'కాజల్ కార్తీక' (ఆహా) మూవీ రివ్యూ!

Kajal Karthika

Kajal Karthika Review

  • ఆంథాలజీ కంటెంట్ తో 'కాజల్ కార్తీక'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కంటెంట్  
  • బలహీనమైన కథలు .. పేలవమైన సన్నివేశాలు
  • సహనాన్ని పరీక్షించే సిల్లీ సీన్స్  

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా కాజల్ కి మంచి క్రేజ్ ఉంది. అందమైన కథానాయికగా అల్లరి పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె, తమిళంలో 'కరుంగా పియమ్' అనే హారర్ థ్రిల్లర్ సినిమాను చేసింది. తెలుగులో ఈ సినిమా, 'కాజల్ కార్తీక' పేరుతో ప్రేక్షకులను పలకరించింది. మే 19 - 2023న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులను ఈ ఆంథాలజీ హారర్ సినిమా ఎంతలా ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం. 

ఉమా (రెజీనా) బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటుంది. తన ఫ్రెండ్ వాళ్ల బ్రదర్ పాతకాలం నాటి లైబ్రరీ నిర్వహిస్తున్నాడని తెలిసి అక్కడికి వెళుతుంది. అక్కడ ఆమెకి 'కాటుక బొట్టు' అనే ఒక వందేళ్ల క్రితం నాటి పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకం టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో దానిని చదవడం మొదలుపెడుతుంది. వందేళ్ల క్రితంనాటి ఆ పుస్తకంలో లాక్ డౌన్ సహా, ప్రస్తుత కాలం నాటి విషయాలు కూడా ఉండటం ఉమకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఉమా ఆ పుస్తకంలోని ఒక్కో కథను చదువుతూ ఉంటే, ఆ కథల్లోని పాత్రలు తన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు? రాబోయే కాలాన్ని గురించి .. జరగనున్న సంఘటనలను గురించి అంతలా ఎలా ఊహించారు? అనే ఒక సందేహం ఆమెలో ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. ఆ పుస్తకంలోని 5వ కథను ఆమె చదవడం మొదలుపెడుతుంది. ఆ కథ కార్తీక (కాజల్) ప్రధానమైన పాత్రగా నడుస్తూ ఉంటుంది.

ఒక గ్రామంలో శ్రీమంతుల కుటుంబానికి కోడలుగా కార్తీక ఉంటుంది. ఇతరులకు సాయం చేసే మంచి మనసున్న ఆమెను ఆ ఊళ్లోని వాళ్లంతా ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. ఆ ఊళ్లో దెయ్యం తిరుగుతుందనే ఒక ప్రచారం జోరుగా నడుస్తూ ఉంటుంది. అలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే కార్తీక భర్త చనిపోతాడు. ఆ షాక్ నుంచి ఆమె తేరుకోలేకపోతుంది. ఊళ్లో పరిస్థితులు కూడా మారుతూ ఉండటంతో, తన కూతురు ఉమాదేవితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది.

అప్పుడు ఏం జరుగుతుంది? కార్తీక కథకు ముగింపు ఏమిటి? ఆ పుస్తకం చదివిన ఉమకి ఏం అర్థమవుతుంది? ఆ బుక్ రాసినవారెవరో ఆమె తెలుసుకోగలుగుతుందా? ఆ పుస్తకానికీ .. ఉమకి ఉన్న సంబంధం ఏమిటి? అనేవి ఈకథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలుగా కనిపిస్తాయి. 

ఇది ఆంథాలజీ హారర్ మూవీ. ఐదు కథల సమాహారంగా ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఉమా ఒక్కో కథను తిరగేస్తూ ఉంటే, ఆ పాత్రలు తెరపైకి వస్తుంటాయి. అలా ఐదు కథలు ఆడియన్స్ ను పలకరిస్తాయి. ఆ క్రమంలో వచ్చే నాలుగు ఎపిసోడ్స్ లో మొదటి కథ కాస్త ఫరవాలేదనిపిస్తుంది. మిగతా మూడు కథలు కామెడీ టచ్ తో నడుస్తాయి. ఈ మూడు ఎపిసోడ్స్ లోను ఎంతమాత్రం విషయం కనిపించదు. రెండు .. మూడు .. నాలుగు ఎపిసోడ్స్ ను భరించడం చాలా కష్టమైన విషయం.

కాజల్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసినవాళ్లు .. ఆమె ఈ సినిమా ఒప్పుకుందంటే ఎంతో కొంత విషయం ఉండే ఉంటుందని అనుకోవడం సహజం. ఆమె ప్రధానమైన పాత్రగా ఈ కథ నడుస్తుందని అనుకోవడం కూడా సహజం. కానీ కాజల్ కి సంబంధించిన ఎపిసోడ్ కథను మాత్రమే ఆమెకి చెప్పి ఉంటారనే విషయం, సినిమా చూసిన తరువాత మనకి అర్థమవుతుంది. ఎందుకంటే కాజల్ ఎపిసోడ్  మాత్రమే కాస్త బెటర్ గా ఉంటుంది అంతే. 

వందేళ్ల క్రితం నాటి పుస్తకం .. అందులోని విషయాలు ప్రస్తుతం జరుగుతుండటం .. అది రాసినదెవరు? అనే ఒక ఆసక్తిని రేకెత్తించేంత వరకూ ఓకే. కానీ ఆ తరువాత ఆ పుస్తకంలోని సంఘటనలు తెరపై చూస్తున్నప్పుడు, ఈ మాత్రం కథల కోసం వందేళ్ల పుస్తకం చదవాలా? అనిపించకమానదు. సన్నివేశాలు ముందుగా రాసుకున్నట్టు కాకుండా, సెట్లో అప్పటికప్పుడు రాసుకున్నట్టుగా అనిపిస్తాయి. 

ఇది హారర్ కామెడీ సినిమా .. ఒకటి రెండు చోట్ల సౌండ్ ఎఫెక్ట్ తో భయపెట్టారు. హారర్ కంటే కామెడీ సీన్స్ తో ఈ సినిమా ఎక్కువగా భయపెట్టేసిందని చెప్పాలి. ఆడియన్స్ ను నవ్వించడం దెయ్యాల వలన అయ్యేలా లేదు అన్నట్టుగా ఏలియన్స్ రంగంలోకి దిగుతారు. ఏలియన్స్ మని వాళ్లు స్వయంగా చెప్పుకోవడం వలన మనకి ఆ విషయం అర్థమవుతుంది. ఆ సీన్స్ వచ్చేటప్పుడు  కూడా, 'కొంపదీసి ఇప్పుడు నవ్వాలా ఏంటి?' అనేక సందేహంలో ప్రేక్షకుడు ఉంటాడు.

 కొన్ని సన్నివేశాలు చూస్తుంటే, చాలా కాలం క్రితం మన ఊర్లలో వేసే డ్రామాలను స్టేజ్ ఎదురుగా కూర్చుని మళ్లీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కాలంలో ఇలాంటి సినిమానా అనే షాక్ నుంచి తేరుకోవడానికి కూడా చాలా సమయమే పడుతుంది. విఘ్నేశ్ వాసు కెమెరా పనితనం .. ప్రసాద్ నేపథ్య సంగీతం .. విజయ్ వేల్ కుట్టి ఎడిటింగ్ కథకి  తగినట్టుగానే అనిపిస్తుంది. సరైన కథ లేకుండా సిల్లీ సీన్స్ తో సినిమా తీయడం కూడా ఒక రకంగా భయపెట్టడమే. ఆ రకంగా చూసుకుంటే ఇది హారర్ థ్రిల్లరే. 

Movie Name: Kajal Karthika

Release Date: 2024-04-09
Cast: Kajal Aggarwal, Regina Cassandra, Janani, Raiza Wilson, John Vijay
Director: Deekay
Music: Prasad SN
Banner: Pave Entertainments

Kajal Karthika Rating: 2.00 out of 5

Trailer

More Reviews