'మై డియర్ దొంగ' (ఆహా) మూవీ రివ్యూ!

My Dear Donga

My Dear Donga Review

  • అభినవ్ గోమఠం నుంచి 'మై డియర్ దొంగ'
  • కీలకమైన పాత్రలో శాలిని కొండేపూడి 
  • ఏ అంశాన్ని కనెక్ట్ చేయలేకపోయిన కంటెంట్ 
  • నిరాశపరిచే పేలవమైన సన్నివేశాలు 
  • నటన పరంగా శాలినికి మంచి మార్కులు        

తెలుగు తెరపై ఇప్పుడు సందడి చేస్తున్న స్టార్ కమెడియన్స్ లో అభినవ్ గోమఠం ఒకరు. ఒక వైపున సినిమాలు .. మరో వైపున ఓటీటీ మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ లతోను బిజీగా ఉన్నాడు. ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన సినిమాగా 'మై డియర్ దొంగ' రూపొందింది. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ రోజు నుంచే ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. కథాకథనాల పరంగా ఈ సినిమా ఎంతవరకూ మెప్పించిందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ హైదరాబాదులో మొదలవుతుంది. సుజాత (షాలినీ కొండేపూడి) ఒక డేటింగ్ యాప్ లో పనిచేస్తూ, ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ఆమె స్నేహితురాలే బుజ్జీ (దివ్య శ్రీపాద). ఇద్దరూ కూడా కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. సుజాత తండ్రి ఒక తాగుబోతు .. కుటుంబం పట్ల ఎంత మాత్రం బాధ్యత లేని వ్యక్తి. ఇంట్లోని వస్తువులన్నీ అమ్మేసి తాగుతూ .. ఆ మత్తులోనే రోజులను గడిపేస్తూ ఉంటాడు. దాంతో సహజంగానే జీవితం పట్ల సుజాతకి ఒక అభద్రతా భావం ఉంటుంది. 

 విశాల్ (నిఖిల్) తో సుజాత ప్రేమలో పడుతుంది. అలాగే వరుణ్ (శశాంక్)తో బుజ్జి లవ్ లో ఉంటుంది. విశాల్ తనని పెద్దగా పట్టించుకోకపోవడం .. తన ఫీలింగ్స్ ను అర్థం చేసుకోకపోవడం .. చిన్న చిన్న సంతోషాలను సైతం షేర్ చేసుకోకపోవడం సుజాతకి బాధను కలిగిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గురించిన ఆలోచనలతోనే ఆమె ఆ రోజున ఫ్లాట్ కి చేరుకుంటుంది. అయితే అదే ఫ్లాట్ దొంగతనం చేయడానికి వచ్చిన సురేశ్ (అభినవ్ గోమఠం), కొన్ని వస్తువులను కాజేసి బయటపడదామని అనుకుంటూ ఉండగా సుజాత వస్తుంది.

తప్పించుకునే మార్గం లేకపోవడంతో, అతను అక్కడ దొరికిపోతాడు. అసలే బాధలో ఉన్న కారణంగా సురేశ్ దొంగతనాన్ని సుజాత సీరియస్ గా తీసుకోదు. పైగా తన ఆవేదనను చెప్పుకోవడానికి ఒక మనిషి దొరికాడని అనుకుంటుంది. కొంతసేపు జరిగిన సంభాషణతోనే అతని మాట తీరు .. అభిప్రాయాలు .. అభిరుచుల కారణంగా సుజాత మెత్తబడుతుంది. పేరెంట్స్ విషయంలో తన మాదిరిగానే ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఎదిగాడని తెలుసుకున్న తరువాత, అతని పట్ల ఆమెకి సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. 

అదే సమయంలో విశాల్ .. బుజ్జీ .. వరుణ్ ఆమె ఫ్లాట్ కి వస్తారు. తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్ అంటూ ఆమె సురేశ్ గురించి అబద్ధం చెబుతుంది. మెకానికల్ ఇంజనీర్ అంటూ వాళ్లకి పరిచయం చేస్తుంది. ఈ విషయంలో సురేశ్ కొంచెం ఇబ్బంది పడతాడు. ఆ రోజున సుజాత బర్త్ డే కావడంతో, అంతా కలిసి సరదాగా బయటికి వెళతారు. కార్తీక్ అసలు పేరు సురేశ్ అనీ .. అతను ఓ దొంగ అని విశాల్ కి తెలుస్తుంది. సురేశ్ తో సుజాత కాస్త చనువుగా ఉండటం అతనికి కోపాన్ని తెప్పిస్తుంది. సురేశ్ ను సాధ్యమైనంత త్వరగా సుజాతకు దూరం చేయాలనే ఒక నిర్ణయానికి వస్తాడు. 

ఆ ఉద్దేశంతోనే విశాల్ తన కారును నేరుగా తీసుకు వెళ్లి పోలీస్ ల దగ్గర ఆపుతాడు. తన కారులో దొంగ ఉన్నాడని చెబుతాడు. ఊహించని ఆ సంఘటనకి సుజాత బిత్తరపోతుంది. విశాల్ హఠాత్తుగా అలా ప్రవర్తించడం పట్ల సురేశ్ బిత్తరపోతాడు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? విశాల్ ధోరణి పట్ల సుజాత ఎలా స్పందిస్తుంది? విశాల్ తో సుజాత ప్రేమ .. పెళ్లి వరకూ వెళుతుందా? సురేశ్ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతాడు? అనేది మిగతా కథ.     

ఈ సినిమాలో సుజాత పాత్రను పోషించిన శాలిని కొండేపూడి రాసుకున్న స్క్రిప్ట్ ఇది. ప్రేమంటే ఒకరి కోసం ఒకరు తమ ఆలోచనలు .. అలవాట్లు .. అభిరుచులు మార్చుకోవడం కాదు, ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ, వారికి స్వేఛ్ఛ ఇవ్వడం. ప్రేమంటే ఒకరి వెంట ఒకరు అదే పనిగా తిరగడం కాదు. ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి బలమైన నమ్మకం ఉండటం అనే సందేశాన్ని ఇచ్చేలా శాలిని ఈ కథను సిద్ధం చేసుకుంది. 

అయితే ఈ సందేశం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్థాయిలో బలమైన సన్నివేశాలు పడలేదు. 'ప్రేమ అనేది సహజంగా పుట్టాలి .. అది ఎదుటివారి నుంచి అడిగి తీసుకునేది కాదు' అనే ఉద్దేశం బాగుంది. కానీ ఈ కథ ద్వారా దానిని ఎమోషనల్ గా ఆడియన్స్ కి ఎక్కించలేకపోయారు. ఇక టైటిల్ ను బట్టి ఇది కామెడీ టచ్ తో కూడుకున్న కంటెంట్ అనే విషయం అర్థమైపోతుంది. కానీ ఆశించినంత కామెడీని అందించడంలో కూడా విఫలమయ్యారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్ ఈ మూడు కోణాలను టచ్ చేస్తూ ఈ కంటెంట్ కొనసాగుతుంది. కానీ ఏ ఒక్క అంశానికి సరైన న్యాయం జరగకుండా సన్నివేశాలు ఎక్కడికక్కడ తేలిపోతూ ఉంటాయి .. క్లైమాక్స్ తో సహా. 

అభినవ్ గోమఠం నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇక ఈ కథను అందించిన శాలిని .. స్క్రిప్ట్ పై మరింత గట్టిగా కసరత్తు చేస్తే బాగుండేది. నటన పరంగా మాత్రం చాలా బాగా చేసింది. ఆకర్షణీయమైన కళ్లతో హావభావాలు  చక్కగా పలికించింది. నటిగా ఆమెకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకోవచ్చు. దివ్య శ్రీపాద మంచి ఆర్టిస్ట్ .. కానీ ఆమెను సరిగ్గా ఉపయోగించుకోలేదనే అభిప్రాయం కలుగుతుంది. 

అజయ్ అరసాడ నేపథ్య సంగీతం .. మనోజ్ ఫొటోగ్రఫీ ఫరవాలేదు. సాయిమురళి ఎడిటింగ్ ఓకే.
 తక్కువ బడ్జెట్ లో .. తక్కువ లొకేషన్స్ లో సీన్స్ ను ప్లాన్ చేసుకోవడం బాగుంది. అలాగే ఈ జనరేషన్ కి కనెక్ట్ చేయడానికి ట్రై చేయడం కూడా బాగుంది. కానీ కంటెంట్ లోనే బలం లేదు. పై పై అల్లేసిన సీన్స్ కారణంగా, ఏ సీన్ కూడా హార్ట్ వరకూ వెళ్లలేకపోయింది. లోతుగా మనసుకు తాకలేకపోయింది. ఇంత లైట్ గా ఉన్న కంటెంట్ ను నమ్ముకుని ఇక్కడి వరకూ రావడం ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. 

Movie Name: My Dear Donga

Release Date: 2024-04-19
Cast: Abhinav Gomatam, Shalini Kondepudi, Divya Dripada, Nikhil Gajula, Shashank, Rohith Varma
Director: Sarwagna Kumar
Music: Ajay Aarasada
Banner: Cam Entertainment

My Dear Donga Rating: 2.00 out of 5

Trailer

More Reviews