ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి ఎక్కువగా థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ తో .. కామెడీ టచ్ ఇస్తూ సాగే కంటెంట్ తో వచ్చే సిరీస్ లు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి క్రమంలో వచ్చిన 'సేవ్ ద టైగర్స్' ఆ లోటును భర్తీ చేసింది. 6 ఎపిసోడ్స్ తో క్రితం ఏడాది వచ్చిన ఫస్టు సీజన్ మంచి మార్కులు తెచ్చుకోవడంతో, ఏడు ఎపిసోడ్స్ తో సెకండ్ సీజన్ ను రూపొందించారు. ఈ రోజు నుంచే ఈ తెలుగు సిరీస్ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
రవి గంట (ప్రియదర్శి) పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతని భార్య హైమావతి (జోర్దార్ సుజాత) గేటెడ్ కమ్యూనిటీకి మారిపోవాలని భర్తను పోరుతూ ఉంటుంది. ఇక రాహుల్ (అభినవ్ గోమఠం) సినిమా రచయిత కావాలనే ఉద్దేశంతో చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ మానేస్తాడు. అతని భార్య మాధురి (పావని గంగిరెడ్డి) డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇక విక్రమ్ (కృష్ణ చైతన్య) ఓ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య రేఖ (దేవియాని శర్మ) లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కొన్ని సంఘటనలు ఈ మూడు జంటలను ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారుస్తాయి. హీరోయిన్ హంసలేఖ కిడ్నాప్ కేసులో రవి .. రాహుల్ .. విక్రమ్ చిక్కుకోవడంతో ఫస్టు సీజన్ ముగుస్తుంది. ఆ తరువాత నుంచి సెకండ్ సీజన్ మొదలవుతుంది.
హంసలేఖ కేసు నుంచి బయటపడిన తరువాత ఆమెతో రవికి మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆ పరిచయాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవడం కోసం, రవిని కార్పొరేటర్ ను చేస్తానని ఎమ్మెల్యే శ్రీశైలం ఆశపెడతాడు. లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేయాలనుకున్న హంసలేఖకి రాహుల్ ను పరిచయం చేస్తాడు రవి. ఆమె కోసం రాహుల్ కథను రాయడం మొదలుపెడతాడు. విక్రమ్ కూడా ఆఫీసు పనులపైనే పూర్తిగా ఫోకస్ చేస్తాడు. అదే సమయంలో కొత్తగా ఆ ఆఫీసులో చేరిన హారిక, `విక్రమ్ ను మనసులోనే ఆరాధిస్తూ ఉంటుంది.
తమ భర్తలను తమ గుప్పెట్లో పెట్టుకోవడమెలా? అనే విషయంలో హైమావతి - మాధురి - రేఖ ముగ్గురు కూడా డాక్టర్ స్పందన ( సత్యకృష్ణ)ను కలుస్తారు. వివాహమైన ఏడేళ్ల తరువాత భార్యలపై భర్తలకు ఆకర్షణ తగ్గుతుందనీ, అలా జరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని స్పందన చెబుతుంది. ముగ్గురు స్నేహితురాళ్లు కూడా ఆమె చెప్పినట్టుగా చేయడానికి సిద్ధమవుతారు. ఇక రాహుల్ తన అపార్టుమెంటులో పెట్స్ కి సంబంధించిన గొడవలో ప్రధానమైన పాత్రను పోషిస్తాడు.
గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కోసం కలలు కంటున్న హైమావతికి, రవి ఆ డబ్బులను రాజకీయనాయకుడైన శ్రీశైలానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక విక్రమ్ తన ఆఫీసులో కొత్తగా చేరిన హారిక మాయలో పడిపోయాడనే వార్త, అతని భార్య రేఖ వరకూ వెళుతుంది. సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి చాలా కాలంగా సినిమా కథను రాస్తూ కూర్చున్న రాహుల్, ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో డీలాపడతాడు. తమ భర్తల విషయంలో ఆ భార్యలు ముగ్గురు ఏం చేస్తారు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేది కథ.
ఈ కథపై ప్రదీప్ అద్వైతం .. విజయ్ .. ఆనంద్ కార్తీక్ కసరత్తు చేశారు. ఈ కథలో చాలా పాత్రలు ఉంటాయి .. ఆ పాత్రలకు ఇతర పాత్రలతో సంబంధం ఉంటుంది. కథలో ఎక్కడా ఎవరి పాత్ర వైపు నుంచి గ్యాప్ రాకుండా అన్నింటినీ కవర్ చేస్తూ నడిపించడం కష్టమైన విషయమే. అయినా ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథను అల్లుకుంటూ వచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. ఫస్టు సీజన్ లోని కథను వెంటనే గుర్తు చేస్తూ, కథను నడిపించిన విధానం మెప్పిస్తుంది.
దర్శకుడు అరుణ్ కొత్తపల్లి .. కథపై .. పాత్రలపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లాడు. అక్కడక్కడా ఎమోషన్స్ తో టచ్ చేస్తూనే, కామెడీ టచ్ తో హాయిగా నవ్వించాడు. ముఖ్యంగా రాహుల్ - మాధురి ఇంటి పనిమనిషి లక్ష్మీ (రోహిణి) పాత్రకి సంబంధించి రాసుకున్న ట్రాక్, ప్రతి ఎపిసోడ్ లోను నవ్వులు పూయిస్తూ ముందుకు వెళుతుంది. అలాగే అపార్టుమెంటులో సహజంగా కనిపించే పెట్స్ సమస్యను ఆవిష్కరించిన తీరు కూడా సందడి చేస్తుంది.
ఇక దర్శకుడు ప్రధానమైన ఆరు పాత్రలను ముగింపు వైపుకు నడిపించిన పద్ధతి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలలో సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించడం ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా సహజంగా కనెక్ట్ అవుతుంది. మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి వరకూ ఎక్కడా బోర్ కొట్టదు .. అనవసరమైన సీన్స్ కనిపించవు. ప్రతి పాత్రను రిజిస్టర్ చేయడం వలన .. ప్రతి సీన్ లో సోల్ ఉండేలా చూసుకోవడం వలన చివరివరకూ అలరిస్తుంది.
ఆర్టిస్టులంతా చాలా నేచురల్ గా చేశారు. ఈ కథంతా మన కాలనీలోనే జరుగుతోందని అనిపించేలా చేశారు. దర్శకుడి టేకింగ్ తో పాటు, అజయ్ అరసాడ నేపథ్య సంగీతం .. విశ్వేశ్వర్ ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ కథకి మరింత బలాన్నిస్తూ సాగాయి. ఆకర్షణకీ .. అనురాగానికి మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకుంటే, జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. ఏ ఇంట్లో ఉన్నామనే దానికంటే, ఎంత ప్రశాంతంగా ఉన్నామనేది ముఖ్యమనే సందేశాన్ని ఇచ్చిన కథ ఇది. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా చూడదగిన సిరీస్ ఇది.
'సేవ్ ద టైగర్స్ 2' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!
| Reviews
Save The Tigers 2 Review
- సీజన్ 2గా వచ్చిన 'సేవ్ ద టైగర్స్'
- ఆద్యంతం ఆకట్టుకునే కథాకథనాలు
- ఎమోషన్స్ ను టచ్ చేస్తూనే సరదాగా సాగిపోయే సీన్స్
- ఫస్టు సీజన్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన కంటెంట్
- సందేశాన్ని వినోదంతో కలిపి చెప్పిన సిరీస్
Movie Name: Save The Tigers 2
Release Date: 2024-03-15
Cast: Priyadarshai, Abhinav Gomatham, Chaitanya Krishna, Jordar Sujatha, Deviyani Sharma, Pavani Gangireddy
Director: Arun Kothapally
Music: Ajay Aarasada
Banner: Three Autumn Leaves
Review By: Peddinti
Save The Tigers 2 Rating: 3.50 out of 5
Trailer