మలయాళం సినిమాల నుంచి ఓటీటీ వైపుకు క్రైమ్ థ్రిల్లర్ లు .. మర్డర్ మిస్టరీల జోనర్లకు సంబందించిన కంటెంట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కంటెంట్ తో వచ్చిన సినిమానే 'అడియోస్ అమిగో'. అసిఫ్ అలీ .. సూరజ్ వెంజరమూడు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్కడ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.
ప్రియన్ (సూరజ్) ఏవో చిన్నా చితకా పనులు చేస్తూ పట్నంలో రోజులు గడువుతుంటాడు. ఒక స్నేహతుడితో కలిసి రూమ్ లో అద్దెకి ఉంటూ ఉంటాడు. ఏవో రోజులు గడిచిపోతున్నాయి కదా అనుకుంటే, ఊళ్లో ఉన్న తల్లికి సీరియస్ గా ఉన్నట్టు చెల్లి నుంచి కాల్ వస్తుంది. తల్లిని హాస్పిటల్లో చేర్పించామనీ, అత్యవసరంగా ఒక పాతిక వేలు కావాలని అడుగుతుంది. తాను వెంటనే ఏర్పాటు చేస్తానని ప్రియన్ తన చెల్లితో చెబుతాడు.
ఆ తరువాత తనకి పరిచయం ఉన్న అందరికీ కాల్స్ చేయడం మొదలుపెడతాడు. చివరికి ఒకరు మాత్రం ఫలానా బస్టాండులో ఉండమనీ, తాను అక్కడ డబ్బు ఏర్పాటు చేస్తానని అంటాడు. అతని కోసం వెయిట్ చేస్తున్న ప్రియన్ కి ప్రిన్స్ ( ఆసిఫ్ అలీ) తారసపడతాడు. అప్పటికే ప్రిన్స్ బాగా తాగేసి ఉంటాడు. పరిచయమైన కాసేపట్లోనే ప్రిన్స్ సాన్నిహిత్యం చూపించడం ప్రియన్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తనతో 'తిరువనంతపురం' రమ్మని ప్రియన్ ను ప్రిన్స్ ఒత్తిడి చేస్తాడు.
ప్రిన్స్ తాను కోటీశ్వరుడనని చెప్పే మాటలను ప్రియన్ లైట్ తీసుకుంటాడు. ఆ సమయంలోనే అతని బ్యాగులో చాలా డబ్బు ఉండటం చూసి షాక్ అవుతాడు. ప్రియన్ కి డబ్బు ఇస్తానని చెప్పిన వ్యక్తి హ్యాండ్ ఇస్తాడు. దాంతో ప్రిన్స్ తో కలిసి బస్సు ఎక్కుతాడు ప్రియన్. అతను కూడా ప్రిన్స్ మాట కాదనలేక తాగేస్తాడు. ఫలితంగా బస్సులోని ప్రయాణీకులతో ఇద్దరూ చీవాట్లు తింటారు. తన ఫ్లాష్ బ్యాక్ గురించి ప్రియన్ కి చెబుతాడు ప్రిన్స్. కాకపోతే ఆ మాటలను ప్రియన్ పెద్దగా పట్టించుకోడు.
మార్గమధ్యంలో ఒక టౌన్ రాగానే హఠాత్తుగా అక్కడ దిగిపోతాడు ప్రిన్స్ .. అతను అలా ఎందుకు చేశాడో తెలియక వెనకనే దూకేస్తాడు ప్రియన్. అతణ్ణి ఓ బట్టల షాపుకి తీసుకు వెళ్లిన ప్రిన్స్, 'హేమ'కోసం వచ్చినట్టుగా అక్కడి సిబ్బందికి చెబుతాడు. అక్కడి వాళ్లకి పప్పు బెల్లాల మాదిరిగా అతను డబ్బు పంచుతూ ఉండటం చూసి ప్రియన్ బిత్తరపోతాడు. చివరికి స్టార్ హోటల్ యజమాని కూడా అతనిని గౌరవించడం చూసి అయోమయంలో పడిపోతాడు.
ప్రిన్స్ నిజంగానే ఒక పెద్ద బిజినెస్ మెన్ కొడుకనీ, అతని మామగారు కూడా కోటేశ్వరుడని ప్రియన్ కి తెలుస్తుంది. అతను సరదాగా దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడనీ, ఎక్కడికి వెళ్లినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడని తెలుసుకుంటాడు. అప్పుడు ప్రియన్ ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? హేమ ఎవరు? ప్రియన్ తల్లి ప్రాణాలతో బయటపడుతుందా? అనేది కథ.
అనుకోకుండా తారసపడిన ఇద్దరి వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రిన్స్ కి డబ్బంటే లెక్కలేదు .. ప్రియన్ కి డబ్బు అత్యవసరం. ప్రిన్స్ దగ్గర కావలసినంత డబ్బు ఉంది .. అలాగని అతణ్ణి అడిగేంత చనువు ప్రియన్ కి లేదు. హేమ అనే యువతి గురించి ప్రిన్స్ ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆపదలో ఉన్న తన తల్లి గురించి ప్రియన్ ఆరాటపడుతూ ఉంటాడు. ఇలా విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల మధ్య ఘర్షణ ఎలా ఉంటుందనే దిశగా ఈ కథ నడుస్తుంది.
ఈ సినిమా మొత్తంలో రెండు పాత్రలు మాత్రమే మొదటి నుంచి చివరివరకూ కనిపిస్తాయి. మిగతా పాత్రలన్నీ ఇలా వచ్చి .. అలా మాయమవుతూ ఉంటాయి. ఈ ఇద్దరు స్నేహితులు .. సినిమా మొదటి నుంచి చివరివరకూ ప్రయాణీకులు. వారితో కలిసి ప్రేక్షకులు కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ఇద్దరి ప్రవర్తన చూస్తూ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తుంటారు. దర్శకుడు ఆ అంచనాలను దాటుకుని కథను ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాడు.
ఈ కథ ముగింపుకి దగ్గర పడుతుండగా కాస్త పాకాన పడుతుంది. అప్పటివరకూ నడిచే కథను ఫాలో కావడానికి చాలా ఓపిక ఉండాలి. ముగింపు కాస్త ఎమోషనల్ టచ్ తోనే ఉంటుంది. ఈ కథలో అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుంది. అది కథలోని కీలకమైన అంశంతో ముడిపడి ఉంటుంది. జిమ్షీ ఖాలిద్ ఫొటోగ్రఫీ .. గోపీసుందర్ - జేక్స్ బిజోయ్ సంగీతం .. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ ఓకే. అసిఫ్ అలీ - సూరజ్ వెంజరమూడు నటన, చివర్లోని ఎమోషనల్ టచ్ ను చూడాలనుకుంటే, అప్పటివరకూ .. అక్కడి వరకూ సాగే కథ విషయంలో కాస్త ఓపిక చేసుకోవలసిందే.
'అడియోస్ అమిగో' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews
Adios Amigo Review
- ఆగస్టు 9న విడుదలైన సినిమా
- ఈ నెల 6 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్
- రెండు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరిగే కథ
- నిదానంగా సాగే కథాకథనాలు
- ఓపికతో ఫాలో కావలసిన కంటెంట్
Movie Name: Adios Amigo
Release Date: 2024-09-06
Cast: Asif Ali, Suraj Venjaramoodu, Anagha, Shine Tom Chacko, Vineeth
Director: Nahas Nazar
Music: Gopi Sundar
Banner: Ashiq Usman Productions
Review By: Peddinti
Adios Amigo Rating: 2.25 out of 5
Trailer