'ఎలక్షన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Election

Movie Name: Election

Release Date: 2024-07-19
Cast: Vijay Kumar, Preethi Asrani, Richa Joshi, George Maryan, Dileepan
Director:Thamizh
Producer: Aditya
Music: Govind Vasantha
Banner: Reel Good Films
Rating: 2.50 out of 5
  • రాజకీయాల నేపథ్యంలో సాగే 'ఎలక్షన్'
  • మే 17న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేసే కంటెంట్ 
  • కీలకమైన పాత్రలో జార్జ్ మరియన్ 
  • వినోదపరమైన అంశాలకు దూరంగా నడిచే కథ     


ఎన్నికలు .. గ్రామీణ స్థాయిలో నడిచే రాజకీయాల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక కథాంశంతో వచ్చిన సినిమానే 'ఎలక్షన్'. తమిళంలో రూపొందిన ఈ సినిమా, ఈ ఏడాది మే 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. విజయ్ కుమార్ కథానాయకుడిగా డైరెక్టర్ తమిళ్ తెరకెక్కించిన ఈ సినిమా, రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

అది 'నల్లూరు' అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊళ్లో నల్ల శివమ్ ( జార్జ్ మరియన్) అతని స్నేహితుడు తణికాచలం ఇద్దరూ చాలాకాలంగా ఒకే పార్టీలో పనిచేస్తూ ఉంటారు. నల్ల శివమ్ కి ఉష అనే కూతురు .. నటరాజన్ ( విజయ్ కుమార్) అనే కొడుకు ఉంటారు. 'కని'తో ఉష వివాహం జరిగిపోతుంది. ఇక తణికాచలానికి సెల్వి (రిచా జోషి) అనే కూతురు .. సుధాకర్  (దిలీపన్) అనే కొడుకు ఉంటారు. 

నల్ల శివమ్ కొడుకు నటరాజన్ .. తణికాచలం కూతురు సెల్వి ప్రేమించుకుంటారు. ఈ ఇద్దరికీ పెళ్లి చేద్దామని ఇరు కుటుంబాలవారు అనుకుంటారు. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని రాజకీయపరమైన కారణాల వలన, ఆ రెండు కుటుంబాల యజమానుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. దాంతో తణికాచలం పట్టుబట్టి తన కూతురు సెల్వికి వేరే ప్రాంతానికి చెందిన కుర్రాడితో పెళ్లి జరిపిస్తాడు. ఆ తరువాత కొంతకాలానికి నటరాజన్ వివాహం హేమ (ప్రీతి అస్రాని)తో జరుగుతుంది. ఈ లోగా తణికాచలం పక్షవాతంతో మంచాన పడతాడు. 

రాజకీయంగా తన తండ్రి మంచితనాన్ని ఉపయోగించుకుని త్యాగి వంటివారు ఎదుగుతున్నారని భావించిన నటరాజన్, ఈ సారి పంచాయతీ ఎన్నికలలో తానే నిలబడాలని నిర్ణయించుకుంటాడు. అందుకు ఆయన బావ 'కని' ఎంతో అండగా నిలబడతాడు. ఈ విషయంలో నటరాజన్ ను భాయ్ ఎంతో సపోర్ట్ చేస్తాడు. త్యాగి కొడుకు మూర్తి కూడా బరిలోకి దిగుతాడు. అయితే నటరాజన్ తో పాటు మూర్తి కూడా ఓడిపోతాడు. ఎన్నికల వలన నటరాజన్ కి 10 లక్షల అప్పు మాత్రం మిగిలిపోతుంది. అదే సమయంలో ఆయన భాయ్ ను కూడా కోల్పోతాడు. 

మరో ఐదేళ్ల తరువాత ఎలక్షన్స్ వస్తాయి. ఈ సారి పంచాయితీ ఎన్నికలలో హేమను నిలబెట్టమని  నటరాజన్ తో సుధాకర్ చెబుతాడు. అందుకు తన సపోర్టు ఉంటుందని అంటాడు. ఆ తరువాత సుధాకర్ తన భార్యతో నామినేషన్ వేయిస్తాడు. ఒక వైపున తమని ఎగదోసి .. మరో వైపున భార్యతో సుధాకర్ నామినేషన్ వేయించడం నటరాజన్ వాళ్లకి అనుమానాన్ని కలిగిస్తుంది. దాంతో ఈ విషయంపై వాళ్లు సుధాకర్ ను నిలదీస్తారు. 

అప్పుడు సుధాకర్ ఏం చెబుతాడు? అతను నటరాజన్ పై పగబట్టడానికి కారణం ఏమిటి? భాయ్ ను చంపించింది ఎవరు? నటరాజన్ ను గెలిపించడానికి 'కని' ఏం చేస్తాడు? ఫలితంగా ఏం జరుగుతుంది? పంచాయితీ ఎన్నికలలో నిలబడినవారిలో గెలుపు ఎవరిది? అనేది మిగతా కథ. 

ఈ కథ అంతా కూడా ఒక గ్రామంలో చోటుచేసుకునే పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతుంది. గ్రామాల్లో సహజంగా కనిపించే గ్రూపు రాజకీయాలు .. కుల రాజకీయాలు .. డబ్బు చూపించే ప్రభావం .. వారసత్వ రాజకీయాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం జరగడం .. డబ్బున్న వారికే ప్రాధాన్యతను ఇవ్వడం .. పగ ..  ప్రతీకారాలు వంటి అంశాలను కూడా దర్శకుడు చూపించాడు.

నిజానికి ఇది చాలా చిన్న సినిమా. తక్కువ బడ్జెట్ లో స్టార్స్ లేకుండా చేసిన సినిమా. లవ్ .. రొమాన్స్ .. కామెడీ వంటి వినోదభరితమైన అంశాలు లేని సినిమా. కేవలం రాజకీయ పరమైన అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాజకీయాలతో ముడిపడిన మూడు కుటుంబాల వైపు నుంచి ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది. అందువలన కథ కనెక్ట్ అవుతూ ఉంటుంది.

మహేంద్రన్ జయరాజు ఫొటోగ్రఫీ .. గోవింద్ వసంత నేపథ్య సంగీతం .. ప్రేమ్ కుమార్ ఎడిటింగ్ ఈ కథకు బలమైన సపోర్టును ఇచ్చాయి. చిన్నసినిమానే అయినా, ప్రేక్షకులను కూడా గ్రామస్తులలో భాగం చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అధికారం కోసమే ఈ గొడవంతా జరుగుతుందని అనుకుంటూ ఉండగా వచ్చే ట్విస్ట్, ఎమోషనల్ గా టచ్ అవుతుంది. రాజకీయాల నేపథ్యంతో కూడిన కంటెంట్ ను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

Trailer

More Reviews