'ఇన్ స్పెక్టర్ రిషి' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Inspector Rishi

Inspector Rishi Review

  • నవీన్ చంద్ర హీరోగా రూపొందిన ' ఇన్ స్పెక్టర్ రిషి'
  • హారర్ టచ్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్ 
  • అడవి నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • ఆసక్తికరంగా  అనిపించే సన్నివేశాలు 
  • ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం - లొకేషన్స్ హైలైట్

ప్రతివారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి క్రైమ్ థ్రిల్లర్ జోనర్ల నుంచి వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. ఈ జోనర్ కి విశేషమైన ఆదరణ ఉండటమే అందుకు కారణం. అలాంటి ఈ జోనర్ కి హారర్ టచ్ ఇచ్చే ప్రయత్నాలు కూడా ఈ మధ్య కాలంలో చేస్తూ వెళుతున్నారు. అలా రూపొందిన మరో వెబ్ సిరీస్ 'ఇన్ స్పెక్టర్  రిషి'. నవీన్ చంద్ర ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 29వ తేదీ నుంచి 10 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. అడవి నేపథ్యంగా సాగే ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కోయంబత్తూర్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'తేన్ కాడ్' అటవీ ప్రాంతంలో ఈ కథ మొదలవుతుంది. తేన్ కాడ్ చాలా దట్టమైన అటవీ ప్రాంతం. అనేక క్రూరమృగాలకు .. పెద్దసంఖ్యలోని ఏనుగులకు ..భయంకరమైన విషసర్పాలు అది ఆలవాలం. అలాంటి అటవీ ప్రాంతాన్ని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. సాయంత్రం 6 గంటల తరువాత అడవిలోకి వెళ్లడానికి ఫారెస్టు అధికారులే భయపడే ప్రాంతం అది. అలాంటి ఆ ప్రాంతంలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. 

ఒక లారీ డ్రైవర్ .. ఒక కాంట్రాక్టర్ .. ఒక టీ ఫ్యాక్టరీ యజమాని .. ఇలా ఒక్కొక్కరూ హత్యకి గురవుతూ ఉంటారు. హత్యకి గురైనవారి శవాలు చెట్ల మొదళ్లలో .. కొమ్మల మధ్యలో లభిస్తూ ఉంటాయి. శవాల చుట్టూ బలమైన సాలెగూడు వంటి ఒక అల్లిక కనిపిస్తూ ఉంటుంది. ఈ హత్యల కారణంగా ఆ చుట్టుపక్కల గ్రామస్థులు బయటికి రావడానికే భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ కేసు 'ఇన్ స్పెక్టర్ రిషి' (నవీన్ చంద్ర)కి అప్పగించబడుతుంది. దాంతో ఆయన రంగంలోకి దిగుతాడు.

రిషి .. విజీ (హరిణి సుందరరాజన్) ప్రేమించుకుంటారు. అయితే తన పట్ల ఆమెకి గల ప్రేమ అనుమానంగా మారిందనే విషయాన్ని రిషి గ్రహిస్తాడు. తనపై నిఘా పెట్టే పనులు మానుకోమనీ, తన వృత్తి కారణంగా తాను అన్ని విషయాలను బయటకి చెప్పలేనని అంటాడు. అయినా ఆమె వినిపించుకోదు. ఒకానొక సంఘటన కారణంగా ఆమె చనిపోతుంది. అయితే అప్పుడపుడు ఆమె ప్రేతాత్మ అతనికి కనిపిస్తూనే ఉంటుంది. తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటుంది.    

విజీ జ్ఞాపకాలు అప్పుడప్పుడు రిషిని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి రిషి .. తేన్ కాడ్ ప్రాంతానికి సంబంధించిన డిపార్టుమెంట్ అధికారులు అయ్యన్నర్ (కన్నా రవి) చిత్ర (మాలిని జీవరత్నం) ను కలుసుకుంటాడు. ముగ్గురూ కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ వెళుతుంటారు. చనిపోవడానికి ముందు వాళ్లంతా మానసికపరమైన ఆందోళనకి .. భయానికి గురైనట్టుగా రిషి తెలుసుకుంటాడు. అరణ్యంలో ఒక స్త్రీ ఎర్రని చీరకట్టుకుని వికృతమైన రూపంలో చాలామందికి కనిపించిందనే విషయం కూడా అతనికి తెలుస్తుంది. 

అడవిలో తిరుగుతూ హత్యలు చేస్తున్నది 'వనదేవత' అనే విశ్వాసాన్ని కొంతమంది వ్యక్తం చేస్తారు. వనదేవతను తాము చూసినట్టుగా కొంతమంది ధైర్యం చేసి చెబుతారు. 'వనదేవత' అడవిలో తిరగడం అనే విషయాన్ని రిషి కొట్టిపారేస్తాడు. హత్య జరిగిన తరువాత పెద్దగా సమయం లేకుండానే ఆ బాడీల చుట్టూ అంత వేగంగా గూడుకట్టుకోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  అదెలా సాధ్యమనే దిశగా కూడా అతని పరిశోధన మొదలవుతుంది. ఈ కేసు పరిశోధనలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేదే మిగతా కథ. 

ఈ కథ అంతా కూడా అడవి నేపథ్యంలో .. ఫారెస్టు ఆఫీసుల చుట్టూ .. గిరిజన గూడాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది 10 ఎపిసోడ్ల కథ. పదో ఎపిసోడ్ వరకూ వెళ్లాలంటే ముందుగా ఉన్న తొమ్మిది ఎపిసోడ్స్ ఒకదానికిమించి మరొకటి ఉండాలి. మరి ఈ సిరీస్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే, ఉందనే చెప్పాలి. అంచనాలకు మించి ఏమీ ఉండదు .. కానీ సస్పెన్స్ ను రివీల్ చేస్తూ వెళ్లిన తీరు .. కారణాలు చెబుతూ వెళ్లిన విధానం ఆకట్టుకుంటాయి. కాకపోతే చివర్లో ఉన్న కాస్త గందరగోళాన్ని తగ్గిస్తే మరింత బాగుండేది. 

జరుగుతున్న హత్యలను వనదేవత చేస్తుందా? లేదంటే అక్కడి వ్యవస్థను భయభ్రాంతులు గురిచేయడానికి స్మగ్లర్లు అలా చేస్తున్నారా? చేతబడి చేస్తుందనే ఆరోపణులు ఎదుర్కుంటున్న మంగై దీనికి కారకురాలా? లేదంటే ప్రేతాత్మగా మారిన రిషి భార్య విజీ ఇదంతా చేస్తుందా? అనే సందేహాలను రేకెత్తిస్తూ దర్శకుడు చివరివరకూ ఆసక్తికరంగా ముందుకు తీసుకుని వెళ్లిన తీరు బాగుంది. దర్శకుడు ప్రతి పాత్రను డిజైన్ చేసుకున్న తీరు .. వాటిని రిజిస్టర్ చేసిన విధానం మెప్పిస్తుంది. 

ఈ తరహా కథలను ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకుని వెళ్లేవి ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం అనే చెప్పాలి. భార్గవ్ శ్రీధర్ కెమెరాపనితం పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఫారెస్టు నేపథ్యంలో షాట్స్ ను .. రెయిన్ సీన్స్ ను .. చీకటి నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక అశ్వథ్ నేపథ్య సంగీతం అలరిస్తుంది. వనదేవత రావడానికి ముందు వచ్చే సౌండ్ ఎఫెక్ట్ ఈ సిరీస్ లో అత్యంత కీలకం. ఆయన అందించిన సంగీతం సన్నివేశాలతో కలుపుకుని ప్రయాణం చేయిస్తుంది. ఎడిటింగ్ కూడా ఓకే.      

నవీన్ చంద్ర ఇప్పుడు పోలీస్ రోల్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. ఈ సిరీస్ లోను ఆయన నటనకి మంచి మార్కులు పడతాయి. ఇక ఫారెస్టు గార్డుగా చేసిన సునైనతో పాటు, మిగతా వాళ్లంతా చాలా సహజంగా నటించారు. నిజానికి ఎపిసోడ్స్ నిడివి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే డీటేల్డ్ గా చెప్పాలనే మేకర్స్ ఫిక్స్ అయ్యారు. చివరివరకూ సస్పెన్స్ ను హోల్డ్ చేస్తూ వెళ్లిన తీరు బాగుంది. కానీ చివర్లో కాస్త స్పష్టత ఇచ్చి ఉంటే, ఇంకాస్త బాగుండేదనిపిస్తుంది. అలాగే చిత్ర ట్రాక్ కూడా అనవసరమనిపిస్తుంది. ఒకటి రెండు మైనస్ పాయింట్స్ ను పక్కన పెడితే, ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వెబ్ సిరీస్ ల స్థానంలో ఈ సిరీస్ కూడా చేరుతుందని చెప్పచ్చు.


ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. నవీన్ చంద్ర యాక్షన్ .. లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్: ఎపిసోడ్స్ నిడివి .. చిత్ర ట్రాక్ ..  చివర్లో క్లారిటీ లోపించడం  

Movie Name: Inspector Rishi

Release Date: 2024-03-29
Cast: Naveen Chandra, Srikrishna Dayal, Kanna Ravi, Malini Jeevarathnam,Sunaina, Kumaravel
Director: J S Nandhini
Music: Ashwath
Banner: Make Believe Productions

Inspector Rishi Rating: 3.25 out of 5

Trailer

More Reviews