దర్శకుడిగా .. నటుడిగా రవిబాబుకి మంచి పేరుంది. నటించినా .. దర్శకత్వం వహించినా ఆయన మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి రవిబాబు నిర్మాతగా ఒక సినిమా రూపొందింది .. ఆ సినిమా పేరే 'రష్'. సతీశ్ పోలోజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. డైసీ బోపన్న ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కార్తీక (డైసీ బోపన్న) దంపతులు సిటీలో లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తూ ఉంటారు. వారి పిల్లలే రిషి - రియా. ఇద్దరూ 10 - 12 ఏళ్ల పిల్లలే. ఉదయాన్నే కార్తీక భర్త ఆదిత్య ఆఫీసుకి వెళ్లిపోతుంటాడు. ఇక పిల్లలను స్కూల్ కి డ్రాప్ చేయడం .. తీసుకురావడం అంతా కార్తీక చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజున ఆఫీసుకి వెళ్లిన ఆదిత్యకి ఒక కాల్ వస్తుంది. వాళ్ల స్థలాన్ని ఎవరో కబ్జా చేస్తున్నారనేది ఆ కాల్ సారాంశం. దాంతో హడావిడిగా కార్లో వెళుతూ ప్రమాదానికి గురవుతాడు.
ఆదిత్యను హాస్పిటల్లో చేర్చినట్టుగా వీరయ్య అనే ఒక వ్యక్తి చెబుతాడు. అప్పటి నుంచి హాస్పిటల్ వారు అడుగుతున్న ఎమౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేస్తూ, పిల్లలిద్దరినీ తీసుకుని ఆమె అక్కడికి బయల్దేరుతుంది. అయితే మార్గమధ్యంలో ఒక నలుగురు బైకర్స్ తో ఆమెకి గొడవ అవుతుంది. దాంతో వాళ్లు ఆమెను బెదిరిస్తూ వెంటపడుతూ ఉంటారు. అతికష్టం మీద వాళ్ల బారి నుంచి ఆమె బయటపడుతుంది. అయితే ఆమె వలన ఆ నలుగురు గాయపడతారు.
ఆ నలుగురూ కూడా నర్సింగ్ అనే లోకల్ రౌడీ అప్పగించిన పని చేయడానికి వెళుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక హార్డ్ డిస్క్ ను తీసుకురావడమే వాళ్లకి అప్పగించిన పని. అది కాస్తా కార్తీక కారణంగా ఆగిపోతుంది. దాంతో నేరుగా నర్సింగ్ రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో బైకర్స్ గాయపడిన ప్రదేశానికి పోలీస్ ఆఫీసర్ శివ ( రవిబాబు) చేరుకుంటాడు. ఒక లేడీ తమను కారుతో డ్యాష్ ఇచ్చేసి పోయిందని ఆ బైకర్స్ చెబుతారు.
కార్తీక కారును ఫాలో అవుతూ వెళ్లిన నర్సింగ్, ఆమె కూతురు 'రియా'ను కిడ్నాప్ చేస్తాడు. పోలీస్ స్టేషన్ లోని ఒక బ్యాగులో ఉన్న హార్డ్ డిస్క్ ను తీసుకొచ్చి ఇస్తే, రియాను వదిలేస్తామని కార్తీకతో చెబుతాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులపై విరుచుకుపడిన కార్తీక, అక్కడి నుంచి హార్డ్ డిస్క్ తీసుకుని బయటపడుతుంది. సీసీటీవీ పుటేజ్ లో ఆమెను చూసిన శివ షాక్ అవుతాడు.
కార్తీక ఎవరు? ఆమెను చూసి పోలీస్ ఆఫీసర్ శివ ఎందుకు షాక్ అవుతాడు? హార్డ్ డిస్క్ లో ఏముంది? ఆదిత్య కోసం హాస్పిటల్ కి వెళ్లాలనుకున్న కార్తీకకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? హార్డ్ డిస్క్ కోసం అన్వేషిస్తున్నది ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది.
రవిబాబుకి కథ - స్క్రీన్ ప్లే పై మంచి పట్టు ఉంది. తన సినిమాలకి తనే కథను రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఆయన కథల్లో కామెడీ .. రొమాన్స్ .. సాంగ్స్ ఉండవు. ఒక కాన్సెప్ట్ పరిధిలో కథ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాకి నిర్మాతగా ఉన్న ఆయనే కథ - స్క్రీన్ ప్లే .. సంభాషణలు అందించాడు. అందువల్లనే బడ్జెట్ తక్కువే అయినా .. ప్రధానమైన పాత్రలు తక్కువే అయినా కంటెంట్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా కథ ముందుకు వెళుతూ ఉంటుంది.
ఇక దర్శకుడు సతీశ్ పోలోజు టేకింగ్ కూడా ఆకట్టుకుంటుంది. లొకేషన్స్ ఈ కథకి బలంగా అనిపిస్తాయి. ఛేజింగ్స్ .. యాక్షన్ సీక్వెన్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఇంత చిన్న సినిమా కోసం ఈ స్థాయి వర్కౌట్స్ చేస్తారని ఎవరూ అనుకోరు. డైసీ ప్రతి యాక్షన్ సీన్లోను గొప్పగా చేసింది. ఇక ఆ తరువాత మార్కులు రవిబాబు పాత్రకి పడతాయి. చివర్లో రివీల్ చేసిన ట్విస్ట్ కూడా బాగుంది. ఆ వైపు నుంచి ఆ ట్విస్ట్ ఉంటుందని ఆడియన్స్ ఊహించరు.
రాజేశ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సుధాకర్ రెడ్డి కెమెరా పనితనం మంచి మార్కులు కొట్టేస్తుంది. సత్యనారాయణ ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన సీన్స్ కనిపించవు. నాలుగు వైపులా నుంచి నడిచే కథ, ఒకే కేంద్రబిందువు నుంచి మొదలు కావడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో పెర్ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమాల జాబితాలో ఇది కనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.
'రష్' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
| Reviews
Rush Review
- రవిబాబు నిర్మించిన 'రష్'
- యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
- తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమా
- పెర్ఫెక్ట్ గా అనిపించే కంటెంట్
- హైలైట్ గా అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్
Movie Name: Rush
Release Date: 2024-06-13
Cast: Daisy, Ravibabu. karthik Akruhi, yadagiri
Director: Sathish Poloju
Music: Rajesh
Banner: Flying Frogs
Review By: Peddinti
Rush Rating: 2.75 out of 5
Trailer