'డి - బ్లాక్' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

D Block

Movie Name: D Block

Release Date: 2024-08-08
Cast: Arulnithi, Charandeep, Avantika Mishra, Thalaivasal Vijay, Uma Riyaz Khan
Director:Vijay Kumar Rajendran
Producer: Aravinnd Singh
Music: Kaushik Krish
Banner: MNM Films
Rating: 2.25 out of 5
  • అరుళ్ నిధి హీరోగా రూపొందిన 'డి - బ్లాక్'
  • థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • ఆసక్తికరంగా సాగని కథనం 
  • ఉత్కంఠను రేకెత్తించలేకపోయిన కంటెంట్

కోలీవుడ్ లో అరుళ్ నిధికి మంచి ఇమేజ్ ఉంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. అలాంటి అరుళ్ నిధి హీరోగా రూపొందిన థ్రిల్లర్ మూవీనే 'డి - బ్లాక్'. విజయ్ కుమార్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, చాలాకాలం క్రితమే థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

అరుళ్ (అరుళ్ నిధి) తన స్నేహితుడైన విజయ్ తో కలిసి 'కోయంబత్తూర్'లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరతాడు. అదే ఏడాది ఆ కాలేజ్ చేరిన శృతి (అవంతిక మిశ్రా)తో ప్రేమలో పడతాడు. శృతి రూమ్ లో ఆమెతో కలిసి రియా - స్వాతి ఉంటారు. బాయ్స్ హాస్టల్ కి కాస్త దూరంగా 'డి - బ్లాక్' లో గళ్స్ హాస్టల్ ఉంటుంది. ఆ కాలేజ్ అడవికి ఆనుకుని ఉంటుంది. చిరుతలు .. ఎలుగులు అక్కడ తిరుగుతున్నట్టుగా అంతా చెప్పుకుంటూ ఉంటారు. 

అందువలన సాయంత్రం ఆరు గంటలకే కాలేజ్ గేట్లు వేసేస్తూ ఉంటారు. అలాగే పొద్దుపోయిన తరువాత ఎవరూ తమ రూమ్స్ నుంచి బయటికి రాకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోను హాస్టల్ డాబాపైకి వెళ్లకూడదు అని వార్డెన్ అందరినీ హెచ్చరిస్తుంది. అయితే ఒక రాత్రివేళ స్వాతి (జనని)  బట్టలు ఆరేయడానికి హాస్టల్ డాబాపైకి వెళుతుంది. ఆల్రెడీ ఆమెకి అంతకుముందు చీకట్లో ఒక ఆకారం కనిపించడం .. ఆమె బొమ్మగీయడం చేస్తుంది. 

ఆ మరుసటి రోజున స్వాతి శవమై కనిపిస్తుంది. ఆమెపై చిరుతపులి దాడి చేసినట్టుగా పోలీసులు తేల్చేస్తారు. స్వాతి మరణం పట్ల అరుళ్ దగ్గర శృతి అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో అరుళ్ ను సీనియర్ స్టూడెంట్ 'మాయ' కలుసుకుంటుంది. చనిపోవడానికి ముందు స్వాతి గీసిన డ్రాయింగ్ ను గురించి ప్రస్తావిస్తుంది. చీకట్లో ఒక ఆకారం కనిపించినట్టుగా ఆమె గీసిందనీ, తన స్నేహితురాలు పూర్ణిమ కూడా అలాంటి బొమ్మ గీసిన తరువాతనే చనిపోయిందని అంటుంది.

కాలేజ్ లో ఏదో జరుగుతోందనీ .. అదేమిటో తెలుసుకోవాలని అరుళ్ అంటాడు.  కాలేజ్ లో ఇంతవరకూ ఎనిమిది మంది అమ్మాయిలు చనిపోయారనీ, వాళ్లలో గతంలో వాచ్ మెన్ గా పనిచేసిన అతని కూతురు 'మణి' కూడా ఉందనే విషయం వాళ్ల పరిశీలనలో తేలుతుంది. దాంతో వాళ్లు ఆ వాచ్ మెన్ అడ్రెస్ తెలుసుకుని, అతని ఊరుకు వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? కాలేజ్ లో అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు? అనేదే మిగతా కథ.

 ఈ కథ అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో నడుస్తుంది. సాధారణంగా కాలేజ్ నేపథ్యంతో కూడిన కథల్లో లవ్ .. రొమాన్స్ .. కామెడీకి తప్పకుండా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కానీ ఈ కథలో అలాంటివేం కనిపించవు. అలాగే క్లాస్ రూమ్ సరదాలు ..  సందళ్లు కూడా కనిపించవు.  అమ్మాయిల హత్యలపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశాడు. వాటి చుట్టూనే సన్నివేశాలను పరిగెత్తించాడు. 

ఇది థ్రిల్లర్ జోనర్ లో నడిచే కథనే అయినా, తరువాత ఏం జరుగుతుందా అని కుతూహలాన్ని రేకెత్తించలేకపోయింది. సస్పెన్స్ ను రివీల్ చేసినప్పుడు అది అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. అలాగని లింక్ లేకుండా ఉండదు. హాస్టల్ బిల్డింగ్స్ లో జరిగే కథనే కనుక, కెమెరా పనితనం గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కౌశిక్ క్రిష్ నేపథ్య సంగీతం కూడా ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. 

ఏదైతే మెయిన్ స్లాట్ తీసుకున్నాడో దానిని గురించి మాత్రమే దర్శకుడు చూపిస్తూ వెళ్లాడు. వినోదానికి సంబంధించిన మిగతా అంశాలను కథలో సర్దాలనే ఆలోచన చేయలేదు. అందువలన కథ సీరియస్ గా సాగుతూ వెళుతుంది. ఇటు యూత్ ను గానీ .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను గాని మెప్పించే కథ కాదు ఇది. థ్రిల్లర్ జోనర్ కథలను ఇష్టపడేవారు ఇటు వైపు ఒక లుక్  వేస్తే వేయవచ్చు. 

Trailer

More Reviews