'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ సీజన్ 1, క్రితం ఏడాది జూన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 5 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ యూత్ ను ఆకట్టుకుంది. కంటెంట్ కి తగిన కామెడీ డ్రామాతో ఆకట్టుకుంది. అలాంటి ఈ సిరీస్ కి సీజన్ 2ను రూపొందించారు. అక్టోబర్ 31 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 5 ఎపిసోడ్స్ గా వదిలిన సీజన్ 2లో, ఈ సారి కథానాయకుడు .. దర్శకుడు మారిపోయారు. ఈ సీజన్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అరుణ్ కుమార్ (పవన్ సిద్ధూ) గతంలో తాను ఇంటర్న్ చేసిన ఆఫీసులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదాలో అడుగుపెడతాడు. తన దగ్గర అసిస్టెంట్ గా చేసిన అతను ఆ స్థాయికి చేరుకోవడం షాలిని (తేజస్వి)కి గుర్రుగా ఉంటుంది. అతను ఆ సీట్లో కూర్చోవడానికి అర్హత లేని వాడని నిరూపించడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెడుతుంది. అతను ఆమె బారి నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు.
ఓ రోజున ఆఫీసులోకి ఓ అందమైన అమ్మాయి అడుగుపెడుతుంది. ఆమె పేరు సోనియా (సిరి రాశి) అనీ, తమ సంస్థకి అత్యంత ముఖ్యుడైన 'రాబర్ట్'కి కూతురని అరుణ్ కుమార్ తో కార్తీక్ చెబుతాడు. రాబర్ట్ తన సంస్థని కూతురికి అప్పగించడానికి ముందు ట్రైనింగ్ కోసం ఆమెను అక్కడికి పంపంచినట్టు చెబుతాడు. ఆమెకి పని నేర్పించమని అంటాడు. అయితే విదేశాల్లో చదువుకుని వచ్చిన సోనియాకి తెలుగు సరిగ్గా రాకపోవడంతో అరుణ్ కుమార్ నానా పాట్లు పడుతూ ఉంటాడు.
ఈ సమయంలోనే తన ఆఫీసులో ప్రత్యక్షమైన పల్లవి (అనన్య శర్మ)ను చూసి అరుణ్ కుమార్ షాక్ అవుతాడు. షాలినీ విషయంలో తన వలన జరిగిన తప్పుకి పల్లవికి 'సారీ' చెప్పడానికి ఒక మంచి అవకాశం దొరికిందని అతను భావిస్తాడు. అయితే తనతో మాట్లాడటానికి కూడా ఆమె ఇష్టపడకపోవడంతో, అరుణ్ కుమార్ నీరుగారిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ప్రాజెక్టుకి సంబంధించిన బాధ్యతను అటు షాలినీ టీమ్ కీ, ఇటు అరుణ్ కుమార్ టీమ్ కి బాస్ అప్పగిస్తాడు.
అరుణ్ కుమార్ అన్ ఫిట్ అని నిరూపించడానికి తగిన అవకాశం లభించిందని షాలిని సంతోషపడుతుంది. తన అసిస్టెంట్ అరవింద్ తో కలిసి అందుకు సంబంధించిన వ్యూహాలను రూపొందించడం మొదలుపెడుతుంది. ఒక వైపున వర్క్ టెన్షన్ .. ఒక వైపున షాలినీ వ్యూహాలు .. మరో వైపున పల్లవి అలక .. ఇంకో వైపున సోనియా టార్చర్ అరుణ్ కుమార్ ను ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెడతాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు? దాని పర్యవసానం ఎలా ఉంటుంది? అనేది కథ.
విశ్లేషణ: దర్శకుడు ఆదిత్య కేవీ, ఈ సిరీస్ కి సంబంధించిన కథ - స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.ఫస్టు సీజన్ కి కొనసాగింపుగానే సీజన్ 2 నడుస్తుంది. ఫస్టు సీజన్ కి మాదిరిగానే ఈ సీజన్ కూడా సాఫ్ట్ వేర్ సంస్థలో కొనసాగుతుంది. ఫస్టు సీజన్ లో ఇంటర్న్ గా కథానాయకుడు పడే కష్టాలు చూపిస్తే, ఈ సీజన్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా కథానాయకుడు పడే అవస్థలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ కష్టాలకు కామెడీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ సిరీస్ లో కథానాయకుడు తనకి కావలసిన వర్క్ ను టీమ్ తో చేయించుకోవడానికి పడిన అవస్థలను హైలైట్ చేస్తూ వెళ్లారు. షాలిని .. పల్లవి .. సోనియా .. టీమ్ వైపు నుంచి అతనిపై ఒత్తిడిని తీసుకొస్తూ, కామెడీని రాబట్టడానికి ప్రయత్నించారు. అయితే కంటెంట్ కి తగిన కామెడీ ఫస్టు సీజన్లో వర్కౌట్ అయినట్టుగా, సీజన్ 2లో వర్కౌట్ కాలేదు. అందుకు తగిన సన్నివేశాలను డిజైన్ చేయలేదని అనిపిస్తుంది.
ఫస్టు సీజన్ లో అరుణ్ కుమార్ ఆంధ్రలోని ఒక చిన్న టౌన్ నుంచి కొత్తగా హైదరాబాద్ వస్తాడు. హైదరాబాద్ లైఫ్ స్టైల్ .. సాఫ్ట్ వేర్ ఆఫీస్ వాతావరణం అతణ్ణి ఇబ్బందిపెడతాయి. అతని పల్లెటూరి మంచితనాన్ని .. అమాయకత్వాన్ని తమకి అనుకూలంగా వాడుకోవడానికి సీనియర్స్ ట్రై చేస్తారు. అప్పటివరకూ అలవాటు లేని ఆకర్షణలు అతణ్ణి మరో లోకానికి తీసుకుని వెళతాయి. ఇలాంటి ఒక పాత్రతో ఫస్టు సీజన్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
కానీ సీజన్ 2కి వచ్చేసరికి అరుణ్ కుమార్ కి హైదరాబాద్ అలవాటైపోతుంది .. సాఫ్ట్ వేర్ లైఫ్ స్టైల్ అర్థమౌతుంది. ఆఫీసు వాతావరణం పట్ల అవగాహన పెరుగుతుంది. అయినా అతను భయపడటం .. మంచితనంతో .. అమాయకత్వంతో ఇబ్బందులు పడుతూ ఉండటం సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. షాలినీ ట్రాక్ . పల్లవి ట్రాక్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించవు. ఇక సోనియా పాత్ర కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. తెలుగు నేర్చుకోవడానికి ఆమె పడే తిప్పలు కూడా ఫలించలేదు.
సీజన్ 2లో కథ పెద్దగా కదల్లేదు. నత్త నడక నడుస్తూ .. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. సీజన్ 1కి ఏయే అంశాలు బలంగా మారాయనేది చూసుకుంటే .. సీజన్ 2లో అవి మిస్సవ్వకుండా చూసుకుంటే బాగుండేది.
పనితీరు: ఆర్టిస్టులంతా బాగానే చేశారు. కానీ కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుంది. దర్శకుడు ఆదిత్య ఏ కథపై మరింత కసరత్తు చేయవలసింది. స్క్రీన్ ప్లే కూడా సాదాసీదాగా అనిపిస్తుంది. రెహాన్ షేక్ ఫోటోగ్రఫి బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం ఫరవాలేదు. అనిల్ కుమార్ ఎడిటింగ్ ఓకే. బాలగణేశ్ డైలాగ్స్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సీజన్ 1 మాదిరిగా, సీజన్ 2 మేజిక్ చేయలేకపోయింది.
'అర్థమయ్యిందా అరుణ్ కుమార్ -2' (ఆహా) వెబ్ సిరీస్ రివ్యూ!
| Reviews
Arthamayyinda Arun Kumar Review
- అక్టోబర్ 31 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- 5 ఎపిసోడ్స్ తో వచ్చిన సీజన్ 2
- సాదాసీదాగా నడిచే కథాకథనాలు
- అంతగా నవ్వించలేకపోయిన సన్నివేశాలు
- సీజన్ 1 స్థాయిలో మెప్పించలేకపోయిన కంటెంట్
Movie Name: Arthamayyinda Arun Kumar
Release Date: 2024-10-31
Cast: Pavan Siddhu, Tejasvi, Ananya Sharma,
Director: Adithya KV
Music: Ajay Arasada
Banner: Laughing Cow Produtions
Review By: Peddinti
Arthamayyinda Arun Kumar Rating: 2.50 out of 5
Trailer