'సరిపోదా శనివారం' - మూవీ రివ్యూ!

Saripoda Shanivaram

Movie Name: Saripoda Shanivaram

Release Date: 2024-08-29
Cast: Nani, Priyanka Arul Mohan, S J Surya, Murali Sharma, Sai Kumar, Harsha Vardhan
Director:Vivek Athreya
Producer: DVV Danayya
Music: Jekes Bejoy
Banner: DVV Entertainments
Rating: 3.25 out of 5
  • నాని హీరోగా రూపొందిన 'సరిపోదా శనివారం'
  • కథను ఇంట్రెస్టింగ్ గా నడిపించిన కొత్త పాయింట్
  • హైలైట్ గా నిలిచిన స్క్రీన్ ప్లే 
  • ప్రధానమైన ఆకర్షణగా యాక్షన్ - ఎమోషన్స్ 
  • నానీకి మరోసారి హిట్ పడినట్టే

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' రూపొందింది. డీవీవీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, మురళీశర్మ - ఎస్ జె సూర్య కీలకమైన పాత్రలను పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

సూర్య (నాని) ఓ మధ్య తరగతి యువకుడు. తల్లి ఛాయాదేవి (అభిరామి) తండ్రి శంకరం ( సాయికుమార్) అక్కయ్య భద్ర ( అదితి బాలన్) ఇదీ అతని కుటుంబం. అతని మేనత్త కూతురు కల్యాణి (ప్రియాంక అరుళ్ మోహన్) అంటే సూర్యకి చాలా ఇష్టం. తన అన్నయ్య సీతాపతి కారణంగా అతని భార్యాబిడ్డలు కష్టాలు పడుతుండటం చూడలేని ఛాయాదేవి, అతణ్ణి జైలుకు పంపిస్తుంది. అలాగే అతని భార్యాబిడ్డలను వేరే ఊరికి పంపిస్తుంది. ఎక్కడికి పంపించింది ఎవరికీ చెప్పదు.  

అలా చిన్నప్పుడే సూర్య - కల్యాణి ఒకరికొకరు దూరమైపోతారు. ఛాయాదేవి అనారోగ్యం బారిన పడుతుంది. తాను ఎక్కువ రోజులు బ్రతకననే విషయం ఆమెకి అర్థమవుతుంది. తరచూ తగవులు పడే తన కొడుకు సూర్యను దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఎప్పుడూ కోప్పడుతూ ఉంటే ఆ కోపానికి విలువ ఉండదనీ, అందువలన వారంలో ఒక రోజు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శించమని చెబుతుంది. మిగతా ఆరు రోజులలో ఏం జరిగినా ఆ కోపాన్ని అణచుకోవాలని అంటుంది.

ఓ రోజున సూర్య తల్లి చనిపోతుంది. ఆ రోజు నుంచి తన కోపాన్ని 'శనివారం' రోజున మాత్రమే చూపించాలని సూర్య నిర్ణయించుకుంటాడు. అలా కాలం గడిచిపోతుంది. సూర్య .. అతని అక్కయ్య భద్ర పెద్దవాళ్లవుతారు. సూర్య తనకి కోపం తెప్పించినవారి పేర్లను రాసి పెట్టుకుంటూ, శనివారం రాగానే వాళ్లని చితక్కొట్టేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తన మేనత్త వాళ్ల జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడుగానీ, ప్రయోజనం లేకుండా పోతుంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే చారుమతిగా పేరు మార్చుకున్న కల్యాణి ఆ ఊరికి పోలీస్ గా వస్తుంది. అక్కడ సీఐ దయానంద్ ( ఎస్.జె. సూర్య) ధోరణిని చూసి ఆమె భయపడిపోతుంది. తరచూ అతను 'సోకుల పాలెం' గ్రామస్తులను టార్గెట్ చేయడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దయానంద్ కీ .. అతని అన్నయ్య కూర్మానంద్ (మురళీశర్మ)కి మధ్య గల గొడవలకి అక్కడి పేద ప్రజలు బలవుతున్నారని తెలుసుకుంటుంది. అదే సమయంలో ఆమె సూర్య ప్రేమలో పడుతుంది. 

సూర్య గొడవలకి దూరంగా ఉండటం నచ్చడం వల్లనే అతణ్ణి చారుమతి ఆరాధిస్తూ ఉంటుంది. తన శనివారం మాట గురించి ఆమెకి ఎలా చెప్పాలా అని అతను సతమతమైపోతుంటాడు. ఈ మధ్యలోనే నారాయణ ప్రభ (అజయ్ ఘోష్) అనే రౌడీ షీటర్ తో పాటు, దయానంద్ కి కూడా సూర్య శనివారం ఎఫెక్ట్ చూపిస్తాడు. తనపై దాడి చేసింది ఎవరో తెలుసుకోవడానికి దయానంద్ ట్రై చేస్తూ ఉంటాడు. చారుమతి ఎదురుగా తమని సూర్య ఏమీ చేయలేడని భావించిన నారాయణ ప్రభ అనుచరులు, సూర్యపై దాడి చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఏమౌతుంది? అనేదే కథ. 

దర్శకుడు వివేక్ ఆత్రేయకి కామెడీపై మంచి పట్టు ఉందనే విషయాన్ని గతంలో అతని నుంచి వచ్చిన 'బ్రోచేవారెవరురా' .. 'అంటే .. సుందరానికీ' సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా విషయంలోనూ ఆయన కామెడీ కంటెంట్ ఎంతమాత్రం తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. అలాగే ఎమోషన్ అనేది మొదటి నుంచి చివరివరకూ అంతర్లీనంగా ఉండేలా చూసుకున్నాడు. అలాగే యాక్షన్ పాళ్లతో ఎంటర్టైన్ చేస్తూ వెళ్లాడు. 

చిన్నప్పుడు తల్లికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం .. చిన్నతనంలోనే తన మరదలు పట్ల ప్రేమను పెంచుకోవడం .. అక్కయ్య పట్ల అనురాగాన్ని కలిగి ఉండటం .. ఈ మూడు అంశాలకు హీరో ప్రాధాన్యతనిస్తూ వెళ్లిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక శాడిస్టు పోలీస్ ఆఫీసర్ .. స్వార్థపరుడైన రాజకీయనాయకుడు అన్నదమ్ములైతే ఎలా ఉంటుందనేది దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది.

కోపాన్ని ప్రదర్శించడానికి కూడా ఒక రోజును కేటాయించాలనే కొత్త పాయింటు ఈ కథలో కనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను దర్శకుడు మలిచిన తీరు మెప్పిస్తుంది. ముఖ్యంగా హీరో - విలన్ పాత్రలను డిజైన్ చేసిన తీరు ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది.  స్క్రీన్ ప్లే తో ఆత్రేయ చేసిన మేజిక్ వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ .. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. 

నిర్మాణ విలువలు బాగున్నాయి. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం .. మురళి ఫొటోగ్రఫీ .. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఈ కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. యాక్షన్ .. కామెడీ .. ఎమోషన్ ఈ కథలో బాగా పండాయి. అయితే లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ మాత్రం మిస్సయ్యాయి. ఈ పాకంలో ఆ పాళ్లు కూడా కుదిరుంటే మరింత బాగుండేది. ఇప్పటికీ ఇబ్బందేం లేదు .. ఇవి లేని ఈ కంటెంట్ తోను నాని హిట్ కొట్టేసినట్టేనని చెప్పచ్చు. 

Trailer

More Reviews