'తెప్పసముద్రం' (ఆహా) మూవీ రివ్యూ!

Theppa Samudram

Movie Name: Theppa Samudram

Release Date: 2024-08-03
Cast: Chaitanya Rao, Arjun Ambati, Ravichankar, Kishori Dhahrak
Director:Sateesh Rapolu
Producer: Manjula - Raghavender
Music: Peddapalli Rohith
Banner: Srimani Entertainment
Rating: 2.00 out of 5
  • చైతన్యరావు నుంచి వచ్చిన 'తెప్పసముద్రం'
  • ఏప్రిల్ 19న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • ఆసక్తిని రేకెత్తించలేకపోయిన కథాకథనాలు
  • చప్పగా అనిపించే సన్నివేశాలు


చైతన్యరావు - అర్జున్ అంబటి ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'తెప్ప సముద్రం'. సతీశ్ రాపోలు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

'తెప్పసముద్రం' అనే గ్రామంలో లాయర్ విశ్వనాథ్ (రవి శంకర్) ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. అతని కొడుకు గణేశ్ (చైతన్యరావు) ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.గా ఉంటాడు. ఇక అదే ఊళ్లో విజయ్ (అర్జున్ అంబటి)  ఆటో నడుపుతూ జీవిస్తుంటాడు. అనాథ అయిన అతను ఆ ఊళ్లో అందరితోను కలుపుగోలుగా ఉంటూ ఉంటాడు. టౌనుకు వెళ్లి చదువుకునే ఆడపిల్లలు అతని ఆటోలోనే వెళుతుంటారు. 

ఇక ఆ ఊళ్లోనే 'గజా' అనే ఒక లోకల్ రౌడీ ఉంటాడు. అతను విజయ్ కి తెలియకుండా అతని ఆటోలోనే టౌనుకి గంజాయిని తరలిస్తూ ఉంటాడు. విజయ్ కేరక్టర్ గురించి తెలిసి ఉండటం వలన, పోలీసులు పెద్దగా పట్టించుకోరు. ఇక అదే గ్రామానికి చెందిన ఇందు (కిశోరి ధాత్రిక్)ను విజయ్ ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతనిని ఆరాధిస్తూ ఉంటుంది.      
 
15 ఏళ్లుగా 'తెప్పసముద్రం' గ్రామానికి చెందిన టీనేజ్ అమ్మాయిలు మిస్సవుతుంటారు. వాళ్లని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారనే విషయంపై గణేశ్ దృష్టిపెడతాడు. అతను తన తండ్రి విశ్వనాథం మొదలు అందరినీ అనుమానిస్తూనే ఉంటాడు .. తన ఎంక్వరీని కొనసాగిస్తూనే ఉంటాడు. అతనికి విజయ్ పై .. 'గజా' పై కూడా అనుమానం వస్తుంది. దాంతో వాళ్లపై కూడా ఒక కన్నేసి ఉంచుతాడు. 

తమ గ్రామానికి చెందిన టీనేజ్ అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారకులెవరన్నది కనిపెట్టే పనిలో అతను ఉండగానే, మరికొంతమంది అమ్మాయిలు మిస్సవుతారు. అదే సమయంలో విజయ్ తో గజా చేయిస్తున్న గంజాయి అక్రమ రవాణా వ్యవహారం బయటపడుతుంది. దాంతో అమ్మాయిలు కనిపించకుండా పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం ఉందని భావించిన గణేశ్ ఏం చేస్తాడు? అతను అనుమానం నిజమేనా? ఇందూతో విజయ్ పెళ్లి జరుగుతుందా? అనేది మిగతా కథ. 

దర్శకుడు సతీశ్ రాపోలు ఈ కథను తయారుచేసుకున్నాడు .. తక్కువ బడ్జెట్ లో విలేజ్ కి మాత్రమే పరిమితమైన కథను ఎంచుకున్నాడు. ఓ విలేజ్ కి చెందిన అమ్మాయిలు అదృశ్యం కావడానికి కారకులు ఎవరు అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ విషయంలో అసలు సూత్రధారులు ఎవరు? అనే విషయం వైపు నుంచి ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. 

ఈ కథలో ప్రధానమైనవిగా చైతన్యరావు -  అర్జున్ అంబటి - రవిశంకర్ - విలన్ గజా పాత్రలు కనిపిస్తాయి. ఈ నాలుగు పాత్రలను డిజైన్ చేసిన తీరు కూడా అసంతృప్తిని కలిగిస్తుంది. ఒక రకంగా చైతన్యరావు - అర్జున్ అంబటి పాత్రలు బెటర్ అనుకునేలా ఉంటాయి. చైతన్యరావుకి ఉన్న ఇమేజ్ కి ఆ పాత్రకి ఆయన అంతగా నప్పలేదేమో అనిపిస్తుంది. కథను బలంగా తయారు చేసుకోకపోవడం వలన, కథనం కూడా బలహీనంగానే అనిపిస్తుంది. అందుకు తగినట్టుగానే సన్నివేశాలు సో సో గా సాగిపోతూ ఉంటాయి. 

ఇక మధ్యలో అర్జున అంబటి 'కల' అంటూ సాగదీసిన ఎపిసోడ్ ఆడియన్స్ కి అసహనాన్ని కలిగిస్తుంది. తెరపై పాత్రలు మోసం చేసుకోవచ్చు .. కానీ ప్రేక్షకులు తెల్లముఖం వేసుకునేలా చేయకూడదు. ఇక 'కల'కి సంబంధించిన కథ .. కల మాదిరిగానే ఉండాలి తప్ప, సెకండాఫ్ అనుకునేలా ఉండకూడదు. పెద్ద పల్లి రోహిత్ అందించిన సంగీతం కూడా అంత ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించదు. శేఖర్ పోచారం పల్లి ఫొటోగ్రఫీ .. సాయిబాబు ఎడిటింగ్ ఓ మాదిరిగా  అనిపిస్తాయి,    

అసలు 'తెప్పసముద్రం' అనే టైటిల్ చూడగానే, ఆ టైటిల్ ను డిజైన్ చేసిన పోస్టర్ చూడగానే, ఇది సముద్రతీర ప్రాంతానికి చెందిన జాలరుల నేపథ్యంలో నడిచే కథనేమో అనిపిస్తుంది. కానీ తీరా కథలోకి వెళితే, ఇది విలేజ్ నేపథ్యంలో నడిచే కిడ్నాప్ డ్రామా. ఇక్కడే ఆడియన్స్ కొంత ఆలోచనలో పడతారు. 

క్లైమాక్స్ విషయంలో కూడా దర్శకుడు తడబడ్డాడు. కరెక్టుగా ప్లాన్ చేసుకుని ఉంటే నిజంగానే ఇది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే క్లైమాక్స్. ఇక కొత్త ఆర్టిస్టుల దగ్గర నుంచి సరిగ్గా తీసుకొని అవుట్ పుట్ ఇబ్బంది పెడుతుంది. లవ్ .. కామెడీ పాళ్లకు కాస్త ప్రాధాన్యత ఇచ్చి ఉంటే,  కథలో వినోదపరమైన అన్ని అంశాలు ఉండేలా చూసుకుని ఉంటే, రవిశంకర్ పాత్రను ఇంకాస్త ఉపయోగించుకుని ఉంటే బెటర్ గా ఉండేదేమోనని అనిపిస్తుంది. 

Trailer

More Reviews