గ్లామరస్ హీరోయిన్ గా యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన నభా నటేశ్, ఆ తరువాత కొన్ని వ్యక్తిగత కారణాల వలన సినిమాలు చేయలేదు. కొంత గ్యాప్ తరువాత ఆమె చేసిన సినిమానే 'డార్లింగ్'. ప్రియదర్శి జోడీగా ఆమె నటించిన సినిమా ఇది. జులై 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ హైదరాబాద్ నేపథ్యంలో నడుస్తుంది. రాఘవ (ప్రియదర్శి) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. స్కూల్ డేస్ లోనే అతను చదువు పట్ల తనకి గల అయిష్టతను వ్యక్తం చేస్తాడు. దాంతో బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుందనీ .. మంచి జాబ్ వస్తే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చనీ .. ప్యారిస్ కి హనీమూన్ వెళ్లొచ్చని తల్లిదండ్రులు చెబుతారు. ఆ మాటలు అతనిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అవన్నీ నిజం చేసుకోవడం కోసమే అతను చదువుతాడు.
రాఘవ పెద్దవాడవుతాడు .. ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే జీవితం తాను ఊహించుకున్నట్టుగా లేకపోవడం వలన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఆయనకి ఆనంది (నభా నటేశ్) పరిచయమవుతుంది. ఆమె మాటలు అతనికి బ్రతుకుపై కొత్త ఆశలు కలిగిస్తాయి. దాంతో ఆమె పట్ల అతను ఆకర్షితుడవుతాడు. ఆమె అంగీకరించడంతో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు.
ఒక అందమైన యువతి అంత తేలికగా తన జీవితంలోకి అర్ధంగిగా అడుగుపెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతుంటాడు. అయితే మొదటి రాత్రే అతనికి ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. ప్రేమతో ఆమెనే దగ్గరకికి తీసుకుంటూ ఉంటుంది. ఆ వెంటనే అతణ్ణి కొడుతూ ఉంటుంది. ఆమె అలా ఎందుకు చేస్తున్నది రాఘవకి అర్థం కాదు. దాంతో తనకి పరిచయమున్న డాక్టర్ నందిని( అనన్య నాగళ్ల) ను ఆనంది సమక్షంలోనే ప్రవేశపెడతాడు.
ఆనందితో మాటలు కలిపిన నందిని, ఆమె మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతుందని చెబుతుంది. ఆమెలో ఆది .. శ్రీశ్రీ .. ఝాన్సీ .. మాయ .. బేబి అనే లోపలి మనుషులు ఉన్నారని అంటుంది. ఆమెలోని ఆది పాత్ర పురుషులను ద్వేషిస్తూ ఉంటుందనీ, పురుషుల బారి నుంచి ఆనందిని కాపాడటమే తన ఉద్దేశమన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుందని చెబుతుంది.
--- ఆనందిని మామూలు మనిషిని చేయాలంటే, ఆమెలోని ఒక్కో పాత్రని తెలివిగా బయటికి పంపించవలసి ఉంటుందని రాఘవ్ తో చెబుతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా, ఆమెలోని మాయ అనే పాత్ర కారణంగా ఆనంది తమకి దక్కకపోవచ్చని అంటుంది. అప్పుడు రాఘవ ఏం చేస్తాడు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? ప్యారిస్ కి హనీమూన్ వెళ్లాలనే అతని కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
'డార్లింగ్' అనే టైటిల్ చూసిన ప్రేక్షకులు ఇది రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ అనుకుంటారు. అలాగే ప్రియదర్శి మార్క్ గురించి తెలిసినవారు ఆ తరహా కామెడీ డ్రామా కావొచ్చునని భావిస్తారు. కానీ ఈ కథ ఎక్కడో మొదలై ఎటో వెళుతూ ఉంటుంది. ఆనందిలో ఐదు కేరక్టర్లు ఉంటాయి. అందువలన ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందనేది ఎవరికీ తెలియదు. ఈ కారణంగా హీరో - హీరోయిన్స్ మధ్య లవ్ .. రొమాన్స్ లేకుండా దర్శకుడు లాక్ చేసేశాడు.
లవ్ .. రొమాన్స్ లోపించిన ఈ కథకి కావలసింది కామెడీ బలం. అదేమైనా ఉందా అంటే .. ఎక్కడా కనిపించదు. కమెడియన్స్ ఉంటే కామెడీ ఉన్నట్టు కాదనే విషయం మనకి మరోసారి అర్థమవుతుంది. ఇక నభా చేసింది చాలా తక్కువ సినిమాలు. అందువలన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తరహా పాత్రలను కామెడీగా చేయడం కూడా కష్టమే. అక్కడే ఆమె ఇబ్బంది పడుతుంది .. మనలను ఇబ్బంది పెడుతుంది.
ఇక కథ క్లైమాక్స్ కి చేరుకుంటూ ఉండగా, మీరా ( నిహారిక) పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆనంది అనేది కూడా ఒక పర్సనాలిటీయేననీ, ఆమె అసలు పేరు 'ప్రియా' అంటూ ఆమెకి సంబంధించిన వివరాలు చెబుతుంది. దాంతో హీరోతో పాటు ఆడియన్స్ కూడా అసహనానికి లోనవుతారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించాడు. సన్నివేశాలలోగానీ .. సంభాషణలలో గాని పట్టులేకపోవడం వలన, అదేమీ వారి మనసుకు పట్టదు.
హీరోయిన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు .. ఆమె పేరెంట్స్ ఎవరో .. ఎక్కడ ఉంటారో తెలియదు. అయినా హీరో ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు రావడం ఒక విశేషం. బాగా చదువుకుంటే మంచి జాబ్ దొరుకుతుంది. అప్పుడు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్యారిస్ కి హనీమూన్ కి వెళ్లొచ్చు అనే మాటలనే చిన్నప్పటి నుంచి బుర్రలో పెట్టుకుని హీరో ఎదగడం మరో విశేషం.
బలమైన కథాకథనాలు .. ఆసక్తికరమైన సన్నివేశాలు .. అనూహ్యమైన మలుపు లేని కారణంగా ప్రేక్షకులు డీలాపడతారు. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం వలన, నరేశ్ రామదురై ఫొటోగ్రఫీ .. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం .. ప్రదీప్ రాఘవ ఎడిటింగ్ వర్క్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ప్రియదర్శి మార్క్ కామెడీ కోసం తెరపై వెతుక్కునేవారికి నిరాశనే మిగులుతుందని చెప్పచ్చు.
'డార్లింగ్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!
| Reviews
Darling Review
- ప్రియదర్శి హీరోగా రూపొందిన 'డార్లింగ్'
- చాలా గ్యాప్ తరువాత కనిపించిన నభా నటేశ్
- బలహీనమైన కంటెంట్
- కనిపించని ప్రియదర్శి మార్క్ కామెడీ
Movie Name: Darling
Release Date: 2024-08-13
Cast: Priyadarshi, Nabha Natesh, Ananya Nagalla, Brahmanandam, Raghubabu, Muralidhar Goud
Director: Ashwin Ram
Music: Vivek Sagar
Banner: Prineshow Entertainment
Review By: Peddinti
Darling Rating: 2.00 out of 5
Trailer