ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్ తో ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు 'హాట్ స్టార్'లో అందుబాటులోకి వచ్చింది. ఆ సిరీస్ పేరే 'లైఫ్ హిల్ గయీ'. ప్రేమ్ మిస్త్రీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 7 భాషలలో ఈ నెల 9వ తేదీ నుంచి 6 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ అంతా ఉత్తరాఖండ్ లోని 'పంచ్ మోలి' అనే విలేజ్ నేపథ్యంలో నడుస్తుంది. ఆ గ్రామానికి లండన్ నుంచి హిమాలయ్ (వినయ్ పాఠక్) తన ఇద్దరు పిల్లలైన దేవ్ (దివ్యేన్దు) కల్కి (కుశ కపిల)తో కలిసి వస్తాడు. అక్కడ దేవ్ తాత పృథ్వీకి సంబంధించిన ఒక పాడుబడిన బంగ్లా ఉంటుంది. ఆ బంగాళాలో హోటల్ ను రన్ చేయమనీ, ఈ విషయంలో దేవ్ - కల్కి ఇద్దరూ కష్టపడవలసి ఉంటుందని పృథ్వీ అంటాడు.
దేవ్ - కల్కి ఇద్దరూ పడుతున్న కష్టాన్ని గమనిస్తూ ప్రతి నెలా ఒక మెడల్ ఇస్తూ ఉంటాననీ, 6 నెలలలో ఎవరి దగ్గర ఎక్కువ మెడల్స్ ఉంటే వారికి తన ఆస్తిపాస్తులను రాసిస్తానని తాత మాట ఇస్తాడు. దాంతో ఆ దిశగా దేవ్ - కల్కి కష్టపడటం మొదలుపెడతారు. ఇక అదే గ్రామానికి చెందిన హిమ (ముక్తి మోహన్) పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటుంది. అనాథ అయిన ఆమెను కృపాల్ పెంచుతాడు. ఊహ తెలిసిన దగ్గర నుంచే ఆమె చందన్ ను ప్రేమిస్తూ ఉంటుంది.
దేవ్ - కల్కి కలిసి భూత్ బంగ్లా మాదిరిగా ఉన్న ఆ బంగ్లాను బాగు చేయిస్తారు. హోటల్ మాదిరిగా ఆ భవనాన్ని మార్చేసి, ఆ ఊరికే చెందిన కొంతమందిని పనివాళ్లుగా తీసుకుంటారు. చందన్ నిజస్వరూపం గురించి తెలుసుకున్న హిమ, దేవ్ పట్ల ఆకర్షితురాలవుతుంది. అతను కూడా ఆమెను ఆరాధిస్తూ ఉంటాడు. దేవ్ - కల్కి ఇద్దరూ కూడా తాతయ్య నుంచి మెడల్స్ ఎక్కువగా సంపాదించి, ఆస్తిపాస్తులు దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంటారు.
తాతయ్య ఇచ్చే ఆస్తులు తీసుకుని లండన్ వెళ్లిపోవాలని కల్కి భావిస్తుంది. హిమను తీసుకుని న్యూయార్క్ వెళ్లిపోవాలని దేవ్ నిర్ణయించుకుంటాడు. అయితే ఈ నేపథ్యంలో హోటల్లో దెయ్యం ఉందనే ఒక టాక్ బయటికి పోతుంది. గతంలో ఆ హోటల్లో చనిపోయిన వ్యకినే దెయ్యమై తిరుగుతున్నాడని జనాలు భయపడుతూ ఉంటారు. హోటల్ మూత పడుతుందని దేవ్ - కల్కి ఆందోళన చెందుతూ ఉంటారు.
ఈ సమయంలోనే దేవ్ మాజీ ప్రియురాలు శ్రేయ ఆ గ్రామానికి వస్తుంది. ఆమె దేవ్ తో చనువుగా ఉండటాన్ని హిమ తట్టుకోలేకపోతుంది. అప్పుడు హిమ ఏం చేస్తుంది? హోటల్లోని దెయ్యం సంగతేమిటి? దేవ్ తో హిమ ప్రేమ ఫలిస్తుందా? అతనితో విదేశాలకి వెళ్లడానికి ఆమె అంగీకరిస్తుందా? అనేది మిగతా కథ.
అక్కడక్కడా ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగే కామెడీ డ్రామా ఇది. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి .. నీరు మాత్రమే కాదు, నిస్వార్థమైన ప్రేమానురాగాలు కూడా లభిస్తాయని చెప్పడమే ఈ కథ ప్రధానమైన ఉద్దేశం. దర్శకుడు ఈ కథలోని గ్రామీణ జీవన విధానాన్ని ఆవిష్కరించిన తీరు అక్కట్టుకుంటుంది. చాలా సహజంగా ఆయన ప్రధానమైన పాత్రలను నడిపిస్తూ వెళ్లారు.
కుటుంబ సభ్యులతోనైనా .. గ్రామస్తులతోనైనా కలిసి మెలసి ఉండటంలోనే అందం ఉంటుంది .. ఆనందం ఉంటుంది .. అసలైన సంతోషం ఉంటుందనే ఒక సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది. అయితే ఈ కథలో అనూహ్యమైన మలుపులు .. అనుకోని ట్విస్టులు వంటివి కనిపించవు. సన్నివేశాల మాదిరిగానే వినోదం కూడా సహజత్వంతో ముడిపడి కనిపిస్తుంది. అందువలన పడి పడి నవ్వే కామెడీని ఆశించకూడదు.
ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వర్క్ ఫరవాలేదు. ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. ఒక గ్రామం .. ఆ గ్రామంలోని మనుషులు .. వారి స్వరూప స్వభావాలను తెరపైకి తీసుకురావడలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక కథను కథగా చెప్పడానికే ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. అందువల్లనే ఆయన సినిమాటిక్ గా చెప్పడానికి ప్రయత్నించలేదు.
ఈ కథకి .. కథనానికి మరికాస్త ఆసక్తిని జోడించింది లొకేషన్స్ అని చెప్పాలి. కథ కోసం ఎంచుకున్న ఈ లొకేషన్ ఈ సిరీస్ కి ప్రధానమైన బలమని చెప్పుకోవాలి. అయితే కథను అల్లుకున్న తీరు .. ఆవిష్కరించిన తీరు సహజత్వానికి దగ్గరగానే అనిపించినా, ఆడియన్స్ ను కూర్చోబెట్టేంత వినోదం లేదు. అక్కడక్కడా కొన్ని పల్చటి నవ్వులే తప్ప, హాయిగా నవ్వుకునేంత కామెడీ కూడా లేదు. అంతర్లీనంగా ఓ సందేశమైతే ఉంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఓ లుక్కేస్తే వేయొచ్చు.
'లైఫ్ హిల్ గయీ' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!
| Reviews
Life Hill Gayi Review
- కామెడీ డ్రామాగా 'లైఫ్ హిల్ గయీ'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు
- సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు
- ఆశించిన స్థాయిలో కనిపించని కామెడీ
- ఆలోచింపజేసే సందేశం
Movie Name: Life Hill Gayi
Release Date: 2024-08-09
Cast: Divyenndu, Kusha Kapila, Mukti Mohan,Vinay Pathak
Director: Prem Mistry
Music: -
Banner: Himshrri Films
Review By: Peddinti
Life Hill Gayi Rating: 2.50 out of 5
Trailer