క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ ను ఎక్కువమంది ఆడియన్స్ ఇష్టపడతారు. తెరపై ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య కేసులో అనేక రకాల అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి. హంతకుడిని పట్టుకోవడమనేది క్లిష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది? అనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక కంటెంట్ తో 'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టిన సినిమానే 'మర్డర్ ముబారక్'. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ ఢిల్లీలో మొదలవుతుంది .. ధనవంతులే మెంబర్స్ గా 'ఢిల్లీ రాయల్ క్లబ్' నడుస్తూ ఉంటుంది. అలాంటి ఆ క్లబ్ లో ఓ రోజున ఒక మర్డర్ జరుగుతుంది. జుంబా ట్రైనర్ లియో ( అషిమ్ గులాటి) హత్య చేయబడతాడు. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఏసీపీ భవాని శంకర్ ( పంకజ్ త్రిపాఠి) రంగంలోకి దిగుతాడు. ఆ క్లబ్ కి తరచూ వచ్చేవాళ్లంతా చాలా ధనవంతులు. అందువలన ఈ కేసును చాలా సున్నితంగా పరిష్కరించాలని ఆయన భావిస్తాడు.
ఆ క్లబ్ కి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్) బాంబీ (సారా అలీ ఖాన్) కుకీ ( డింపుల్ కపాడియా) రోషిణి (టిస్కా చోప్రా) రణ్ విజయ్ సింగ్ (సంజయ్ కపూర్) తరచూ వెళుతూ ఉంటారు. ఇక లాయర్ గా పనిచేస్తున్న ఆకాశ్ ( విజయ్ వర్మ) కూడా ఆ క్లబ్ కి వెళుతూ ఉంటాడు. ఈ అందరూ కూడా అసలు అక్కడ హత్యే జరగనట్టుగా తమ పనులు చేసుకుని వెళుతూ ఉంటారు. భవాని శంకర్ ప్రశ్నలను లైట్ తీసుకుంటూ ఉంటారు.
లియో ఒక అనాథ .. అతను షెఫర్డ్ అనాథాశ్రమంలో పెరిగాడు. అలాంటి ఆయన ఈ క్లబ్ కి వచ్చిన వాళ్లందరికీ అనేక మార్లు కాల్ చేసినట్టుగా భవాని శంకర్ పరిశీలనలో తేలుతుంది. అలాగే లియో పెరిగిన అనాథాశ్రమానికి వీరంతా విరాళాలు ఇస్తూ వెళ్లడం బయటపడుతుంది. అంటే లియో వాళ్లందరినీ బ్లాక్ మెయిల్ చేశాడనే విషయం భవానీశంకర్ కి అర్థమవుతుంది. అయితే ఏ విషయంపై ఆయన వాళ్లందరినీ బ్లాక్ మెయిల్ చేసుంటాడు అనేది మాత్రం అర్థం కాదు.
ఈ నేపథ్యంలోనే బాంబీ భర్త అన్శూల్ చనిపోయి మూడేళ్లు అవుతుందనే విషయం భవానీ శంకర్ కి తెలుస్తుంది. ఆమె ఆకాశ్ తో సాన్నిహిత్యంగా ఉండటం ఆయన గమనిస్తాడు. అలాగే ఆ క్లబ్ లో పనిచేసే గంగ ( తార అలీషా) భర్త అజయ్ కుమార్ కనిపించకుండా పోయాడని తెలుసుకుంటాడు. ఆమెతో రణ్ విజయ్ కి అక్రమ సంబంధం ఉందని వింటాడు. అలాగే నూరాని గురించి కూడా అనేక విషయాలు ఆయన చెవిన పడతాయి. అప్పుడు భవాని శంకర్ ఏం చేస్తాడు? ఆయన విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అసలు హంతకులు ఎవరు? అనేది మిగతా కథ.
ఈ కథ అంతా కూడా ఎక్కువగా మర్డర్ చుట్టూ .. ఆ మర్దర్ జరిగిన క్లబ్ చుట్టూ తిరుగుతుంది. సాధారణంగా మర్డర్ మిస్టరీ కథల్లో చాలామందిని అనుమానాస్పదంగా చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని మళ్లిస్తూ .. హంతకులెవరబ్బా? అనే ఒక అయోమయంలో ఉంచుతుంటారు. కానీ ఈ కథలో ఆ ప్రక్రియ చాలా సహజంగా జరుగుతుంది. ఇక పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో దిగుతూనే గందరగోళం చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ కూడా వేసుకోకుండా కూల్ గా కేసును ఛేదించడం కొత్తగా కనిపిస్తుంది.
ఈ క్రైమ్ థ్రిల్లర్ కి కామెడీ టచ్ ఇచ్చారు. అలాగే రొమాన్స్ ను కావలసినంత అద్దారు. సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరక్కపోవడం వలన, నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఆడియన్స్ లో కనిపించదు. సాదా సీదా స్క్రీన్ ప్లేతో .. పొడి పొడి సన్నివేశాలతోనే చాలా సమయం గడిచిపోతుంది. ఇక మరో 40 నిమిషాల్లో ముగింపు ఉందనగా అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి కథనం కాస్త పుంజుకుంటుంది. కథలో మలుపులు చోటుచేసుకుంటూ ఉంటాయి.
లియో ఎవరెవరిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశాడు? బాంబీ భర్త ఎలా చనిపోయాడు? గంగ భర్త ఏమైపోయాడు? అనే ప్రశ్నలకు సమాధానాలుగా కనిపించే ఫ్లాష్ బ్యాక్ లు ఆసక్తి కరంగానే అనిపిస్తాయి. కథను చాలా సేపు .. చాలా వరకూ అలా వదిలేసి, అన్ని మలుపులను .. ట్విస్టులను వెంటవెంటనే ఇస్తూ వెళ్లారు. ఇక్కడ ఈ ట్విస్టులు ఉంటాయని తెలియని ప్రేక్షకులు అక్కడి వరకూ కాస్త అసహనంగానే కదులుతూ ఉంటారు.
స్టార్ స్టేటస్ ఉన్న ఆర్టిస్టులు ఎక్కువమంది ఉండటమనేది ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా చాలా అందంగా మెరిసింది. అయితే ఈ సినిమాలో ఒక సాధారణమైన పాత్రను పోషించిన 'తార అలీషా బెర్రీ' ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది. ఎంత సింపుల్ గా చూపించినా, కనిపించే ఆ కాసేపట్లోనే ఆమె ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది.
లినేష్ దేశాయ్ ఫొటోగ్రఫీ .. సచిన్ - జిగర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. అక్షర ప్రభాకర్ ఎడిటింగ్ ఫరవాలేదు. ఇన్వెస్టిగేషన్ జరిపే తీరు కొత్తగానే అనిపిస్తుంది. అదే సమయంలో అసహనానికి గురిచేస్తుంది. అదే స్టైల్లో కథనాన్ని పరిగెత్తించి ఉంటే బాగుండేది. ఇక పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంటే, అందుకు సంబంధించిన పాత్రలు కూల్ గా ఉంటే, ఆడియన్స్ లో కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. అన్నివిషయాలు చివర్లో చెబుదాములే అనే ఒక ఆలోచనతో అక్కడి వరకూ వెయిట్ చేయించకపోతే, ఈ సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమో.
'మర్డర్ ముబారక్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews
Murder Mubarak Review
- సారా అలీఖాన్ ప్రధాన పాత్రగా 'మర్డర్ ముబారక్'
- ఒక మర్డర్ చుట్టూ తిరిగే కథ
- చివరివరకూ సాగదీస్తూ వెళ్లిన దర్శకుడు
- అక్కడక్కడా తెరపైకి వచ్చే అభ్యంతరకర సన్నివేశాలు
- కథ అంతా చివరి 40 నిమిషాల వరకూ దాచడమే లోపం
Movie Name: Murder Mubarak
Release Date: 2024-03-15
Cast: Pankaj Tripathi,Sara Ali Khan,Vijay Varma,Karisma Kapoor,Dimple Kapadia,Sanjay Kapoor
Director: Homi Adajania
Music: Sachin–Jigar
Banner: Maddock Films
Review By: Peddinti
Murder Mubarak Rating: 2.75 out of 5
Trailer