'స్నేక్స్ అండ్ ల్యాడర్స్' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Snakes And Ladders

Movie Name: Snakes And Ladders

Release Date: 2024-10-18
Cast: Naven Chandra, Samrith Surya, Surya Kumar, Tarun Yuvaraj, Rajeshwar Surya, Sasha Bharen
Director:Bharath Muralidharan
Producer: kalyan Subramanian
Music: Prithvi Chandrasekhar
Banner: A Stone Bench Production
Rating: 3.00 out of 5
  • పిల్లల పాత్రలు ప్రధానంగా నడిచే సిరీస్
  • 9 ఎపిసోడ్స్ గా  అందించిన అమెజాన్ ప్రైమ్ 
  • ఈ నెల 18 నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • ఆసక్తికరమైన కథాకథనాలు 
  • ఆకట్టుకునే కంటెంట్

అమెజాన్ ప్రైమ్ వారు ఎప్పటికప్పుడు భారీ వెబ్ సిరీస్ లను అందిస్తూ వస్తున్నారు. అలా ఈ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన మరో వెబ్ సిరీస్ గా 'స్నేక్స్ అండ్ ల్యాడర్స్' కనిపిస్తుంది. కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించిన ఈ సిరీస్ కి, భరత్ మురళీధరన్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో 9 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్, ఈ నెల 18వ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

గిల్బర్ట్ (సమ్రిత్ శౌర్య) శాండీ (సూర్య కుమార్) ఇరైయన్ (రాజేశ్వర్ సూర్య) బాల (తరుణ్ యువరాజ్) ఈ నలుగురూ మంచి స్నేహితులు .. ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు. ఇక ఈ నలుగురితో రాగిత ( సషా భరేన్) చనువుగా ఉంటూ ఉంటుంది. స్కూల్లో వీరి ఏకైక శత్రువు వినయ్ (విష్ణుబాల). తన తండ్రి రాజేంద్రన్ (శ్రీజిత్ రవి) పోలీస్ ఆఫీసర్ అనే ఒక గర్వం అతనికి ఉంటుంది. ఇక ఇరైయన్ తండ్రి కూడా పోలీస్ ఆఫీసరే. అయితే అతను రాజేంద్రన్ క్రింద పనిచేస్తూ ఉంటాడు.
 
రిచర్డ్ (వేట్టై ముత్తుకుమార్) ఒక మాఫియా ముఠాను నడుపుతుంటాడు. అతనికి భాయ్ నుంచి ఆదేశాలు అందుతూ ఉంటాయి. భాయ్ కి 'ఐరా' నుంచి ఆదేశాలు వస్తుంటాయి. 'ఐరా' ఎవరనేది అతని దగ్గర పనిచేసే చాలామందికి తెలియదు. ఓ మ్యూజియంలో ఉన్న ప్రాచీన కాలం నాటి లాకెట్ ఎంత ఖరీదు ఉంటుందనేది 'ఐరా'కి మాత్రమే తెలుసు. దానిని తీసుకొచ్చి తనకి అప్పగించే పనిని ఆయన భాయ్ కి అప్పగిస్తాడు. అతను రిచర్డ్ పై ఆ బాధ్యతను పెడతాడు. 

రిచర్డ్ ఆదేశం మేరకు మ్యూజియంలో ఉన్న లాకెట్ ను 'బ్లేడ్' - 'పారీ' దొంగిలిస్తారు. ఆ దొంగతనం చేసివస్తూ, దారిలోనే ఉన్న రాగిత ఇంట్లోకి చొరబడతారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో రాగిత తల్లి రేవతిని గాయపరిచి బయటపడతారు. అక్కడి నుంచి తప్పించుకున్న 'పారీ' నేరుగా తన స్థావరానికి వెళతాడు. 'బ్లేడ్' మాత్రం రాగిత ఇంట్లో నుంచి 'గిల్' ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ 'కప్ బోర్డు'లో దాక్కుంటూ 'గిల్' కంటపడతాడు. ఆ కప్ బోర్డును 'గిల్' బయట నుంచి లాక్ చేయడంతో అతను లోపలే చనిపోతాడు. 

'గిల్' తన ముగ్గురు స్నేహితులను పిలిచి, జరిగింది చెబుతాడు. 'బ్లేడ్' మ్యూజియంలో దొంగిలించిన 'లాకెట్'ను తమ దగ్గర పెట్టుకుంటారు గానీ, దాని గురించి వాళ్లకేమీ తెలియదు. 'గిల్' పెరట్లో ఆ శవాన్ని పూడ్చి పెడతారు. రాగిత ఇంట్లో దొంగతనానికి వెళ్లింది అతనేనని ఆ తరువాత వారికి  తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తితో పాటు మరో వ్యక్తి తమ ఇంటికి వచ్చాడని, అతనిని చూస్తే తాను గుర్తుపడతానని స్నేహితులతో రాగిత అంటుంది.         

 'ఐరా' ఆశించిన లాకెట్ ను అతనికి అందజేసి, అతని ముఠాలో చోటు సంపాదించాలనే ఉద్దేశంతో లియో (నవీన్ చంద్ర) ఉంటాడు. సైబర్ సెక్యూరిటీస్ కి సంబంధించిన ఒక సంస్థలో పనిచేస్తూనే తన పనులను చక్కబెడుతూ ఉంటాడు. ఆ లాకెట్ కోసం రంగంలోకి దిగిన అతనికి, 'గిల్' మిత్ర బృందంపై అనుమానం కలుగుతుంది. గిల్ అతని ఫ్రెండ్స్ తమ దగ్గరున్న 'బ్లేడ్' ఫోన్ వదిలించుకునే ప్రయత్నంలో 'పనీర్' అనే మరో ముఠా నాయకుడి హత్యకి కారకులవుతారు.

తమపై పోలీసులకు అనుమానం కలిగేలోగా, పాతిపెట్టిన చోటు నుంచి బ్లేడ్ శవాన్ని మార్చేయాలనీ, పనీర్ హత్యకి సంబంధించిన ఆనవాళ్లను తుడిచేయాలని అనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? లియో ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి? చివరికి  లాకెట్ ఎవరి చెంతకు చేరుతుంది? అసలు 'ఐరా' ఎవరు? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలుగా కనిపిస్తాయి.

ఈ కథను కమల ఆల్కెమిస్ రాశారు. పిల్లల పాత్రలను ప్రధానంగా చేసుకుని రచయిత రాసిన ఈ కథ ఆకట్టుకుంటుంది. ఆయా పాత్రలను మలచిన విధానం మెప్పిస్తుంది. ఇక స్క్రీన్ ప్లే కూడా బాగా కుదిరింది. ఒక్కో ఎపిసోడ్ లో ఒక ముఖ్యమైన పాత్రను పరిచయం చేస్తూ, కథనాన్ని నడిపించిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం ఉండేలా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పిల్లల పాత్రలను వారి ఫ్యామిలీస్ తో ముడిపెడుతూ, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

నవీన్ చంద్ర పాత్ర కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికే, ఆ తరువాత ఆ పాత్ర ప్రాధాన్యతను సంతరించుకుని చివరివరకూ కొనసాగుతుంది. ఈ సిరీస్ చివర్లో సంపత్ రాజ్ తళుక్కున మెరుస్తూ మరింత ఉత్సాహాన్ని పెంచుతాడు. ఇక 'ఐరా' ఎవరనే ఆడియన్స్ ప్రశ్నార్థకం నుంచి సీజన్ 2 మొదలవుతుందనుకోవాలి.  

ప్రతి ఎపిసోడ్ ముగింపు .. ఆ తరువాత ఎపిసోడ్ పై ఉత్కంఠను పెంచుతూ వెళుతుంది. కృతకంగా .. నాటకీయంగా అనిపించకుండా, సహజత్వానికి దగ్గరగా ఈ కథను తీసుకెళ్లిన తీరు మనసులను హత్తుకుంటుంది. ప్రధానమైన పాత్రలను పోషించినవారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. విఘ్నేశ్ రాజ్ కెమెరా పనితనం .. పృథ్వీ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం .. రాధా శ్రీధర్ ఎడిటింగ్ మంచి మార్కులు కొట్టేస్తాయి. భారీతనం .. కథాకథనాలు .. ట్విస్టులు .. లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి ప్రధానమైన బలమని చెప్పక తప్పదు.

Trailer

More Reviews