'వాళై' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

Vaazhai

Vaazhai Review

  • ఆగస్టులో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 11 నుంచి హాట్ స్టార్లో స్ట్రీమింగ్ 
  • యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన కథ 
  • సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు 
  • లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ హైలైట్

గ్రామీణ నేపథ్యం .. పిల్లలు ప్రధానమైన పాత్రను పోషించే కథలు ఈ మధ్య కాలంలో చాలానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చాయి. ఈ తరహా కథలకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోంది కూడా. అలాంటి ఒక కథతో రూపొందిన సినిమానే 'వాళై'. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్కడ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

అది ఒక మారుమూల గ్రామం. చుట్టూ ఎత్తైన కొండలను కలిగిన ప్రాంతం. అరటితోటలు అక్కడి ప్రజల జీవన ఆధారం. ఆ అరటితోటలకు సంబంధించిన పనులు చేసుకుని కొన్ని పేద కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఆ గ్రామానికి చెందిన 12 ఏళ్ల కుర్రాడే శివనంద. తల్లి .. పెళ్లి కావలసిన అక్క .. ఇదే అతని కుటుంబం. అతని స్నేహితుడు శేఖర్. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే తిరుగుతూ ఉంటారు. 

ఉదయాన్నే కాంట్రాక్టర్ పంపించిన లారీ గ్రామానికి వస్తుంది. అందరూ అన్నాలు కట్టేసుకుని ఆ లారీలో వెళుతూ ఉంటారు. అరటి గెలలు దించి లోడ్ కి ఎత్తిన తరువాత, ఆ లారీపైనే కూర్చుని రాత్రికి ఇంటికి చేరుకుంటూ ఉంటారు. ఇది వారి దినచర్య. కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న అప్పు తీరాలంటే శివ కూడా అరటి గెలలు దింపడానికి వెళ్లవలసిన పరిస్థితి. ఈ విషయంలో తల్లి అతణ్ణి ఒత్తిడి చేస్తూ ఉంటుంది. 

అయితే శివకి స్కూల్ కి వెళ్లడం ఇష్టం .. చదువుకోవడం ఇష్టం. తన క్లాస్ లో అతనే ఫస్టు. అతనంటే టీచర్లలందరికీ ఇష్టమే. అతనికి మాత్రం పూన్ గుడి టీచర్ (నిఖిలా విమల్) అంటే ఇష్టం. ఆ టీచర్ కర్చీఫ్ దొరికితే దానిని ఎంతో భద్రంగా దాచుకుని .. అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అంత పేదరికంలోను చదువుకోవడానికి ఆసక్తిని చూపుతున్న శివపై ఆ టీచర్ కూడా అభిమానం చూపుతూ ఉంటుంది. 

ఆ గ్రామంలో అరటిగెలలు దింపడానికి పనికి వెళ్లే ముఠాకి 'కణి' నాయకుడిగా ఉంటాడు. కాంట్రాక్టర్ తో నిర్మొహమాటంగా మాట్లాడే ధైర్యం అతనికి మాత్రమే ఉంటుంది. తన అక్కయ్య అతనిని ఇష్టపడుతుందనీ గ్రహించిన శివ, వాళ్ల వివాహం జరిగితే బాగుంటుందని భావిస్తాడు. తండ్రిలేని తమ కుటుంబానికి 'కణి' అండ అవసరమని అనుకుంటాడు. తల్లి మాట కాదనలేక అప్పుడప్పుడు స్కూల్ మానేసి పనికి వెళుతూ ఉంటాడు. 

ఒకరోజున అతని తల్లి అనారోగ్యం బారిన పడుతుంది. ఆమెకి బదులుగా శివ పనికి వెళ్లవలసి వస్తుంది. అయితే అదే రోజున తన డాన్స్ ప్రోగ్రామ్ రిహార్సల్స్ ఉండటంతో శివ స్కూల్ కి వెళతాడు. ఆ విషయాన్ని తల్లి దగ్గర దాచిపెట్టి శివ అక్కయ్య మాత్రమే పనికి వెళుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 

ఇది 1990లలో జరిగిన ఒక యథార్థ సంఘటన. తమిళనాడులోని ఒక గ్రామంలో  కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. అరటిపండ్ల వ్యాపారంతో ముడిపడిన గ్రామీణ కూలీల జీవన నేపథ్యానికి సంబంధించిన కథ ఇది. పేదరికంతో కూలీలు పడే అవస్థలు .. కాంట్రాక్టర్ల ధోరణి .. పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలు .. మొదలైన అంశాలను చాలా సహజంగా ఆవిష్కరించారు. 

ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన కథ కావడం వలన, ఇతర వినోదపరమైన అంశాలను ఎక్కడా టచ్ చేయలేదు. జరిగిన సంఘటనను సహజంగా ప్రేక్షకుల ముందుంచే ప్రయత్నం మాత్రమే జరిగింది. జరిగిన సంఘటనను తెరపై చూస్తున్నామని భావిస్తే, చివర్లో వచ్చే కొన్ని సీన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. వినోదపరమైన అంశాలను ఆశిస్తే మాత్రం నిరాశనే మిగులుతుంది. 

ఇక ఈ సినిమా కథకి బాగా హెల్ప్ అయింది లొకేషన్స్ అని చెప్పాలి. గ్రామీణ వాతావరణం .. పచ్చని పొలాలు .. అరటితోటలు .. సెలయేళ్లు ఇలా ప్రకృతిని ఇష్టపడేవారికి ఈ సినిమా పండుగ చేస్తుంది. ఆ లొకేషన్స్ ను అందంగా తెరపైకి తీసుకొచ్చిన కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం .. సూర్య ప్రథమన్ ఎడిటింగ్ మెప్పిస్తాయి.

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. కొన్ని సందర్భాల్లో కానివారి స్వార్థం ఎంత ప్రమాదమో .. అయినవారి ఆవేశం కూడా అంతే ప్రమాదానికి దారితీస్తుందనే విషయాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది. మనం చూసేది కథ కాదు .. కొంతమంది జీవితాలు అనే ఆలోచనతో చూస్తే ఈ కంటెంట్ కి కనెక్ట్ కావొచ్చు.

Movie Name: Vaazhai

Release Date: 2024-10-11
Cast: Ponvel, Raghul, Kalaiyarasan, Nikhila Vimal, Karnan Janaki, Dhivya Duraisamy
Director: Mari Selvaraj
Music: Santhosh Narayanan
Banner: Disney+ Hotstar

Vaazhai Rating: 2.50 out of 5

Trailer

More Reviews