'మిరల్' (ఆహా) మూవీ రివ్యూ!

Miral

Movie Name: Miral

Release Date: 2024-06-08
Cast: Bharath, Vani Bhojan, KS Ravi Kumar, Meera Krishnan, Rajkumar
Director:Sakthivel
Producer: Dilli Babu
Music: S N Prasad
Banner: Axess Film Factory
Rating: 2.50 out of 5
  • భరత్ హీరోగా రూపొందిన 'మిరల్'
  • తక్కువ బడ్జెట్ లో పెర్ఫెక్ట్ కంటెంట్ 
  • స్క్రీన్ ప్లే తో కూర్చోబెట్టిన దర్శకుడు
  • ప్రధానమైన బలంగా ఫొటోగ్రఫీ - బీజీఎమ్ 

భరత్ హీరోగా తమిళంలో 'మిరల్' అనే సినిమా రూపొందింది. శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2022లోనే అక్కడి థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వాణి భోజన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కేఎస్ రవికుమార్ కీలకమైన పాత్రను పోషించాడు. డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, వాళ్లను ఎంతవరకూ మెప్పించిందనేది చూద్దాం. 

హరి (భరత్) రమ (వాణీ భోజన్) భార్యాభర్తలు. వారి ఒక్కగానొక్క సంతానమే సాయి. హరి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతనికంటూ ఎవరూ ఉండరు. అతణ్ణి ప్రేమించి పెళ్లిచేసుకున్న కారణంగా రమ కూడా పుట్టింటివారి ప్రేమానురాగాలకు దూరమవుతుంది. ఆనందంగా సాగిపోతున్న వాళ్ల కాపురంలో ఒక్కసారిగా సమస్యల మేఘాలు కమ్ముకుంటాయి. ఆ కుటుంబానికి నిద్ర పట్టకుండా చేస్తున్నది ఒక 'కల'. 

హరి - రమ - సాయి కలిసి రాత్రివేళలో కారులో వెళుతూ ఉండగా, హరికి ఒక కాల్ వస్తుంది. సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వలన, అతను కారు దిగి కొంచెం దూరంగా వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక చిత్రమైన ముసుగు ధరించిన వ్యక్తి హరిపై దాడి చేస్తాడు. ఆ దాడిలో హరి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఈ 'కల' తరచూ వస్తుండటంతో రమకి మనఃశాంతి లేకుండా పోతుంది. ఈ విషయం హరి వల్లనే రమ తల్లికి తెలుస్తుంది. 

తమ ఊరు కులదేవత ఆలయానికి వచ్చి పూజ చేసుకుని వెళ్లమనీ, అలా చేయడం వలన సమస్యలు .. చికాకులు తొలగిపోతాయని హరితో అత్తగారు చెబుతుంది. ఈ విధంగానైనా పుట్టింటివారికి దగ్గరవుతున్నందుకు ఆనందిస్తూ రమ తన భర్తను బయల్దేరదీస్తుంది. ముగ్గురూ కూడా ఆ ఊరుకు వెళ్లి అక్కడ కులదేవతలు పూజలు చేయిస్తారు. పూజలు చేయించిన తరువాత కొన్ని శుభశకునాలు ఎదురుకావడం, హరికి ఆనందాన్ని కలిగిస్తుంది.     

ఆ తరువాత ఆ రాత్రినే హరి దంపతులు కారులో తిరుగు ప్రయాణమవుతారు. కారు ఒక ప్రదేశానికి చేరుకోగానే, కారు ట్రబుల్ ఇస్తుంది. తమను ఎవరో గమనిస్తున్నారనే విషయాన్ని హరి గమనిస్తాడు. అక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే వాళ్లపై ఒక ముసుగు వ్యక్తి దాడిచేస్తాడు. అతను ఎవరు? వాళ్లపై ఎందుకు దాడి చేశాడు? రమకి తరచూ వచ్చే కల నిజమవుతుందా? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు. 

దర్శకుడు శక్తివేల్ ఈ కథాకథనాలు సిద్ధం చేసుకున్నాడు. ఈ కథలో ఆరు ప్రధానమైన పాత్రలు కనిపిస్తాయి. వాటిలో ఎక్కువ సేపు కథ మూడు పాత్రలపైనే నడుస్తుంది. కథలో చాలా సేపు చీకటిలో .. నిర్జన ప్రదేశంలో జరుగుతుంది. తన భార్యాబిడ్డలను కాపాడుకోవడం కోసం హీరోపడే  తాపత్రయం అలా కట్టిపడేస్తుంది. ఏ క్షణంలో ఏం జరగనుందో అనే ఉత్కంఠ మొదటి నుంచి చివరివరకూ నడుస్తుంది. 

దర్శకుడు స్క్రీన్ ప్లే ను పెర్ఫెక్ట్ గా వేసుకున్నాడు. అందువలన దర్శకుడు చెప్పేవరకూ, ఏం జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది ఎవరూ ఊహించలేరు. చివర్లో ట్విస్ట్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ స్క్రీన్ ప్లేలో ఉన్న చిన్న లాజిక్ కారణంగా, సాధారణమైన ప్రేక్షకులకు దీనిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు కనిపించవు. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా సహజంగా తమ పాత్రలను ఆవిష్కరించారు.  సురేశ్ బాలా ఫొటోగ్రఫీ బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ .. ఫారెస్టు లొకేషన్స్ ను ఆయన కార్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఆడియన్స్ లో ఉత్కంఠను రేపడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కళైవనన్ ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది. 
    
ఏ కథలో 75 శాతం ఒకరాత్రివేళ .. ఒక నిర్జన ప్రదేశంలో జరుగుతుంది. కేవలం అరడజను పాత్రలతో నడిపించిన కథ ఇది. చాలా సాదాసీదాగా మొదలయ్యే ఈ కథ, ఆ తరువాత చిక్కబడుతూ వెళుతుంది. సస్పెన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రేక్షకులను కదలనివ్వకుండా తమతో పాటు తీసుకుని వెళతాయి. తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో ఈ జోనర్లో వచ్చినవాటిలో ఈ సినిమాకి మంచి మార్కులే ఇవ్వొచ్చు. 

Trailer

More Reviews