బాలీవుడ్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో .. ఒక సినిమాను గురించి చాలారోజుల పాటు అంతా మాట్లాడుకున్నారు. ఆ సినిమా పేరే '12th ఫెయిల్'. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విదు వినోద్ చోప్రా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, 2023 అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇన్ని రోజులుగా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, నిన్నటి నుంచి తెలుగుతో పాటు, ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 1997లో మొదలవుతుంది. మనోజ్ కుమార్ ( విక్రాంత్ మాసే) చంబల్ ప్రాంతానికి చెందిన యువకుడు. అక్కడి పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం చాలా వెనకబడిపోతోంది. తల్లిదండ్రులు .. ఒక సోదరుడు .. సోదరి .. నాయనమ్మ .. ఇది అతని కుటుంబం. మనోజ్ కుమార్ తండ్రి రామ్ వీర్ (హరీశ్ ఖన్నా) చేస్తున్న చిన్నపాటి ఉద్యోగమే ఆ కుటుంబానికి ఆధారం. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఎమ్ ఎల్ ఎ .. అతని మద్దతుదారుడి అవినీతి కారణంగా, రామ్ వీర్ సస్పెండ్ అవుతాడు. దాంతో ఆ కుటుంబం గడవడం మరింత కష్టమవుతుంది.
తన సస్పెన్షన్ విషయంలో న్యాయపోరాటం చేయడానికి రామ్ వీర్ పట్నం వెళతాడు. ఇప్పు జరగాలంటే మిగతా వాళ్లు కష్టపడాలి. తన సోదరుడితో కలిసి ఆటో నడుపుకోవాలని మనోజ్ కుమార్ అనుకుంటే, అందుకు కూడా ఎమ్ ఎల్ ఎ అడ్డుపడతాడు. ఆ సమయంలోనే మనోజ్ కుమార్ కి డీఎస్పీ దుష్యంత్ ( ప్రియాంశు ఛటర్జీ) తారసపడతాడు. ఆయనలోని నిజాయితీని చూసిన తరువాత, తాను కూడా పోలీస్ ఆఫీసర్ కావాలనే ఒక ఆలోచన మనోజ్ కుమార్ కి కలుగుతుంది. అది ఆశయంగా మారడానికి ఎంతో సమయం పట్టదు.
మనోజ్ కుమార్ ఆశయాన్ని అర్థం చేసుకున్న అతని నాయనమ్మ, తాను దాచుకున్న డబ్బులిచ్చి, అతను పట్నం వెళ్లడానికి సాయపడుతుంది. ఢిల్లీలో దిగడానికి ముందే తన బ్యాగ్ పోగొట్టుకున్న మనోజ్ కుమార్, ఆకలి తీర్చుకోవడానికీ .. ఆశ్రయాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్ట పడవలసి వస్తుంది. ఐపీఎస్ కావాలనేది అతని డ్రీమ్ గా మారిపోతుంది. ఆ కలను నిజం చేసుకోవడానికి వాష్ రూమ్స్ క్లీన్ చేయడం నుంచి, అన్ని పనులను చేయడం మొదలుపెడతాడు. ఉన్న కాస్త సమయంలోనే చదువుకుంటూ ఉంటాడు.
అలాంటి పరిస్థితుల్లోనే అతనికి శ్రద్ధ జోషి (మేథా శంకర్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె పట్ల అతనికి గల ఆకర్షణ ప్రేమగా మారుతుంది. తన మనసులోని మాటను చెప్పాలనుకునేసరికి ఆమె దూరమవుతుంది. ఆ బాధను పంచుకునేవారు లేకపోవడంతో, తిరిగి అతను తన ఊరుకు వెళతాడు. తన నాయనమ్మ చనిపోయిందని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తాను విజయాన్ని సాధిస్తాననే నమ్మకంతోనే అంతా ఎదురుచూస్తున్నారనే ఒక విషయం అతనికి అర్థమవుతుంది.
అప్పటికే అతను ఐపీఎస్ కావడానికి ఒకే ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. చివరిగా ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని, తాను ఐపీఎస్ ను సాధించాలనే మరింత పట్టుదలతో మళ్లీ ఢిల్లీ చేరుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమించాడనేదే కథ.
ఇది ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ జీవితచరిత్ర. అతని ప్రయాణాన్ని గురించి అనురాగ్ పాఠక్ ఒక పుస్తకం రాయగా, ఆ పుస్తకం ఆధారంగానే సినిమాను రూపొందించారు. ఒకానొక దశలో మనోజ్ కుమార్ 12th ఫెయిల్ అవుతాడు. అదే అతని జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పుతుంది. అందువలన ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ఈ టైటిల్ ను పెట్టడం జరిగింది. మనోజ్ కుమార్ కి తన జీవితంలో ఎదురైన కష్టాలు, వాటిని తట్టుకుని నిలబడుతూ ఆయన విజయాన్ని సాధించడమనేదే దర్శకుడు ప్రధానంగా తీసుకున్నాడు.
మొదటి నుంచి కూడా దర్శకుడు ఈ కథను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లాడు. పల్లెలో పెరిగిన ఒక యువకుడు, పట్నాన్ని చాలా దగ్గరగా చూసి కంగారు పడటం, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన లక్ష్యాన్ని మరవకపోవడం .. ఎలాంటి ఆకర్షణలు పలకరించినా తన దారిలో నుంచి పక్కకి వెళ్లకుండా ముందుకు సాగడం .. తన తండ్రి నుంచి నేర్చుకున్న నిజాయతీని వదలకపోవడం .. ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందనే చెప్పచ్చు.
ఈ సినిమా చూస్తున్నంత సేపు, ఇదంతా తెరపై కాకుండా హీరోను ఫాలో అవుతూ అతని కష్టాలను ప్రత్యక్షంగా చూస్తున్నామనే భావన కలుగుతుంది. హీరో ఫైనల్ ఇంటర్వ్యూను ఫేస్ చేయడం .. క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తాయి. దర్శకుడు ఈ సన్నివేశాలను గొప్పగా ఆవిష్కరించాడు. ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా తమ పాత్రల్లో జీవించారు. ఎవరూ కూడా తమ పాత్రలలో నుంచి బయటికి రావడం కనిపించదు.
శంతను నేపథ్య సంగీతం ఈ కథకి ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పాలి. రామభద్రన్ ఫొటోగ్రఫీ .. జస్ కున్వర్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. జీవితంలో పేదరికమే ప్రధానమైన శత్రువు. మిగతా పరిస్థితులన్నీ అది పంపించే అనుచరులే. ఒక వైపున వాటితో పోరాడుతూనే, మరో వైపున అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం చాలా కష్టమైన విషయం. అలా పోరాడిన ఓ విజేత కథనే ఇది. యూత్ లో ప్రతి ఒక్కరినీ కదిలించి .. ఆలోచింపజేసే కథ ఇది.
'12th ఫెయిల్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!
| Reviews
12th Fail Review
- క్రితం ఏడాది అక్టోబర్ 27న విడుదలైన సినిమా
- డిసెంబర్ 29వ తేదీన మొదలైన స్ట్రీమింగ్
- నిన్నటి నుంచి ఇతర భాషల్లో అందుబాటులోకి
- యువతకి స్ఫూర్తిని కలిగించే సినిమా
Movie Name: 12th Fail
Release Date: 2024-03-04
Cast: Vikrant Massey,Medha Shankar, Anant V Joshi, Anshumaan Pushkar, Priyanshu Chatterjee
Director: Vidhu Vinod Chopra
Music: Shantanu Moitra
Banner: Vinod Chopra Films
Review By: Peddinti
12th Fail Rating: 3.50 out of 5
Trailer