మలయాళంలో పోలీస్ కథలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. క్లిష్టమైన కేసులు .. వాటికి సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు కథానాయకుడైన పోలీస్ వాటిని ఎలా ఛేదించాడు? అనే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ కథలు నడుస్తూ ఉంటాయి. అలాంటి కథతో వచ్చిన పోలీస్ ప్రొసీడల్ డ్రామానే 'అన్వేషిప్పిన్ కండెతుమ్'. ఫిబ్రవరి 9వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీన 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 1993లో కేరళ ప్రాంతంలో మొదలవుతుంది. మాథన్ అనే వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉంటారు. అందులో రెండో అమ్మాయి లవ్లీ (అనఘ) డిగ్రీ ఫస్టు ఇయర్ చదువుతూ ఉంటుంది. హాల్ టికెట్ కోసం కాలేజ్ కి వెళ్లిన లవ్లీ తిరిగి రాకపోవడంతో, ఆమె తండ్రి కంగారు పడతాడు. ఎస్.ఐ. ఆనంద్ నారాయణన్ (టోవినో థామస్) కి ఫిర్యాదు చేస్తాడు. వెంటనే ఆనంద్ నారాయణన్ తన టీమ్ తో రంగంలోకి దిగుతాడు. అయితే ఆ యువతి శవమై ఓ బావిలో తేలుతుంది. దాంతో ఆ యువతి తండ్రి కుప్పకూలిపోతాడు.
చనిపోవడానికి ముందు లవ్లీని చర్చి ఫాదర్ గెస్టు హౌస్ దగ్గర చూశామని ఆనంద్ నారాయణ్ కి ఒక వ్యక్తి చెబుతాడు. అయితే చర్చి ఫాదర్ థామస్ ను ప్రశ్నించడానికి ఆనంద్ నారాయణన్ పై అధికారిగా ఉన్న అలెక్స్ ఒప్పుకోడు. అయినా అసలైన నేరస్థుడిని చట్టానికి పట్టించే ప్రయత్నంలో, అనుకోని ఒక సంఘటనకి ఆనంద్ బాధ్యతను వహించవలసి వస్తుంది. ఫలితంగా ఆయనతో పాటు మిగిలిన ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్ అవుతారు.
అయితే ఆనంద్ సిన్సియారిటీ గురించి తెలిసిన ఎస్పీ రాజగోపాల్ (సిద్ధిఖీ), కొంతకాలం తరువాత అతనికి కబురు చేస్తాడు. 6 ఏళ్ల క్రితం హత్య చేయబడిన శ్రీదేవి అనే యువతి తాలూకు కేసు ఫైల్ ను ఆనంద్ చేతిలో పెడతాడు. ఎంతమంది అధికారులు ప్రయత్నించినా, హంతకులు ఎవరనేది తెలియలేదనీ, అనధికారికంగా ఆ కేసును పరిష్కరించమని చెబుతాడు. ఈ కేసును పరిష్కరిస్తే, తిరిగి అతను ఖాకీ బట్టలు వేసుకునే అవకాశం ఉండొచ్చని అంటాడు. అందుకు ఆనంద్ అంగీకరిస్తాడు.
ఎస్పీ రాజగోపాల్ చెప్పినట్టుగానే, సస్పెన్షన్ కి గురైన మిగిలిన ముగ్గురు కానిస్టేబుల్స్ ను వెంటబెట్టుకుని, శ్రీదేవి గ్రామమైన 'చెరువెల్లి' చేరుకుంటాడు. ఆ కేసుకు సంబంధించి తమకి సహకరించడానికి ఆ గ్రామస్థులెవరూ సిద్ధంగా లేరనే విషయం ఆనంద్ కి అర్థమైపోతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? శ్రీదేవిని ఎవరు హత్యచేశారు? ఎందుకు ఆ ఊళ్లోవారు పోలీసులకి సహకరించడం మానేశారు? అసలు అంతకుముందు లవ్లీ కేసులో ఆనంద్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అనేవి ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు.
డార్విన్ కురియకోస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఒక హత్యకేసు కోసం నిజాయితీగా పనిచేసి విధుల నుంచి తొలగించబడిన ఒక పోలీస్ అధికారి, మరో హత్య కేసులో అనధికారికంగా పనిచేసి, తిరిగి విధుల్లో చేరడమే ఈ కథ. ఇక మొదటి కేసు ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది? రెండవ కేసులో ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటాయి? అనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
దర్శకుడు ఈ కథను నత్త నడక నడిపించలేదు ... అలాగని హడావిడిగా పరిగెత్తించలేదు. చాలా సహజంగా ఈ కథ కొనసాగుతుంది. సినిమా పోలీసుల్లో కనిపించే ఆవేశం .. తొందరపాటు ... అరుపులు .. కేకలు .. ఫైట్లు ఈ కథలో మచ్చుకు కూడా కనిపించవు. మన కళ్లముందు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. అనవసరమైన సన్నివేశాలుగానీ .. సంభాషణలు గాని లేవు. ముఖ్యంగా బూతులు లేని సినిమా ఇది.
ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ అనే చెప్పాలి. ఫస్టాఫ్ లో వచ్చే ట్విస్ట్ ... క్లైమాక్స్ లోని ట్విస్ట్ ఈ సినిమా కథా బలాన్ని అమాంతంగా పెంచేస్తాయి. ఆ రెండు ట్విస్టులు కూడా ఫస్టాఫ్ ను .. సెకండాఫ్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ప్రధానమైన పాత్రలతో పాటు గ్రామస్తులందరినీ సన్నివేశాలలో ఇన్వాల్వ్ చేయడం మరో విశేషం. హీరోకి హీరోయిన్ గానీ .. ఆయనకు ప్రత్యక్షంగా ఎదురుపడే విలన్ గానీ లేకపోయినా, ఆ లోటు తెలియకుండా ఈ కథ ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా సహజంగా నటించారు. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచిందనే చెప్పాలి. గౌతమ్ శంకర్ కెమెరా పనితనానికి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. కథ ప్రకారం స్థానికంగా ఉన్న లొకేషన్స్ ను తెరపై అందంగా ఆవిష్కరించాడు. సైజు శ్రీధరన్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఎక్కడా వంక బెట్టడానికి వీల్లేని ఒక పెర్ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమా ఇది.
కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 40 కోట్లకి పైగా ఎలా వసూలు చేసిందనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నిజాయతీకి తాత్కాలికంగా పరీక్షలు ఎదురైనా, అంతిమ విజయం దానిదేనని నిరూపించే దిశగానే ఈ కథ నడుస్తుంది. చట్టం నుంచి నేరస్థుడు ఎప్పటికీ తప్పించుకోలేడనే విషయాన్ని మరోమారు చాటిచెబుతుంది. కుటుంబ సభ్యులంతా చూడదగిన సినిమానే ఇది. ఇక పోలీస్ కథలను ఇష్టపడేవారికి ఇది మరింత నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
'అన్వేషిప్పిన్ కండెతుమ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews
Anweshippin Kandethum Review
- టోవినో థామస్ నుంచి వచ్చిన పోలీస్ కథ
- ఫిబ్రవరి 9న విడుదలైన 'అన్వేషిప్పిన్ కండెతుమ్'
- తెలుగులో అందుబాటులోకి వచ్చిన సినిమా
- ఆసక్తికరమైన కథాకథనాలు
- కదలకుండా కూర్చోబెట్టేసే పెర్ఫెక్ట్ కంటెంట్
Movie Name: Anweshippin Kandethum
Release Date: 2024-03-08
Cast: Tovino Thomas, Siddique, Baburaj, Sadiq , Shammi Thilakan,Arthana Binu
Director: Darwin Kuriakose
Music: Santhosh Narayanan
Banner: Yoodlee Films -Theatre of Dreams
Review By: Peddinti
Anweshippin Kandethum Rating: 3.50 out of 5
Trailer