'సత్యభామ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Sathyabhama

Movie Name: Sathyabhama

Release Date: 2024-06-28
Cast: Kajal Aggarwal, Naveen Chandra, Prakash Raj, Nagineedu, Harsha Vardhan,Ravi Varma
Director:Suman Chikkala
Producer: Sashi Kiran Tikka - Bobby Tikka
Music: Sricharan Pakala
Banner: Aurum Arts
Rating: 2.00 out of 5
  • కాజల్ ప్రధాన పాత్రగా 'సత్యభామ'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • పాత్రకి తగినట్టుగా లేని కాజల్ బాడీ లాంగ్వేజ్
  • బలమైన విలనిజం లేకపోవడమే బలహీనత 

కాజల్ ప్రధానమైన పాత్రగా 'సత్యభామ' సినిమాను దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కించాడు. పోలీస్ ఆఫీసర్ గా కాజల్ నటించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను థియేటర్ల నుంచి రాబట్టుకోలేకపోయిన ఈ సినిమా, నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

సత్యభామ (కాజల్) హైదరాబాదులో షీ టీమ్ - పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటుంది. తన పరిధిలోని కేసులను ఆమె ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆమె భర్త అమరేంద్ర (నవీన్ చంద్ర). ఆమె వైవాహిక జీవితం సంతోషకరంగా సాగిపోతూ ఉంటుంది. ఒక రోజున ఆమె దగ్గరికి హసీనా అనే యువతి తన తమ్ముడు ఇక్బాల్ తో కలిసి వస్తుంది. తన భర్త 'యదూ' తనని కొంతకాలంగా హింసిస్తున్నాడని చెబుతుంది. అతనిపై యాక్షన్ తీసుకోవడానికి సత్యభామ సిద్ధమవుతుంది. 

ఆ రోజు రాత్రి హసీనా తనభర్త చేతిలో చనిపోతుంది. ఆమెను కాపాడటానికి సత్యభామ చేసిన ప్రయత్నం ఫలించకుండా పోతుంది. దాంతో ఆమె హసీనా భర్త 'యదూ' ఆచూకీని తెలుసుకునే పనిలో పడుతుంది. కొన్ని రోజులుగా ఇక్బాల్ కనిపించకపోవడంతో, అతని గురించి కూడా గాలించడం మొదలుపెడుతుంది. అతను తీవ్రవాదులతో చేతులు కలిపాడని తెలుసుకుని నివ్వెరపోతుంది. 

ఇక్బాల్ కనిపించకుండా పోవడానికి కారణం రిషి అనీ, అతను ఓ రాజకీయనాయకుడికి బంధువని సత్యభామకి తెలుస్తుంది. సత్యభామ భామను సపోర్టు చేస్తూ ఆమె పైఅధికారిగా జోసెఫ్ (ప్రకాశ్ రాజ్) ఉంటాడు. అయితే రిషి వెనుక డీసీపీ ఆనందరావు (హర్షవర్ధన్) ఉంటాడు. అందువలన రిషి నుంచి విషయం రాబట్టడం ఎలా అనే విషయాన్ని గురించి సత్యభామ ఆలోచన చేస్తుంది.

ఇక్బాల్ కీ .. రిషికి మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది? ఇక్బాల్ ను అతను ఎందుకు తనకారులో తీసుకుని వెళ్లి ఉంటాడు? ఎక్కడికి తీసుకుని వెళ్లి ఉంటాడు. అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? అనే సందేహాలు సత్యభంలో తలెత్తుతాయి. అప్పుడు ఆమెకి 'దివ్య' గుర్తుకువస్తుంది. ఇక్బాల్ కి దివ్య అనే స్నేహితురాలు ఉంటుంది. ఆమె రిషితో కూడా సన్నిహితంగా ఉంటుంది. అందువలన ఏం జరిగిందని దివ్యను అడుగుతుంది. 

అప్పుడు దివ్య ఏం చెబుతుంది? ఇక్బాల్ ను ఎవరు కిడ్నాప్ చేస్తారు. హసీనా భర్త ఏమైపోయాడు? ఈ కేసు విషయంలో సత్యభామకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేస్తుంది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. 

 సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో .. వాటితో ముడిపడిన ఇన్వెస్టిగేటివ్ కథల్లో ఒకరకమైన హడావిడి కనిపించాలి .. స్పీడ్ కనిపించాలి. తెరపై కథ పరిగెడుతూ ఉండాలి .. ఆ కథను ఆడియన్స్ ఆత్రుతగా ఫాలో అవుతూ ఉండాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ ఆడిటోరియంలో కనిపించాలి. అలాంటి ఉత్కంఠ రేకెత్తించలేకపోయిన కథ ఇది. అనూహ్యమైన మలుపులను ఆవిష్కరించలేకపోయిన కథనం ఇది.

ఈ కథకి కాజల్ పాత్రనే ప్రధానమనే సంగతి టైటిల్ తోనే అర్థమవుతుంది. అలాంటి పాత్రను డిజైన్ చేసే విషయంలో చాలా కసరత్తు జరగాలి. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా .. ఫోర్స్ గా తీర్చిదిద్దాలి. కానీ అందుకు ఆమె పాత్ర చాలా దూరంగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో కూడా ఆ పాత్ర అవసరమైనంత దూకుడు చూపించలేకపోయింది. కాజల్ ఇంతవరకూ సాఫ్ట్ రోల్స్ .. గ్లామరస్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చింది. అందువలన పోలీస్ ఆఫీసర్ పాత్రకి తగిన బాడీ లాంగ్వేజ్ ను ఆమె చూపించలేకపోయింది. 

ఇక ఈ కథలో ప్రధానమైన పాత్ర అయిన సత్యభామను సవాల్ చేసే పాత్రలు ఏవైపు నుంచి కూడా కనిపించవు. ఇటు డిపార్టుమెంటు నుంచి .. అటు రాజకీయనాయకుల నుంచి .. నేరస్థుల నుంచి ఆమెతో తలపడే బలవంతులెవరూ కనిపించరు. ఇక ఈ కేసును పరిష్కరించే తీరు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఒకదాని తరువాత ఒకటిగా సన్నివేశాలు సాగిపోతూ ఉంటాయి అంతే. 

కాజల్ పాత్రను మినహా మరే పాత్రను బలంగా డిజైన్ చేయకపోవడం మరో లోపంగా కనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ .. నాగినీడు .. నవీన్ చంద్ర వంటి ఆర్టిస్టుల పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. విష్ణు బేసి కెమెరా పనితనం .. శ్రీచరణ్ పాకాల సంగీతం .. పవన్ కల్యాణ్ ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి. కథలో బలం లేకపోవడం .. పాత్రల్లో పవర్ లేకపోవడం వలన ఇది ఓ సాదాసీదా కంటెంట్ అనిపించుకుంటుంది అంతే. 

Trailer

More Reviews