపోవడంతో వాళ్లు ఏమీ చేయలేకపోయారు. ఇక శ్రీనివాస రెడ్డి .. రఘుబాబు .. ధనరాజ్ .. సప్తగిరి వంటి ఆర్టిస్టులు నవ్వించడానికి చేసిన ప్రయత్నం విసుగు మాత్రమే తెప్పిస్తుంది.

చిరంతన్ భట్ సంగీతం ఫరవాలేదు .. 'యాల .. యాల' పాటకి ఎక్కువ మార్కులు పడతాయి. రీ రికార్డింగ్ కూడా ఓకే. ఇక రామ్ ప్రసాద్ ఫొటోగ్రఫీ బాగుంది. బ్యాంకాక్ లోని లొకేషన్స్ ను .. పాటలను చాలా అందంగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా 'యాల .. యాల' పాట చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్ పరంగా .. కొరియోగ్రఫీ పరంగా కూడా ఈ పాట బాగుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే విషయంలేని కామెడీ సీన్స్ ను .. మోతాదు మించిన యాక్షన్ సీన్స్ ను కొంతవరకూ ట్రిమ్ చేస్తే బాగుండేది. బాలకృష్ణ సినిమాలకి ఆయువుపట్టైన సంభాషణల్లోను పెద్దగా పదును కనిపించలేదు. అందువలన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిందని చెప్పొచ్చు.                            
 

More Reviews