'ది వెడ్డింగ్ గెస్ట్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

The Wedding Guest

The Wedding Guest Review

  • హాలీవుడ్ మూవీగా రూపొందిన 'ది వెడ్డింగ్ గెస్ట్'
  • ప్రధానమైన పాత్రల్లో కనిపించిన రాధిక ఆప్టే - దేవ్ పటేల్ 
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కిడ్నాప్ డ్రామా
  • సినిమా రిలీజ్ సమయంలో హాట్ సీన్ పై నడిచిన హాట్ టాపిక్
  • నోటిమాటగా అనుకుని చేసినట్టు అనిపించే కథ   

రాధిక ఆప్టే - దేవ్ పటేల్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ది వెడ్డింగ్ గెస్ట్' అనే హాలీవుడ్ మూవీ, 2019లో అక్కడి థియేటర్స్ లో విడుదలైంది. కథాపరంగా ఈ సినిమా ఇండియాలోనే చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించిన న్యూడ్ సీన్ బయటికి రావడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అలాంటి ఈ సినిమా ఐదేళ్ల తరువాత 'నెట్ ఫ్లిక్స్' ద్వారా అందుబాటులోకి వచ్చింది. మైఖేల్ వింటర్ బాటమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

జై (దేవ్ పటేల్) అనే యువకుడు పాకిస్తాన్ లోని లాహోర్ కి చేరుకుంటాడు. తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఎప్పటికప్పుడు కార్లు .. సిమ్ కార్డులు మార్చేస్తూ ఉంటాడు. రెండు గన్స్  కొనేసి, ఓ మారుమూల ప్రాంతానికి చేరుకుంటాడు. సమీరా ( రాధిక ఆప్టే) ఇల్లు ఎక్కడ ఉందనేది తెలుసుకుని, అక్కడికి చేరుకుంటాడు. ఓ రాత్రివేళ రహస్యంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి, ఆమెను బయటికి తీసుకుని వస్తాడు. తనని అడ్డుకోబోయిన వాచ్ మెన్ ను అతను షూట్ చేస్తాడు. 

గన్ సౌండ్ కి చుట్టుపక్కల వాళ్లంతా నిద్రలేచి వచ్చేసరికి, సమీరాను తీసుకుని బయటపడతాడు. తనని ఎందుకు కిడ్నాప్ చేశావని సమీరా అతనిని అడుగుతుంది. ఆమె లవర్ దీపేశ్ (జిమ్ సర్భ్) ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నాడనీ, అందుకు తనకి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని అన్నాడని చెబుతాడు. తనని దీపేశ్ కిడ్నాప్ చేసి తీసుకుని రమ్మనడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమెను 'అమృత్ సర్'లో అతనికి అప్పగించనున్నట్టు జై చెబుతాడు, 

అయితే తాను ఢిల్లీ నుంచి అమృత్ సర్ రాలేకపోయాననీ, సమీరాను తీసుకుని ఢిల్లీ వచ్చేయమని దీపేశ్ అంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జై అలాగే చేస్తాడు. ఈ లోగా పాకిస్తాన్ లో జరిగిన సమీరా కిడ్నాప్ .. వాచ్ మెన్ హత్య న్యూస్  వైరల్ అవుతూ ఉంటుంది. దాంతో దీపేశ్ భయపడతాడు. ఈ వ్యవహారం తన మెడకి చుట్టుకుంటుందని టెన్షన్ పడతాడు. సమీరను వెనక్కి తీసుకెళ్లి పాకిస్తాన్ లో వదిలేయమని జై తో చెబుతాడు. అందుకు మరింత డబ్బును అతనికి ఇస్తానని అంటాడు. 

ఈ విషయం తెలిసి సమీరా షాక్ అవుతుంది. తనని భయపడుతూ ప్రేమించే దీపేశ్ కంటే, ధైర్యంగా కిడ్నాప్ చేసిన 'జై'నే ఆమె కంటికి హీరోగా కనిపిస్తాడు. తనతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నా, తన పట్ల తప్పుగా ప్రవర్తించని అతని వ్యక్తిత్వం పట్ల ఆమె ఆరాధనా భావాన్ని పెంచుకుంటుంది. అతనికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జై మాత్రం పక్కా ప్రొఫెషనల్ గా తన పని తాను చేసుకుపోతుంటాడు.  

ఈ నేపథ్యంలోనే దీపేశ్ చేసేది డైమండ్స్ బిజినెస్ అనీ, అతని దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయనే విషయాన్ని జై తో చెబుతుంది సమీరా. ఆ డైమండ్స్ తీసుకునే తాను .. దీపేశ్ ఎక్కడికైనా వెళ్లిపోదామని ప్లాన్ చేసుకున్నామని అంటుంది. ఆ జంట దగ్గర ఖరీదైన డైమండ్స్ ఉన్నాయని తెలుసుకున్న జై ఏం చేస్తాడు? అతను తీసుకున్న నిర్ణయం కారణంగా కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది.

ఈ కథా పరిధి చాలా చిన్నది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో నడిచే ఒక కిడ్నాప్ స్టోరీ. ఒక పాకిస్తాన్ అమ్మాయినీ .. ఇండియా అబ్బాయిని కలపడానికి ఒక యువకుడు ప్రయత్నించడం .. అప్పుడు అతనికి ఎదురైన పరిస్థితుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. కథ అంతా కూడా విమానాలు .. రైళ్లు ..  బస్సులు .. కార్లలో పరుగులు తీస్తూనే ఉంటుంది. హడావుడి హడావిడిగా సన్నివేశాలు నడుస్తూ ఉంటాయి. అయితే అసలు ఎందుకు ఇదంతా అనేది ప్రేక్షకుడికి అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. 

సమీరాను ఎవరు కిడ్నాప్ చేయమన్నారు? ఎందుకు చేయమన్నారు? సమీరాకి .. దీపేశ్ కి మధ్య ఉన్న వజ్రాల బిజినెస్ కథాకమామీషు ఏమిటి? సమీరాను కిడ్నాప్ చేసే పనిని దీపేశ్ ఎందుకు జైకి అప్పగించాడు? వాళ్లిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? ఇలాంటి విషయాలలో మనకి క్లారిటీ రాదు. తన లవర్ ను కలుసుకునే క్రమంలో కిడ్నాప్ చేసిన యువకుడికి సమీరా వశమైపోవడం మాత్రమే ఆడియన్స్ కి కరెక్టుగా అర్థమవుతుంది. క్లైమాక్స్ కూడా చిత్రంగా అనిపిస్తుంది. 

ఈ కథలో స్క్రీన్ పైకి నామ మాత్రంగా చాలా పాత్రలు వచ్చి వెళుతూ ఉంటాయి గానీ, కథ అంతా కూడా కేవలం మూడు పాత్రల చుట్టూనే జరుగుతుంది. ఎవరి పాత్రలో వారు సహజమైన నటనను కనబరిచారు. న్యూడ్ సీన్ ను ఎంతవరకు ఎడిట్ చేశారనేది తెలియదుగానీ, మొత్తానికి అసలు సీన్ అయితే ఉంది. ఇది ఒక పెన్నూ పేపర్ తీసుకుని రాసుకున్న కథగా కాకుండా, కెమెరా తీసుకుని లొకేషన్ కి వెళ్లి ఒక నోటిమాటగా అనుకుని చేసిన కంటెంట్ గా అనిపిస్తుంది. 

ఈ కథలో లవ్ లేదు .. ఎమోషన్స్ లేవు .. యాక్షన్ నామమాత్రం. ఉన్నదల్లా స్విమ్మింగ్ పూల్ లో లిప్ లాకులు .. బెడ్ రూమ్ సీన్స్. ఇక హాలీవుడ్ మూవీలో ఆ మాత్రం హాట్ సీన్స్ ఉండవా ఏంటి? అనుకుంటే గొడవే లేదు. బరువైన సీన్స్ .. కదిలించే సీన్స్ .. కరిగించే సీన్స్ లేవు గనుక, నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వాటిని గురించి పెద్దగా మాట్లాడుకోవలసిన అవసరం లేదు. ఫోటోగ్రఫి మాత్రం అక్కడక్కడా కాస్త మంచి లొకేషన్స్ ను చూపిస్తూ మార్కులు కొట్టేస్తుంది.

Movie Name: The Wedding Guest

Release Date: 2024-04-14
Cast: Dev Patel, Radhika Apte, Jim Sarbh
Director: Michael Winterbottom
Music: Harry Escott
Banner: Ingenious Media

The Wedding Guest Rating: 2.25 out of 5

Trailer

More Reviews