'లవ్ మౌళి' (ఆహా) మూవీ రివ్యూ!

Love Mouli

Movie Name: Love Mouli

Release Date: 2024-06-27
Cast: Navadeep, Pankhuri Gidwani, Bhavana Sagi, Mirchi Hemanth, Mirchi Kiran
Director:Avaneendra
Producer: C Space
Music: Govind Vasanth
Banner: C space Productions
Rating: 2.00 out of 5
  • నవదీప్ హీరోగా రూపొందిన 'లవ్ మౌళి'
  • జూన్ 7 న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఆహాలో అందుబాటులో ఉన్న కంటెంట్
  • ఆసక్తికరంగా లేని కథాకథనాలు

నవదీప్ హీరోగా తెరపై కనిపించి చాలాకాలమైంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. అలాంటి ఆయన హీరోగా రూపొందిన 'లవ్ మౌళి' సినిమా, జూన్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 27వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
 
మౌళి (నవదీప్) చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమవుతాడు. ఊరికి దూరంగా తన తాతయ్య దగ్గర పెరుగుతాడు. తన 14వ ఏటన తాతయ్యను కూడా కోల్పోతాడు. అప్పటి నుంచి ఒంటరితనానికి అలవాటు పడతాడు. మనుషులంటే నచ్చనిస్థాయికి వెళ్లిపోతాడు. తన మనసులోని భావాలకు దృశ్యరూపాన్నిఇస్తూ ఆర్టిస్ట్ అవుతాడు. తన పెయింటింగ్స్ అమ్మడం వలన వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉంటాడు. 

మనుషుల మధ్య ప్రేమ అనేది ఉండదు. కామానికి కొంతమంది పెట్టుకున్న పేరే ప్రేమ అనేది మౌళి అభిప్రాయం. అందువలన అతనితో ఎవరూ కూడా ఎక్కువ రోజుల పాటు రిలేషన్ కొనసాగించలేకపోతారు. అది తన తప్పా .. అవతలివారి తప్పా అనేది మౌళి తేల్చుకోలేక పోతుంటాడు. అదే సమయంలో అతనికి ఓ అఘోర (రానా) తారస పడతాడు. ప్రేమ విషయంలో మౌళికి ఉన్న అయోమయాన్ని తొలగించడానికి ఆయన ఒక మేజిక్ కుంచెను మౌళి దగ్గర వదిలేసి వెళతాడు. 

ఆ కుంచెతో ఒక అందమైన అమ్మాయి చిత్రాన్ని గీసి, అలాంటి అమ్మాయి తనని ప్రేమించాలని కోరుకుంటాడు. దాంతో ఆ చిత్రంలోని అమ్మాయి రూపం ప్రాణం పోసుకుని అందులో నుంచి బయటికి వస్తుంది. ఆ యువతికి 'చిత్ర' అనే పేరు పెట్టి, ఆమెతో అతను హ్యాపీగా ఉండటం మొదలుపెడతాడు. కొన్ని రోజులు పోయిన తరువాత ఇద్దరి మధ్య మాట పట్టింపు వస్తుంది. 

తనకి ఎదురు తిరిగేవారు కాకుండా, ప్రతి చిన్న విషయానికి తనపై ఆధారపడే అమ్మాయి కావాలంటూ మరో చిత్రాన్ని గీస్తాడు. ఆ యువతి ప్రాణం పోసుకుని బయటికి వస్తుంది. తానే అన్ని పనులు చేసుకోవలసి రావడంతో మౌళి విసిగిపోతాడు. సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండి, తనని కేరింగ్ గా చూసుకునే అమ్మాయి కావాలంటూ మరో చిత్రాన్ని గీస్తాడు. ఎప్పటి లానే మరో యువతి ప్రాణం పోసుకుని వస్తుంది. 

మూడో యువతి కారణంగా మౌళికి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? ఆమె వలన ఆయన జీవితంలో ఎలాంటి మార్పు సంభవిస్తుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? చివరికి అతను తన తప్పు తెలుసుకుంటాడా లేదా? అనేది కథ. 

ఒక రచయిత రాసిన కథలోని పాత్రలు అందులో నుంచి బయటికి వచ్చి అతని జీవితాన్ని ప్రభావితం చేయడం .. ఒక ఆర్టిస్టు గీసిన చిత్రాలలో ఏవైతే దృశ్యాలు ఉంటాయో .. అవే ఆ తరువాత జరగడం వంటి కథలు గతంలో వచ్చాయి. అలాంటి ఒక కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే 'లవ్ మౌళి'. తనకి కావలసిన అమ్మాయి ఎలా ఉండాలనేది మనసులో అనుకుని, ఆమెను అలాగే డిజైన్ చేసుకుని తెచ్చుకునే ఒక ఆర్టిస్ట్ కథ ఇది. 

మనుషులకు .. మావన సంబంధాలకు దూరంగా పెరిగిన ఒక యువకుడు ఎలా తయారవుతాడు? ఏది మంచో .. ఏది చెడో చెప్పేవారు లేకపోతే ఎలా పెరుగుతాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అనేది చెప్పే కథ ఇది. లైన్ గా చూసుకుంటే ఈ కథ కొత్తగానే అనిపిస్తుంది. కానీ తెరపైకి ఈ కంటెంట్ కరెక్ట్ రూట్లో రాలేదేమో అనిపిస్తుంది. తనకంటూ ఒక సెటప్ ఏర్పాటు చేసుకున్న ఒక ఆర్టిస్ట్ కీ .. తనకి కావలసినవి బయట ప్రపంచంలోకి వెళ్లి తెచ్చుకునే యువకుడికి తన ఒంటిపై ధ్యాస లేకపోవడం చిత్రంగా అనిపిస్తుంది. 

ఇక మౌళికి అఘోర తారస పడటం సహజత్వానికి చాలా దూరంగా కనిపిస్తుంది. ఇదే కథను మలుపుతిప్పే సన్నివేశం. అయినా ఎక్కడా ఆ ఎఫెక్ట్ కనబడదు. అంతా నాటకీయంగా అనిపిస్తుంది. హీరోకి ఎవరితోనూ మంచి సంబంధాలు ఉండవు. అయినా వాళ్లంతా కలిసి ఒక ఆర్టిస్టుగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉండటం విచిత్రం. ఇక ఆర్టిస్టు గీసిన బొమ్మలో నుంచి అప్పుడే కాలు బయటికి పెట్టిన హీరోయిన్స్, ఆ వెంటనే పూజ చేయడం .. వంట చేయడం .. బుల్లెట్ నడపడం మరో విచిత్రం. 

హీరోలో తరువాత ఎప్పటికో రావలసిన మార్పును ఒక రేంజ్ లో చూపించడం కోసం, ముందు నుంచే అతనికి ఎంతమాత్రం నప్పని హెయిర్ స్టైల్ ను సెట్ చేయడం అతనికి ఎంత ఇబ్బందిని కలిగించిందోగానీ, చూసేవారికి మాత్రం చిరాకు పుడుతుంది. ఫస్టు సీన్ లోనే హీరో స్వభావాన్ని దర్శకుడు పతాకస్థాయిలో చూపించి, ఆ కేరక్టర్ గురించి ప్రేక్షకుడు రెండో ఆలోచన చేయకుండా సైలెంట్ గా ఉండేలా చూశాడు. గోవింద్ వసంత్ నేపథ్య సంగీతం .. కెమెరా పనితనం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ఊరికి దూరంగా ఓ నాలుగైదు పాత్రల మధ్య డిజైన్ చేసిన కథ ఇది. హీరో .. హీరోయిన్, అప్పుడప్పుడు వాళ్లను పలకరించే మరో జంట .. హీరో మాజీ లవర్. వీళ్లతోనే కథను నడిపించారు. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా లిప్ లాకులు ఉంటే సరిపోతుందని అనుకున్నారేమో, డైలాగుల కంటే అవే ఎక్కువగా ఉన్నాయి. ఏ మాత్రం కొత్తదనంగానీ .. ఆసక్తికరంగా గాని లేని కంటెంట్ ఇది. ఇక టైటిల్ విషయంలో కూడా మేకర్స్ ఆలోచన చేసి ఉంటే బాగుండేదేమో. 

Trailer

More Reviews