ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినీ రంగంలోకి ప్రవేశించి కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. గత కొంతకాలంగా ఆయన సినిమాలు కమర్షియల్‌గా నిరాశపరచడంతో తాజాగా ఆయన 'క' అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కొత్తరకమైన కథాంశంతో సినిమాను తెరకెక్కించామని పలు ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం చెప్పాడు. ఈ 'దీపావళి'కి బాక్సాఫీస్ బరిలో నిలిచిన 'క' ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. కిరణ్ చెప్పినట్లుగా 'క' లో కొత్తదనం వుందా? అది ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? అనేది తెలుసుకుందాం.
కథ: అమ్మానాన్న లేకపోవడంతో అనాథాశ్రమంలో పెరుగుతుంటాడు అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం). ఏ రోజుకైనా తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఆశపడుతుంటాడు. అనాథాశ్రమానికి పోస్ట్‌మ్యాన్ తెచ్చే ఉత్తరాలను తన వాళ్లే తనకు రాసినట్లుగా ఊహించుకుంటూ.. తనకు లేని అమ్మానాన్నలను, ఇతర బంధాలను, బంధాల్ని వెతుక్కుంటూ వుంటాడు. అయితే ఓసారి తన ఉత్తరం తనకు తెలియకుండా చదివాడని మాస్టారు గురునాథం (జయరాం) వాసును కొట్టడంతో.. కోపంతో మాస్టారు డబ్బులను దొంగతనం చేసి పారిపోతాడు.
ఆ తరువాత కొన్నేళ్లకు ఓ స్నేహితుడి రికమండేషన్‌తో 'కృష్ణగిరి' అనే గ్రామంలో టెంపరరీ అసిస్టెంట్ పోస్ట్‌మ్యాన్‌గా చేరతాడు. ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. అప్పటికే ఆ ఊరిలో అమ్మాయిలు ఒక్కొక్కరు కనిపించకుండా అదృశ్యమవుతుంటారు. అయితే చిన్నప్పటి నుంచి ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసు ఇక్కడ ఊరిలో వాళ్లకు వచ్చిన ఉత్తరాలు చదువుతుండగా అమ్మాయిల మిస్సింగ్ కేసులకు సంబంధించిన 'క్లూ' ఒకటి దొరుకుతుంది. ఆ అన్వేషణలో వుండగానే సత్యభామ కూడా అపహరణకు గురవుతుండగా అభినయ వాసుదేవ్ రక్షిస్తాడు.
ఇక అక్కడి నుంచి వాసుదేవ్ కు జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయి. అసలు ఊరి అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణమేమిటి? దానికి కారకులెవరు? ఆ ఊరిలోనే వున్న లాల్, అబిద్ షేక్‌ల పాత్ర ఇందులో ఏమైనా వుంటుందా? అభినయ వాసుదేవ్‌తో పాటు టీచర్ రాధ (తన్వీరామ్)ను కిడ్నాప్ చేసిన ముసుగు వ్యక్తి వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం రాబడతాడు? అసలు ఆ ముసుగు వ్యక్తి ఎవరు? వీళ్లకు ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? వాసుదేవ్, సత్యభామ ప్రేమ సుఖాంతం అవుతుందా? ఇలా.. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ట్విస్ట్‌లకు సమాధానం.. వాటి ఎక్స్‌పీరియన్స్ తెలియాలంటే 'క' చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ: 'క' లాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మొదటి నుంచి ఈ సినిమాలో ప్రతి అంశంలో కొత్తదనం వుంది.. పతాక సన్నివేశాలు అందరికి షాకింగ్‌గా వుంటాయి. సర్‌ప్రైజ్‌ను ఇస్తుంది.. అంటూ చిత్ర టీమ్‌తో పాటు హీరో కిరణ్ అబ్బవరం చెప్పిన మాటలు నిజమేనని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా ఓపెనింగ్‌లోనే హీరోను కిడ్నాప్ చేసి. .చీకటి గదిలో వేసి.. ఓ ముసుగు వ్యక్తి ఆయన్ని ఇంటరాగేషన్ చేస్తూ.. కథ చెప్పించడం ఆకట్టుకుంటుంది. కృష్ణగిరిలో అభినయ వాసుదేవ్ ఎంట్రీ, అక్కడ సమస్యలు పరిష్కరించడం.. ఆ క్రమంలో అతను ఫేస్ చేసిన సమస్యలు అన్నీ చాలా ఆసక్తికరంగా వుంటాయి.
ముఖ్యంగా కథలో కొత్తదనం వుండటం వల్ల సినిమా అంతా ఫ్రెష్ ఫీల్‌తో కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్‌తో పాటు పతాక సన్నివేశాలు ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. సినిమా అంతా ఒకెత్తులా వుంటే క్లైమాక్స్ సన్నివేశాలు మైండ్‌బ్లోయింగ్.. ఇలాంటి కథ, ఇలాంటి క్లైమాక్స్‌ను ఇప్పటి వరకు చూడలేదనే భావనలో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు. కిడ్నాప్ చేసిన తరువాత ముసుగు దొంగ అభినయ్, రాధలను ఓ చక్రం లాంటి యంత్రం సహాయంతో ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.
వాసు-సత్యభామల ప్రేమకథ, సరదా సన్నివేశాలు, అమ్మాయి కనిపించకపోవడం ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్న చిత్రం ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇక సెకండాఫ్‌లో కథకు ముడిపడిన ఒక్కొక్క చిక్కుముడిని విప్పుతూ హీరో చేసే ప్రయాణం, ఇక చివరి ఇరవై నిమిషాలు, పతాక సన్నివేశాలు మాత్రం చిత్రాన్ని ఉన్నతస్థానంలో నిలిపాయి. పతాక సన్నివేశాల్లో ఉన్న ట్విస్ట్ చూస్తే అందరూ భావోద్వేగంతో పాటు ఓ రకమైన ట్రాన్స్‌లో ఉండిపోతారు.
ఓ దర్శకుడు ఇలా కూడా ఆలోచించి సినిమా తీస్తాడా? అనే విధంగా షాకింగ్‌లో వుంటారు. ముఖ్యంగా మనిషి జననం, మరణం, కర్మఫలం, పునర్జన్మ ఇలాంటి అంశాలకు పతాక సన్నివేశాలకు ఉన్న సంబంధం, వాటికి కథకు ముడిపెట్టిన విధానం చాలా కొత్తగా అనిపించింది. అయితే ఈ సినిమా ముఖ్యాంశం విషయంలో కొంత మంది కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం వుంది.. ఆ విషయాన్ని చివర్లో వాయిస్ ఓవర్‌లోనైనా దర్శకుడు చెప్పించి వుంటే క్లారిటీగా వుండేదేమో అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు: నటన పరంగా గత సినిమాలతో పోలిస్తే కిరణ్ పర్‌ఫార్మెన్స్‌లో మెచ్యూరిటీ కనిపించింది. ఆయన డైలాగ్ డిక్షన్‌పై ఇంకాస్త శ్రద్దపెట్టాలి. ఎమోషన్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో తనదైన మార్క్‌ను చూపించాడు. నయన సారిక 1970ల కాలంలో వుండే అమ్మాయిలా ట్రెడిషనల్ లుక్స్‌తో ఆకట్టుకుంది. మిగతా నటీనటులు తమ క్యారెక్టర్స్‌కు న్యాయం చేశారు. అన్ని పాత్రలు సహజంగానే అనిపించాయి. పాత్రకు తగ్గట్టుగా మంచి నటీనటులను ఎంపిక చేసుకోవడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
సాంకేతిక వర్గం పనితీరు: టెక్నిషియన్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుజిత్-సందీప్‌ల దర్శక ద్వయం గురించి, ఓ కొత్త ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరిచే స్క్రీన్‌ప్లేను జోడించి కథను ఎంతో ఆసక్తికరంగా,ఉత్కంఠభరితంగా చెప్పడంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు. 1970లో కథను నడిపించిన ఫీల్ తీసుకురావడంతో చేసిన కృషి అభినందనీయం. చిత్ర టీమ్ చెప్పినట్లుగానే తమ మేకింగ్‌తో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. సామ్ సీఎస్ సంగీతం, నేపథ్య సంగీతం కథ మూడ్‌ను క్యారీ చేసింది. విజువల్స్ కూడా చాలా ఉన్నతంగా వున్నాయి. సినిమాకు పెట్టిన ఖర్చు తెరపై కనపడింది. యాక్షన్ సీక్వెన్స్ లో బీజీఎమ్ హీరో ఎలివేషన్‌కు బాగా ప్లస్ అయ్యింది.
ప్రేక్షకులు ఆదరించే కొత్త కంటెంట్.. వాళ్లకు కావాల్సిన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఈ చిత్రంలో వుంది. అయితే ఈ దీపావళికి విడుదలైన మిగతా చిత్రాల టాక్ వాటి రిజల్ట్‌పైనే 'క' బాక్సాఫీస్ వసూళ్ల స్థాయి ఆధారపడి ఉంటుంది. 'క' సినిమాకు సోలో డేట్ దొరికితే వసూళ్లకు ఏ మాత్రం సందేహం వుండేది కాదు.
'క' - మూవీ రివ్యూ!
| Reviews
Ka Review
- కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్
- ఉత్కంఠభరితంగా సాగిన కథ, కథనాలు
- చివరి ఇరవై నిమిషాలు చిత్రానికి హైలైట్
- షాకింగ్‌కు గురిచేసే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్
Movie Name: Ka
Release Date: 2024-10-31
Cast: Kiran Abbavaram, Nayan Sarika, Tanvi Ram
Director: Sujith - Sandeep
Music: Sam CS
Banner: GSK Media
Review By: Madhu
Ka Rating: 3.00 out of 5
Trailer