'డబుల్ ఇస్మార్ట్' - మూవీ రివ్యూ!

Double Ismart

Movie Name: Double Ismart

Release Date: 2024-08-15
Cast: Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar, Sayaji Shinde, Jhansi
Director:Puri Jagannadh
Producer: Puri Jagannadh
Music: Manisharma
Banner: Puri Connects
Rating: 2.50 out of 5
  
  • పూరి నుంచి వచ్చిన 'డబుల్ ఇస్మార్ట్'
  • రొటీన్ గా అనిపించే కథాకథనాలు 
  • మేజిక్ చేయలేకయిన మణిశర్మ
  • తగ్గిన గ్లామర్ డోస్ 
  • 'ఇస్మార్ట్ శంకర్'ను బీట్ చేయలేకపోయిన కంటెంట్


రామ్ కెరియర్లో చెప్పకోదగిన సినిమాగా 'ఇస్మార్ట్ శంకర్' కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ కారణంగా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోల జాబితాలో రామ్ కూడా చేరిపోయాడు. అప్పటివరకూ వరుస అపజయాలతో ఉన్న పూరీకి ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో అదే సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' ను తీసుకుని వచ్చారు. నిన్ననే థియేటర్లకు ఈ సినిమా ఎలా అనిపించిందనేది ఇప్పుడు చూద్దాం. 

లండన్ కేంద్రంగా 'బిగ్ బుల్' (సంజయ్ దత్) మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ఉంటాడు.
అతను చీకట్లో నాలుగు గోడల మధ్య కూర్చునే రకం కాదు. అవసరమైతే తానే రంగంలోకి దిగేసి అవతల వారి అంతు తేల్చేస్తూ ఉంటాడు. అలాంటి ఆయన తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ . మూడు నెలలకి మించి బ్రతకనని తెలుసుకుని షాక్ అవుతాడు. తను బ్రతకాలి .. విలాసవంతమైన జీవితాన్ని చాలా కాలం పాటు అనుభవించాలని తాపత్రయ పడుతుంటాడు. 

అదే సమయంలో 'మెమరీ ట్రాన్స్ ఫర్' అనే ఒక ప్రయోగం గురించిన విషయం అతనికి తెలుస్తుంది. తన మెమరీని మరొకరి బ్రెయిన్ కి మార్చేసి, ఆ వ్యక్తిని తానుగా మార్చేయాలని బిగ్ బుల్ భావిస్తాడు. అందుకు సంబంధించిన పరిశోధనలో హైదరాబాదులోని శంకర్ గురించి వారికి తెలుస్తుంది. గతంలో అలాంటి ప్రయోగం జరిగినప్పుడు అతను తట్టుకోగలిగాడనే సమాచారం అందుతుంది. దాంతో అతణ్ణి తీసుకురమ్మని తన అనుచరులను బిగ్ బుల్ ఆదేశిస్తాడు.

హైదరాబాదులో శంకర్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అదే సమయంలో అతనికి 'జన్నత్' ( కావ్యథాఫర్) పరిచయమవుతుంది. ఆమెతో అతను ప్రేమలో పడతాడు. అయితే ఆమె కదలికలు అతనికి అనుమానాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ ఇద్దరినీ బిగ్ బుల్ అనుచరులు ఫాలో అవుతూ ఉంటారు. మొత్తానికి ఒక రోజున వాళ్లకి శంకర్ దొరికిపోతాడు. వాళ్లు అనుకున్నట్టుగా శంకర్ లోకి బిగ్ బుల్ మెమరీని ట్రాన్స్ ఫర్ చేస్తారు. 

ఆ సమయంలోనే బిగ్ బుల్ ను చూస్తాడు శంకర్. దాంతో గతంలో అతను చేసిన ఒక దారుణం శంకర్ కళ్లముందు కదలాడుతుంది. శంకర్ కి ట్రాన్స్ ఫర్ చేసిన మెమరీ నాలుగు రోజుల్లో పనిచేయడం మొదలు పెడుతుందనీ, నాలుగు రోజుల తరువాత అతనికి తన గురించిన విషయాలేవీ గుర్తుండవని డాక్టర్లు చెబుతారు. దాంతో ఈ నాలుగు రోజుల్లోనే తాను అనుకున్న పనులు పూర్తి చేయాలని శంకర్ భావిస్తాడు. 

శంకర్ చేయాలనుకున్న ఆ పనులేమిటి? గతంలో అతనికి బిగ్ బుల్ వలన జరిగిన అన్యాయం ఏమిటి? హఠాత్తుగా శంకర్ జీవితంలోకి అడుగుపెట్టిన జన్నత్ ఎవరు? ఎక్కువకాలం బ్రతకాలనుకున్న బిగ్ బుల్ ప్రయత్నం ఫలిస్తుందా? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

 గతంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'ను గుర్తుచేస్తూనే ఈ కథ నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి రొటీన్ గా అనిపిస్తుంది. ఈ మధ్యలో జరిగే సన్నివేశాలు కూడా ఉత్కంఠను రేకెత్తించలేకపోయాయి. హీరో - హీరోయిన్ ట్రాక్ మరీ బలహీనంగా సాగుతుంది. ఇక అలీ తెరపై కనిపించగానే మంచి కామెడీ ట్రాక్ దొరికినట్టేనని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఆ ట్రాక్ అప్పటికప్పుడు అనుకుని, అలీకి వదిలేసినట్టుగా అనిపిస్తుంది.

సాధారణంగా పూరి టేకింగ్ ఒక ఎత్తయితే ఆయన రాసుకునే డైలాగ్స్ క రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. అలాగే మణిశర్మ సంగీతం అంటే, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తాయని అనుకుంటారు. కానీ ఈ రెండింటి విషయంలో ఎలాంటి మేజిక్ జరగలేదు. అప్పటికప్పుడు తెరపై హడావిడి చేస్తాయిగానీ, మనసుకు ఎంతమాత్రం పట్టుకోవు. 

పూరి వైపు నుంచి చూసుకుంటే నిర్మాణ విలువలకు వంక బెట్టవలసిన అవసరం లేదు. కథాకథనాలు రొటీన్ గా అనిపిస్తాయి. మణిశర్మ బాణీలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. జునైద్ ఎడిటింగ్ ఫరవాలేదు. కథ .. స్క్రీన్ ప్లే .. యాక్షన్ .. రొమాన్స్ .. పాటలు .. ఇలా ఎలా చూసుకున్నా, 'ఇస్మార్ట్ శంకర్' కంటే ఎక్కువ మార్కులను 'డబుల్ ఇస్మార్ట్' సాధించలేకపోయిందనే చెప్పాలి. 

Trailer

More Reviews