'విద్య వాసుల అహం' (ఆహా) మూవీ రివ్యూ!

Vidya Vasula Aham

Movie Name: Vidya Vasula Aham

Release Date: 2024-05-17
Cast: Shivani Rajasekhar, Rahul Vijay, Aavasarala, Abhinaya, Srinivas Redy
Director:Manikanth Geli
Producer: Navya Mahesh- Ranjith Kumar
Music: Kalyani Malik
Banner: Thanvika Jashwika Creations
Rating: 2.00 out of 5
  • భార్య భర్తల అలకల చుట్టూ తిరిగే కథ
  • కథలో కనిపించని వైవిధ్యం 
  • ఆసక్తికరంగా లేని కథనం 
  • సాదాసీదాగా సాగిపోయే సన్నివేశాలు
  • సరదాలో సందడిపాళ్లు తగ్గిన కంటెంట్  

శివాని రాజశేఖర్ - రాహుల్ విజయ్ ప్రధానమైన పాత్రలుగా 'విద్య వాసుల అహం' రూపొందింది. ఓటీటీ కోసం నిర్మించిన సినిమా ఇది. నాయికా నాయకుల అహానికి సంబంధించిన కథ ఇది అనే విషయం టైటిల్ ను బట్టే అర్థమైపోతుంది. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూద్దాం. 

ఈ కథ వైజాగ్ లో మొదలవుతుంది .. విద్య (శివాని రాజశేఖర్) ఓ మధ్యతరగతి అమ్మాయి. తనకి కాబోయే భర్త విషయంలో ఆమెకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలాంటివాడిని చేసుకోవడం వలన లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని ఆమె భావిస్తుంది. ఇక వాసు (రాహుల్ విజయ్) కూడా ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. మెకానికల్ ఇంజనీర్ గా పనిచేసే అతనికి కూడా ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తుంటారు. అనుకోకుండానే శాస్త్రి (అనంత్) ద్వారా ఇద్దరికీ పెళ్లి చూపులు జరిగిపోతాయి.

ఓ శుభ ముహూర్తాన ఇద్దరి పెళ్లి జరిగిపోతుంది. దాంతో ముందుగా అనుకున్న ప్రకారం వేరు కాపురం పెడతారు. అదే సమయంలో విద్యకి ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. దాంతో ఆమె జాబ్ లో జాయిన్ అవుతుంది. హనీమూన్ కి వెళ్లాలనే కోరిక నెరవేరకపోవడం వలన వాసు కొంతనిరాశ చెందుతాడు.    కొన్ని రోజుల పాటు వారి కాపురం సాఫీగా .. హ్యాపీగా సాగిపోతుంది. తనని కంట్రోల్ చేయడానికి ఆమె అనుక్షణం ట్రై చేస్తుందని అతను భావిస్తాడు. తనని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆమె అనుకుంటుంది. 

అలాంటి పరిస్థితుల్లోనే తనకి బాస్ ఇంక్రిమెంట్ తక్కువగా ఇచ్చాడనే కోపంతో వాసు జాబ్ కి రిజైన్ చేస్తాడు. అయితే అతను ఆ విషయాన్ని విద్యకి చెప్పడు. ఇంటి ఖర్చులకు విద్యను డబ్బులు అడగడానికి అతనికి అహం అడ్డొస్తుంది. అతను ఆఫీసుకి వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండటం .. రూమ్ లో నుంచి బయటికి రాకపోవడం విద్యకి చిత్రంగా అనిపిస్తుంది. ఆ తరువాత నిదానంగా  ఆమెకి అసలు సంగతి తెలుస్తుంది. 

వాసు ఖాళీగా ఇంటిపట్టునే ఉండటం ..  సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుండటంతో, ఇద్దరి మధ్య మరింతగా గొడవలు పెరుగుతాయి. ఇలా వాళ్లిద్దరూ ఒకరిని చూసి ఒకరు చిటపటలాడుకునే పరిస్థితుల్లో, వారి కొత్తకాపురం ఎలా ఉందనేది చూడటానికి  ఇద్దరి పేరెంట్స్ కలిసి వస్తారు. అప్పుడు విద్య - వాసు ఏం చేస్తారు? వాళ్ల దాంపత్యం అన్యోన్యంగా లేదని వారి పేరెంట్స్ పసిగట్టేస్తారా? వాసు కోసం విద్య మారుతుందా? విద్య కోసం వాసు తన పద్దతి మార్చుకుంటాడా? అనేదే కథ.

మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన సినిమా ఇది. కొత్త జంట .. కొత్త కాపురం అన్నాక, అహం .. అలకలు సహజమే. తమ మాటనే నెగ్గాలనే ఇగో .. ఆర్థికపరమైన విషయాల్లో అపార్థాలు .. తొందరపాటు నిర్ణయాలు .. అనవసరమైన ఆవేశాలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయంపై ఇంతకుముందు చాలానే సీరియల్స్ .. సిరీస్ లు .. సినిమాలు వచ్చాయి. వాటిలో లేని కొత్త విషయం .. కొత్త అంశం ఏదైనా ఇందులో ఉందా అంటే, లేదనే చెప్పాలి. 

ఇగో .. ఆత్మాభిమానం .. ఈ రెండింటి మధ్య తేడాను తేల్చుకోవడం కష్టం. ఎవరికి వారు తమకున్నది ఆత్మాభిమానం, ఎదుటివారికి ఉన్నది ఇగో అనుకోవడమే గొడవకు ప్రధానమైన కారణం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ జంట మధ్య కూడా అలాంటి సన్నివేశాలని డిజైన్ చేశారు. అయితే ఆ గొడవలలో ఆడియన్స్ వైపు నుంచి వినోదం లోపించింది. అలకలు .. అపార్థాలు కూడా సరదాకి కాస్త దూరంగానే కనిపిస్తాయి. 

 వెంకటేశ్ రౌతు అందించిన ఈ కథలో బలం లేదు .. వైవిధ్యం అంతకంటే లేదు. భార్యాభర్తలు సిల్లీ రీజన్ తో గందరగోళం చేసి, సింపుల్ గా కలిసిపోతారనే విషయాన్ని మరోసారి చెప్పారాయన.  ఆయన అందించిన సంభాషణలు మాత్రం సహజత్వానికి దగ్గరగా అనిపిస్తాయి. 'మందు అలవాటు లేదా?' అంటే, 'మధ్యాహ్నం అలవాటు లేదు' వంటి కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. అఖిల్ వల్లూరి ఫొటోగ్రఫీ .. కల్యాణి మాలిక్ సంగీతం .. సత్య గిడుతూరి ఎడిటింగ్ ఫరవాలేదు. 

ప్రధానమైనవిగా కనిపించే అరడజను పాత్రల చుట్టూనే ఈ కథ అంతా నడుస్తుంది. నాయికా నాయకులపైనే ఎక్కువ కథను నడిపించడం ..  ఆ సన్నివేశాలు అంత ఆసక్తికరంగా లేకపోవడం .. రొటీన్ గా అనిపించడం వలన కాస్త బోర్ కొడుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే ఆనందం ఉంది .. సర్దుకుపోవడం లోనే సంతోషం ఉంది అనే సందేశం ఈ కథలో ఉంది. కాకపోతే అది ఇంతకుముందు చాలామంది ఇచ్చేసిందే కదా అనిపిస్తుంది. 

ఇక అసలు కథను వైకుంఠం నుంచి మొదలుపెట్టారు. నారాయణుడు .. లక్ష్మీదేవికి ఈ కథను చూపిస్తున్నట్టుగా చెబుతూ, కథలోకి ఆడియన్స్ ను లాగుతారు. అంతా చూసిన ఆడియన్స్ కి, స్వామివారు అమ్మవారికి చూపించేది ఇంత సిల్లీ కథనా? అనిపిస్తుంది. కథలో ఎలాంటి బలమైన అంశం లేకుండా .. బరువైన ఎమోషన్ లేకుండా తేలికగా నడిపించడం వల్లనే ఇది తేలిపోయిందంతే. 

Trailer

More Reviews