'ట్రిగ్గర్ వార్నింగ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Trigger Warning

Movie Name: Trigger Warning

Release Date: 2024-06-21
Cast: Jessica Alba, Anthony Michael Hall ,Mark Webber ,Jake Weary ,Tone Bell
Director:Mouly Surya
Producer: Basil Iwanyk
Music: Enis Rotthoff
Banner: Thunder Road Films
Rating: 2.50 out of 5
  • జెస్సికా ఆల్బా ప్రధాన పాత్రగా 'ట్రిగ్గర్ వార్నింగ్'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • రొటీన్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా 
  • టైటిల్ కి తగిన స్థాయిలో కనిపించని కంటెంట్   
       

జెస్సికా ఆల్బా ప్రధానమైన పాత్రను పోషించిన 'ట్రిగ్గర్ వార్నింగ్', ఈ నెల 21వ తేదీన నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. మౌలి సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ గా పార్కర్ కాల్వో ( జెస్సికా ఆల్బా) పనిచేస్తూ ఉంటుంది. ఆమెతో కలిసి అదే టీమ్ లో స్పైడర్ ( టోన్ బెల్) వర్క్ చేస్తూ ఉంటాడు .. అతను హ్యాకర్ కూడా. టెర్రరిస్టులను పట్టుకునే ఒక ఆపరేషన్ ను ఆమె సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తుంది.  అదే సమయంలో తన తండ్రి హ్యారీ (అలెజాండ్రో డివోయోస్) చనిపోయాడనే విషయం ఆమెకి తెలుస్తుంది. దాంతో ఆమె తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించడం కోసం సొంత ఊరుకు బయల్దేరుతుంది.

హ్యారీ తన ఊళ్లో 'బార్' నిర్వహిస్తూ ఉంటాడు. మిగతా సమయంలో ఎక్కువభాగం అతను ఒక 'గుహ'లో ఉంటూ ఉంటాడు. అతనితో సన్నిహితంగా ఉండేవారికి కూడా అతను ఆ గుహలో ఏం చేస్తున్నాడనేది ఎవరికీ తెలియదు. ఆ గుహలోనే అతని డెడ్ బాడీ దొరకడం పార్కర్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హ్యారీతో ఎక్కువ చనువు ఉన్న మైక్ ను కలుసుకుంటుంది. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మైక్ తో కలిసి తన తండ్రి డెడ్ బాడీ దొరికిన ప్రదేశానికి వెళుతుంది. ఆ గుహ .. అక్కడి వాతావరణం చూసిన ఆమెకి, తన తండ్రి ప్రమాదవశాత్తు మరణించడం .. ఆత్మహత్య చేసుకోవడం జరగలేదని గ్రహిస్తుంది. ఏదో జరిగింది .. అదేమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆ 'బార్' కి ఎల్విస్ (జేక్) వస్తాడు. అతని బృందం దగ్గర మిలట్రీవారికి సంబంధించిన ఆయుధాలు ఉండటం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఎల్విస్ ఎవరో కాదు .. పార్కర్ ఎంతగానో ప్రేమిస్తున్న షరీఫ్ జెస్సీ (మార్క్ వెబర్) కి సొంత తమ్ముడు. అయినా వదలకుండా, అతనికి ఆర్మీకి సంబంధించిన ఆయుధాలు ఎలా అందుతున్నాయి? తన తండ్రి మరణానికి కారకులు ఎవరు? అనేది తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ ప్రయత్నంలోనే తన తండ్రి వెబ్ పేజీ లింక్ ఆమెకి దొరుకుతుంది.

అయితే తండ్రి పాస్ వర్డ్ ఏమిటనేది పార్కర్ కి తెలియదు. దాంతో ఆమె ఆ లింక్ ను స్పైడర్ కి పంపిస్తుంది. అతను ఆ పాస్ వర్డ్ ఏమిటనేది తెలుసుకుని ఆ లింక్ ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న విషయం ఏమిటి? అది తెలుసుకున్న పార్కర్ ఏం చేస్తుంది? ఆమె తండ్రిని ఎవరు ఎందుకోసం చంపారు? వాళ్లపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? అనేది కథ. 

ఒక్క మాటలో చెప్పాలంటే తన తండ్రిని చంపినవారు ఎవరనేది తెలుసుకుని, ప్రతీకారం తీర్చుకునే ఒక కూతురి కథ ఇది. లైన్ గా చెప్పుకుంటే ఇది చాలా సింపుల్ గానే అనిపిస్తుంది. కానీ ట్రీట్మెంట్ హాలీవుడ్ స్థాయిలోనే ఉంటుంది. కాకపోతే కొత్తదనంలేని కథగానే ఆనిస్తూ ఉంటుంది. రొటీన్ కంటెంట్ గానే కనిపిస్తూ ఉంటుంది. 

ఈ కథ ఒక రేంజ్ ఛేజింగ్ సీన్ తో మొదలవుతుంది. ఆ తరువాత ఒక చిన్న ప్రాంతానికి పరిమితమవుతుంది. క్లైమాక్స్ ఒక గుహలో జరుగుతుంది. హాలీవుడ్ మూవీ కనుక యాక్షన్ సీక్వెన్స్  ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. అయితే వాటిలో కూడా చాలావరకూ గన్స్ పైనే ఆధారపడ్డారు. అందువలన కళ్లు పెద్దవి చేసి చూసేంతగా ఏమీ ఉండదు. అలాగే 'ఔరా' అనిపించేంత ట్విస్టులు కూడా ఏమీ ఉండవు. 

హాలీవుడ్ సినిమా కనుక రొమాన్స్ పాళ్లు కాస్త ఎక్కువగా ఉండొచ్చునని అనుకోవడం సహజం. కానీ అలా ఇబ్బంది పెట్టే సీన్స్ లేవు. అక్కడక్కడా లొకేషన్స్ బాగున్నాయనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఎడిటింగ్ ఓకే. టైటిల్ కి తగినట్టుగా టెన్షన్ పెట్టేసే కంటెంట్ లేని కథ ఇది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారికి యావరేజ్ గా అనిపించవచ్చునేమో.

More Reviews