'కీచురాళ్లు' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

Keechurallu

Movie Name: Keechurallu

Release Date: 2024-05-30
Cast: Rajisha Vijayan, Sreenivasan, Vijay Babu, Manikandan Pattambi, Renjit Shekar Nair, Rahul Riji Nair
Director:Rahul Riji Nair
Producer: Rahul Riji Nair - Sujith Warrier
Music: Sidhartha Pradeep
Banner: First Print Studios
Rating: 3.00 out of 5
  • మలయాళంలో రూపొందిన 'కీడమ్'
  • థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు 
  • ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలు
  • ఫ్యామిలీతో కలిసి చూడదగిన కంటెంట్  

మలయాళంలో థ్రిల్లర్ సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంటుంది. థ్రిల్లర్ జోనర్ పై అక్కడి దర్శకులకు మంచి పట్టుంది. ఇక మలయాళం నుంచి వచ్చే ఈ తరహా కంటెంట్ ను ఇతర భాషా ప్రేక్షకులు తప్పకుండా చూస్తుంటారు. అందువలన ఓటీటీలో ఈ తరహా సినిమాలకి ఒక రేంజ్ లో వ్యూస్ లభిస్తున్నాయి. అలా 'ఈటీవీ విన్'  ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన సినిమానే 'కీచురాళ్లు'. మలయాళంలో 'కీడమ్' పేరుతో 2022లో వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

రాధిక (రజీషా విజయన్)  సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్. సైబర్ క్రైమ్ కి సంబంధించిన కొన్ని కేసులను పరిష్కరించడానికి పోలీస్ డిపార్టుమెంటువారు ఆమె సాయం తీసుకుంటూ ఉంటారు. ఆమె తండ్రి ఒక సీనియర్ లాయర్. తండ్రీ కూతుళ్లు మాత్రమే ఆ ఇంట్లో ఉంటూ ఉంటారు. ఒక రోజున ఆమె ఫ్రిజ్ రిపేర్ కి సంబంధించి ఒక నెంబర్ కి కాల్ చేస్తుంది. అవతల వ్యక్తి కాస్త అసభ్యంగా మాట్లాడటంతో కాల్ కట్ చేస్తుంది.

ఫోన్లో ఆమెతో అలా మాట్లాడిన ఆ వ్యక్తిపేరు కిలి బిజూ. ఒక మాఫియా ముఠాకి సంబంధించిన లోకల్ గ్యాంగులో అతను ఒకడు. ఆ గ్యాంగ్ లో మొత్తం ఐదుగురు ఉంటారు. వాళ్ల నేర సామ్రాజ్యం వేరు .. కాకపోతే స్క్రాప్ బిజినెస్ చేస్తున్నట్టుగా అక్కడి వాళ్లను నమ్మిస్తూ ఉంటారు. రాధిక వాయిస్ నచ్చడంతో, ఫేస్ బుక్ లోకి వెళ్లి ఆమె ఎలా ఉందనేది చూస్తారు. ఆమె గ్లామర్ గా కనిపించడంతో. తరచూ కాల్స్ చేస్తూ .. పోర్న్ వీడియోలు షేర్ చేస్తూ వేధించడం మొదలుపెడతారు.

ఈ విషయాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకుని వెళుతుంది. పోలీస్ ఆఫీసర్ ఛార్లెస్ - అష్రఫ్ ఇద్దరూ కూడా ఆమెతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా స్పందిస్తారు. ఆ రౌడీ గ్యాంగ్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. ఆ సంఘటన దగ్గర నుంచి ఆ రౌడీలు మరింత రెచ్చిపోతారు. రాధికను .. ఆమె తండ్రిని ఫాలో అవుతూ, నానా రకాలుగా వేధించడం మొదలుపెడతారు. దాంతో ఆమె తన సైబర్ సెక్యూరిటీ బుర్రను వాళ్ల విషయంలో ఉపయోగిస్తుంది. 

స్క్రాప్ బిజినెస్ చేసే ఆ ఐదుగురి వెనుక పెద్ద నెట్ వర్క్ పనిచేస్తుందనే విషయం ఆమెకి  అర్థమవుతుంది. తన నెట్ వర్క్ ను ఉపయోగించి, వాళ్ల అక్రమ రవాణాలను అడ్డుకుంటూ ఉంటుంది. దాంతో వాళ్లకి పెద్దమొత్తంలో నష్టాలు రావడం మొదలవుతుంది. ఫలితంగా అందరికీ పైనున్న బాస్ నుంచి వాళ్లకి హెచ్చరికలు వస్తుంటాయి. అప్పుడు వాళ్లకి రాధికపై అనుమానం వస్తుంది. అప్పుడు ఆ రౌడీ గ్యాంగ్ ఏం చేస్తుంది? ఫలితంగా రాధిక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.

ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ .. కథ అంతా కూడా రజీషా విజయన్ ను కేంద్రంగా చేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఈ కథ చాలా చిన్నది .. తక్కువ పాత్రలతో నడుస్తుంది .. స్థానికంగా ఉన్న నాలుగు లొకేషన్స్ ఎక్కవగా కనిపిస్తాయి. అలా అని తేలికగా తీసుకోవడానికి లేదు. మొదటి నుంచి చివరివరకూ కథ పట్టుగా .. పకడ్బందీగా కొనసాగుతుంది. తరువాత ఏం జరుగుతుందనే ఒక కుతూహలం అలా కూర్చోబెట్టేస్తుంది. 

అనుకోకుండా రాధిక ఎలా సమస్యల్లో పడుతుంది? అందులో నుంచి బయటపడటానికి ఆమె ఏం చేస్తుంది? ఆ ప్రయత్నాలు ఆమెను ఎలాంటి ప్రమాదంలోకి నెడతాయి? అనే మలుపులు కథను ఆసక్తికరంగా పరుగులు పెట్టిస్తాయి. రౌడీమూక రాధికను వేధించే సన్నివేశాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉండటం వలన వెంటనే కనెక్టు అవుతాయి. ఫోన్స్ ను ఎలా హ్యాక్ చేస్తారు? రౌడీ మూకలకు అమ్మాయిల ఫోన్ నెంబర్స్ దొరికితే ఎంత ప్రమాదం? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.     
   
 దర్శకుడు ఏ విషయమైతే చెప్పాలనుకున్నాడో, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా ఆ విషయాన్ని చెప్పాడు. భారీ ఫైట్లు .. హడావిడి లేకుండా వాస్తవానికి దగ్గరగా సన్నివేశాలను తీసుకుని వెళ్లాడు. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. రాకేశ్ ధరన్ కెమెరా పనితనం .. సిద్ధార్థ్ ప్రదీప్ నేపథ్య సంగీతం .. క్రిష్టి సెబాష్టియన్ ఎడిటింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి.

'కీచురాళ్లు' అనేది చాలా సాధారణమైన టైటిల్ అనిపిస్తుంది. రజీషా విజయన్ కి ఇక్కడ పెద్ద క్రేజ్ లేదు కదా అనేసి ఈ సినిమాను దాటుకుని ముందుకు వెళితే ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను చూసే అవకాశం మిస్సయినట్టే. ఎలాంటి బూతులు .. అసభ్యతతో కూడిన సన్నివేశాలు లేకుండా, ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే కథ ఇది. కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడొచ్చుననడంలో ఎలాంటి సందేహం లేదు. 

More Reviews