'దిల్ దోస్తీ డైలమా' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Dil Dosti Dilemma

Movie Name: Dil Dosti Dilemma

Release Date: 2024-06-25
Cast: Anushka Sen, Shruti Seth, Khalid Siddiqui, Shishir Sharma, Tanvi Azmi, Revathi Pillai
Director:Debbie Rao
Producer: Jahanara Bhargava
Music: Sid Paul
Banner: -
Rating: 3.00 out of 5
  • తెలుగు వెర్షన్ లో వచ్చిన 'దిల్ దోస్తీ డైలమా'
  • రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్లో నడిచే కథ 
  • ప్రేమకథలను అనేక కోణాల్లో టచ్ చేసిన దర్శకుడు 
  • ప్రధానమైన బలంగా నిలిచే స్క్రీన్ ప్లే
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్     


ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఎక్కువగా థ్రిల్లర్ నేపథ్యంలో కథలు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క సేన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్ కి, డెబ్బీ రావు దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 25వ తేదీన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లోకి అడుగుపెట్టింది. రీసెంటుగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. 7 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ బెంగుళూర్ నేపథ్యంలో జరుగుతుంది. అస్మార (అనుష్క సేన్) శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువతి. ఆమెలో ఆధునిక పోకడలు ఎక్కువ. తల్లి .. తండ్రి .. ఓ సోదరుడు .. ఇదీ ఆమె కుటుంబం. ఆమె సోదరుడు కెనడాలో ఉంటాడు. అక్కడికి వెళ్లడానికి ఆ కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన తానియా (ఎలీషా) నైనా (రేవతి పిళ్లై)కి తాను కెనడా వెళుతున్నానని అస్మార చెబుతుంది. 

అలాంటి పరిస్థితుల్లోనే అస్మారను చూడటానికి ఆమె నాయనమ్మ ఫరీదా (తన్వీ అజ్మీ) వస్తుంది. ఆమె తన నాయనమ్మ అనే విషయాన్ని ఫ్రెండ్స్ కి చెప్పకుండా, తమ ఫ్యామిలీకి దగ్గర అని అంటుంది. ఆ మాటకి ఫరీదా నొచ్చుకుంటుంది. ఈ విషయం తెలిసి, అస్మారపై ఆమె తల్లి కోప్పడుతుంది.  తాము కెనడా వెళ్లి వచ్చేవరకూ నాయనమ్మ ఇంట్లో ఉండమనీ, అలా చేయడం వలన బంధాలు - బంధుత్వాల విలువ ఆమెకి తెలుస్తుందని అంటుంది. 

ఫరీదా ఇల్లు ఒక స్లమ్ ఏరియాలో ఉంటుంది. అక్కడ అస్మారను వదిలేసి పేరెంట్స్ కెనడా వెళ్లిపోతారు. ఆ మురికివాడలో .. ఇరుకు సందుల్లో .. ఏసీ లేని పాత ఇంట్లో ఉండటం తన వలన కాదని అస్మార అనుకుంటుంది. స్నేహితులకు మాత్రం తాను కెనడా వెళుతున్నాననే చెబుతుంది. అస్మార ప్రవర్తన ఆమె నాయనమ్మ - తాతయ్యలకు ఒక పట్టాన అర్థం కాదు. అయినా వారే సర్దుకుపోతుంటారు. 

ఆ ఏరియాను ఖాళీ చేయించి ఒక బిల్డర్ పెద్ద భవనాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడనే విషయం అస్మారకి తెలుస్తుంది.   ఆవిషయంలో అందరూ ఆందోళన చెందుతున్నారని ఆమెకి అర్థమవుతుంది. అదే సమయంలో ఆమె ఫర్జాన్ (కుశ్ జోత్వాని)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఫర్జాన్ చెల్లెలు రుక్సానా (వైశాఖ పాండే) ఆ పక్కింట్లో అద్దెకి ఉండే సోహెల్ (రితిక్)ను ప్రేమిస్తుందని గ్రహిస్తుంది. 

అస్మార ఫ్రెండ్స్ లో ఒకరైనా నైనా, అమ్రాన్ తోను .. తానియా, ధృవ్ తోను ప్రేమలో పడతారు. ఒక వైపున వారి ప్రేమ వ్యవహారం, మరో వైపున అస్మార ప్రేమకథ నడుస్తూ ఉంటాయి. ఫర్జాన్ పై మనసు పారేసుకున్న అస్మార, అతని నాయనమ్మ అక్తార్ బేగం, తనపట్ల అయిష్టంగా ఉండటాన్ని గమనిస్తుంది. అందుకు గల కారణాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. తన తల్లి పట్ల ఆ కాలనీవాసులకు ఉన్న అభిప్రాయం ఆమెకి బాధ కలిగిస్తుంది. 

అప్పుడు అస్మార ఏం చేస్తుంది? తన తల్లిపై పడిన నిందను తొలగించడానికి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ కాలనీవాసులకి న్యాయం జరగడం కోసం ఆమె ఎలాంటి పథకం వేస్తుంది? రుక్సానాకి ప్రేమించివాడితో పెళ్లి జరిపించడం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? ఫర్జాన్ తో తన పెళ్లి జరుగుతుందని భావించిన ఆమెకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? ప్రేమ విషయంలో ఆమె ఫ్రెండ్స్ కి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.     
  
ఇది 'అస్మరాస్ సమ్మర్' అనే పేరుతో, రచయిత అందలీబ్ వాజిద్ రాసిన బుక్ ఆధారంగా రూపొందింది. సీమా మహాపాత్ర - జహానార భార్గవ ఈ సిరీస్ ను నిర్మించారు. ఆనందం ఆధునిక జీవితంలో ఉంది .. సుఖ సంతోషాలు కలవారి క్యాంపస్ లో మాత్రమే ఉంటాయని భావించే ఒక యువతి, అసలైన ప్రేమానురాగాలు ఎలా ఉంటాయనేది తన నాయనమ్మ - తాతయ్యల దగ్గర నుంచి నేర్చుకుంటుంది. ప్రేమ మనసులో తప్ప ప్రాంతాల్లో ఉండదని గ్రహిస్తుంది. తాను మారిపోయి .. తనవారిని సమస్యల్లో నుంచి బయటపడేసే ఒక యువతి కథ ఇది. 

ఈ సిరీస్ లో ప్రధానమైనవిగా ఓ 15 పాత్రల వరకూ కనిపిస్తాయి. ఇక మిగతా పాత్రలు సందర్భాను సారం వచ్చి వెళుతూ ఉంటాయి. ప్రధానమైన పాత్రల తెరపైకి రావడంలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా వేసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరువలన, ఆ పాత్రలు రిజిస్టర్ అవుతాయి. దర్శకుడు ఫీల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన, ప్రతి సన్నివేశం మనసుకు పట్టుకుంటుంది. 

7 ఎపిసోడ్స్ నిడివి ఎక్కువగానే అనిపిస్తుంది .. అయినా కథ బోర్ కొట్టదు. అనవసరమైన సన్నివేశాలు .. పాత్రలు కనిపించవు. లవ్ .. రొమాన్స్ ను సున్నితంగా టచ్ చేస్తూనే, ఎమోషన్స్ తో ఎక్కువగా కథను కనెక్ట్ చేయడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. సంభాషణలు కూడా అతికించినట్టుగా ఉండవు. దీప్ మెట్కర్ ఫొటోగ్రఫీ .. సిధ్ పౌల్ నేపథ్య సంగీతం .. వైశాఖ్ రవి ఎడిటింగ్ బాగున్నాయి.

ఈ కథ అంతా ప్రేమజంటలతో నిండిపోయి కనిపిస్తుంది. ప్రతి ప్రేమకథ ఫ్యామిలీతో ముడిపడి ఉంటుంది. గతంలోని పరిస్థితులు .. ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు ఈ ప్రేమకథలు ప్రభావితం చేసినవే. చాలా వైపుల నుంచి సాగే ట్రాకులు ఆసక్తికరంగా ఉండటం వలన, ప్రేక్షకులు ఎక్కడా జారిపోకుండా ఫాలో అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ .. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు నచ్చే డ్రామా ఉన్న కంటెంట్ ఇది.

More Reviews