'నాగేంద్రన్స్ హనీమూన్స్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

Nagendrans Honeymoons

Movie Name: Nagendrans Honeymoons

Release Date: 2024-07-19
Cast: Suraj Venjaramoodu, Grace Antony, Shwetha Menon, Kani Kusruti, Alphy Panjikaran, Ammu Abhirami, Alexander Prasanth
Director:Nithin Renji Panicker
Producer: Nithin Renji Panicker
Music: Ranjin Raj
Banner: Nithin Ranji Panicker productions
Rating: 3.00 out of 5
  • సూరజ్ హీరోగా 'నాగేంద్రన్స్ హనీమూన్స్'
  • 6 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చిన సిరీస్
  • ఆసక్తికరమైన కథాకథనాలు 
  • వినోదభరితమైన సన్నివేశాలు 
  • హైలైట్ గా నిలిచే క్లైమాక్స్ ట్విస్ట్

మలయాళంలో సూరజ్ వెంజరమూడుకి మంచి ఇమేజ్ ఉంది. 2001 నుంచి నటుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలాంటి ఆయన మొదటిసారిగా చేసిన వెబ్ సిరీస్ 'నాగేంద్రన్స్ హనీమూన్స్'. 'ఒక జీవితం .. ఐదుగురు భార్యలు' అనేది ఉవశీర్షిక. డార్క్ కామెడీ జోనర్లో 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్, ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
 
1980లలో నడిచే కథ ఇది. నాగేంద్రన్ (సూరజ్)  .. ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడు. తల్లి కాస్త గయ్యాళి .. అందువల్లనే తండ్రి దేశాలపైకి వెళ్లిపోయాడనేది అతని అభిప్రాయం. అతను మహా బద్ధకస్తుడు .. సోమరితనానికి కేరాఫ్ అడ్రస్ గా కనిపిస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకుంటే భార్యను పోషించాలి .. భార్యను పోషించాలంటే ఏదైనా పని చేయాలి .. పని చేయడమంటే పాపం చేయడం వంటిది అన్నట్టుగా అతను భయపడిపోతుంటాడు. అందువల్లనే 40 ఏళ్లు దాటినా పెళ్లి గురించిన ఆలోచన చేయడు. 

ఆ ఊళ్లో అతని స్నేహితుడు సోమన్  (అలగ్జాండర్ ప్రశాంత్). అతనితోనే నాగేంద్రన్ ఎక్కువగా తిరుగుతుంటాడు. ఒకసారి కువైట్ నుంచి నాగేంద్రన్ స్నేహితుడు పౌలోస్ (రమేశ్) వస్తాడు. అతని స్టైల్ .. ఆ ఊళ్లో అతనికున్న క్రేజ్ చూసిన తరువాత తాను కూడా కువైట్ వెళ్లాలని అనుకుంటాడు. అక్కడైతే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనేది అతని ఆలోచన. కొంత డబ్బు సమకూర్చుకోమనీ, తాను కువైట్ కి పంపిస్తానని పౌలోస్ మాట ఇస్తాడు.

జానకి (ఆల్ఫీ)ని పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందనీ, ఆ కట్నం డబ్బుతో కువైట్ కి వెళ్లిపొమ్మని సోమన్ సలహా ఇస్తాడు. తిరిగిరావడం ఇష్టం లేకపోతే అక్కడే ఉండిపొమ్మని అంటాడు. దాంతో జానకి మెడలో నాగేంద్రన్ తాళి కడతాడు. కానీ పెళ్లికి ముందే వాళ్లు కట్నం ఇవ్వలేమని తన తల్లికి చెప్పారనీ, ఆ విషయాన్ని తల్లి తన దగ్గర దాచిందని తెలిసి నివ్వెరపోతాడు. మరేం ఫరవాలేదనీ, తనకి తెలిసిన ఒక సంబంధం ఉందని చెప్పి, నాగేంద్రన్ వేరే ఊరుకు తీసుకుని వెళతాడు సోమన్.           

లిల్లీ కుట్టి (గ్రేస్ ఆంటోని) తండ్రి మంచంలో ఉంటాడు. ఆమె అన్నయ్య వదినలపై ఆమె పెళ్లి బాధ్యత ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆస్తిపాస్తులు వస్తాయని చెప్పి, జోసఫ్ పేరుతో వాళ్లకి నాగేంద్రన్ ను సోమన్ పరిచయం చేస్తాడు. ఆ అమ్మాయికి కాస్త పిచ్చి ఉందని గ్రహించిన అతను, ఆ పెళ్లికి నిరాకరించగా, సోమన్ ఒప్పిస్తాడు. లిల్లీ కుట్టి పేరుపై ఆస్తిపాస్తులున్నా, అవి ఇప్పట్లో రావనే విషయం అర్థమైపోవడంతో అక్కడి నుంచి నాగేంద్రన్ తెలివిగా బయటపడతాడు. 

ఆ తరువాత నాగేంద్రన్ ను సోమన్ మరో ప్రాంతానికి తీసుకుని వెళ్లి అక్కడ అతని పేరును అలీ హుస్సేన్ గా మారుస్తాడు. 3 కాసుల బంగారం .. 2 వేలు ఇస్తారని చెప్పి సామూహిక వివాహాల వరుసలో కూర్చోబెడతాడు. అలా అక్కడ లైలా సుల్తానా (శ్వేతా మీనన్)తో అతని వివాహం జరుగుతుంది. అయితే ఆ బంగారు కాసులు .. డబ్బు లైలా తీసుకుని తన దగ్గర దాచిపెడుతుంది. తనకి ఆల్రెడీ పెళ్లి అయిందనీ, తన భర్త తనని మోసం చేయడానికి ప్రయత్నిస్తే తానే చంపేశానని ఫస్టు నైట్ రోజున లైలా చెబుతుంది. 

తనకి ఆల్రెడీ మూడు పెళ్లిళ్లు అయ్యాయని తెలిస్తే లైలా తనని కూడా చంపేస్తుందని భయపడిన నాగేంద్రన్, ఆమె నుంచి ఆ బంగారు కాసులు దక్కించుకుని బయటపడాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతనికి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? ఆ తరువాత గోవిందన్ పేరుతో సావిత్రి జీవితంలోకి .. సుకుమారన్ పేరుతో 'తంగం' జీవితంలోకి అతను ఎలా అడుగుపెడతాడు? అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? చివరికి అతను కువైట్ కి వెళతాడా లేదా? అనేది మిగతా కథ. 
     
జీవితంలో అసలు పెళ్లే చేసుకోకూడదు .. భార్యను పోషించడం కోసం కష్టపడటం తన వలన కాదని అనుకున్న ఒక బద్ధకస్తుడు, కట్నం కోసం ఐదు పెళ్లిళ్లు చేసుకోవలసి వస్తుంది. అందుకు దారితీసిన పరిస్థితులు .. ఆ పెళ్లిళ్ల నేపథ్యాలు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథను దర్శకుడు నితిన్ రెంజి పనికర్ చాలా వినోదభరితంగా .. ఆసక్తికరంగా తయారు చేసుకున్నాడు. ప్రతి పెళ్లికూతురుకి ఒక లోపాన్ని సెట్ చేస్తూ ఆ వైపు నుంచి కూడా కామెడీ టచ్ ఇచ్చాడు. 

చివర్లో రెండు ట్విస్టులు వస్తాయి .. ఆ రెండు ట్విస్టులు ఈ కథకి మరింత బలాన్ని చేకూరుస్తాయి. నిఖిల్ ప్రవీణ్ ఫొటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్స్ ఈ కథకు మరింత ఆహ్లాదాన్ని అందిస్తాయి. రంజిన్ రాజ్ అందించిన నేపథ్య సంగీతం, ఈ కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మన్సూర్ ఎడిటింగ్ కూడా ఓకే. కథనం సాగే విధానం కాస్త నిదానంగా అనిపించినప్పటికీ, చాలా తక్కువ బడ్జెట్ లో సహజత్వానికి దగ్గరగా సాగిపోయే ఈ వెబ్ సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 


Trailer

More Reviews